Apple discontinued these 6 popular gadgets in 2025: యాపిల్ సంస్థ ప్రతి ఏటా కొత్త ఉత్పత్తులను మార్కెట్లోకి ప్రవేశపెట్టినప్పుడల్లా, పాత మోడళ్లను నిలిపివేయడం ఒక ఆనవాయితీగా వస్తోంది. ఈ క్రమంలోనే 2025లో యాపిల్ తన పోర్ట్‌ఫోలియో నుండి ఆరు అత్యంత ప్రజాదరణ పొందిన గ్యాడ్జెట్లను తొలగించింది. కొత్తగా విడుదలైన ఐఫోన్ 17 సిరీస్, లేటెస్ట్ యాపిల్ వాచ్‌లకు మార్గం సుగమం చేస్తూ, ఈ నిర్ణయం తీసుకున్నట్లు టెక్ వర్గాలు పేర్కొంటున్నాయి.
రెండు క్రేజీ మోడల్స్ నిలిపివేసిన ఆపిల్
ఈ జాబితాలో ప్రధానంగా వినియోగదారులను ఆశ్చర్యపరిచినవి ఐఫోన్ 16 ప్రో (iPhone 16 Pro), ఐఫోన్ 16 ప్రో మాక్స్ (iPhone 16 Pro Max). గతేడాది టాప్-ఎండ్ మోడల్స్‌గా నిలిచిన ఇవి, ఐఫోన్ 17 ప్రో మోడల్స్ రాకతో అధికారిక వెబ్‌సైట్ నుండి కనుమరుగయ్యాయి. యాపిల్ తన ప్రీమియం ప్రో మోడల్స్ విక్రయాలను సాధారణంగా ఒక్క ఏడాదికే పరిమితం చేస్తుంది. తద్వారా కొత్త మోడళ్లపై వినియోగదారులు ఆసక్తి చూపిస్తారని సంస్థ భావిస్తోంది. అయితే, థర్డ్ పార్టీ రిటైలర్లు , ఇ-కామర్స్ సైట్లలో స్టాక్ ఉన్నంత వరకు ఇవి అందుబాటులో ఉంటాయి.
మార్కెట్‌లో స్టాక్ ఉన్నంత వరకూ అమ్మకాలు
స్మార్ట్ వాచ్ విభాగంలో కూడా భారీ మార్పులు చోటుచేసుకున్నాయి. యాపిల్ తన ఫ్లాగ్‌షిప్ రగ్గడ్ వాచ్ అయిన యాపిల్ వాచ్ అల్ట్రా 2 (Ap ple Watch Ultra 2) నిలిపివేసింది. దీని స్థానంలో అత్యాధునిక ఫీచర్లతో వచ్చిన 'అల్ట్రా 3' పై యాపిల్ దృష్టి సారించింది. అలాగే, బడ్జెట్ సెగ్మెంట్‌లో బాగా సేల్ అయిన యాపిల్ వాచ్ సిరీస్ 10 (Apple Watch Series 10) కూడా ఆపేశారు. వేగవంతమైన ప్రాసెసర్లు , మెరుగైన హెల్త్ సెన్సార్లతో కూడిన కొత్త జనరేషన్ వాచ్‌లను ప్రోత్సహించేందుకు యాపిల్ ఈ నిర్ణయం తీసుకుంది.
ప్రస్తుతం యాపిల్ స్టోర్లలో ఐఫోన్ 17 సిరీస్, ఐఫోన్ 16, ఐఫోన్ SE మోడళ్లు మాత్రమే అమ్మకం
వీటితో పాటు, పాత ఐఫోన్ మోడళ్లలో ఒకటైన ఐఫోన్ 15 (iPhone 15) , బడ్జెట్ ఆప్షన్ గా ఉన్న ఐఫోన్ 14 విక్రయాలను కూడా యాపిల్ అధికారికంగా ముగించింది. ఐఫోన్ 17 లాంచ్ కావడంతో, ఐఫోన్ 16 బేస్ మోడల్ ఇప్పుడు ఎంట్రీ లెవల్ ప్రీమియం ఫోన్‌గా మారింది. ప్రస్తుతం యాపిల్ స్టోర్లలో ఐఫోన్ 17 సిరీస్, ఐఫోన్ 16, ఐఫోన్ SE మోడళ్లు మాత్రమే ప్రధానంగా కనిపిస్తున్నాయి. యాపిల్ తీసుకున్న ఈ నిర్ణయం వల్ల పాత మోడళ్లపై ఆశలు పెట్టుకున్న వారికి కొంత నిరాశ ఎదురైనా, మార్కెట్లో ఇవి తక్కువ ధరకే లభించే అవకాశం ఉంది. కొత్త టెక్నాలజీని అందిపుచ్చుకోవడంలో భాగంగా యాపిల్ తన లైనప్‌ను ఎప్పటికప్పుడు ఇలా ప్రక్షాళన చేస్తూనే ఉంటుంది.