అమెజాన్ ప్రైమ్ వీడియో మొబైల్ ఎడిషన్ మనదేశంలో లాంచ్ అయింది. కంపెనీ వీడియో స్ట్రీమింగ్ సర్వీసులో ఇది చవకైన వెర్షన్. ప్రైమ్ వీడియో మొబైల్ ఎడిషన్‌ను గతేడాది ఎయిర్‌టెల్ భాగస్వామ్యంతో కంపెనీ లాంచ్ చేసింది. ఇప్పుడు ఈ మొబైల్ ఓన్లీ ప్లాన్ దేశం అంతా అందుబాటులోకి వచ్చింది.


ఈ సర్వీసును కంపెనీ సోమవారం అధికారికంగా లాంచ్ చేసింది. దీనికి కేవలం రూ.599 మాత్రమే వసూలు చేయనున్నారు. ఇది కేవలం ఒక యూజర్‌కు మాత్రమే అందుబాటులో ఉండనుంది. కేవలం స్మార్ట్ ఫోన్ ద్వారా మాత్రమే కంటెంట్ స్ట్రీమ్ చేయవచ్చు.


ఒక స్మార్ట్ ఫోన్‌లో స్టాండర్డ్ డెఫినిషన్ (ఎస్‌డీ) రిజల్యూషన్‌లో మాత్రమే వీడియోలు చూసే అవకాశం ఉంటుందని అమెజాన్ తెలిపింది. అమెజాన్ రెగ్యులర్ ప్రైమ్ సబ్‌స్క్రిప్షన్ తరహాలో మల్టీపుల్ ప్రొఫైల్స్, 4కే రిజల్యూషన్‌లో కంటెంట్ స్ట్రీమ్ చేయడం, స్మార్ట్ టీవీలు, కంప్యూటర్లలో స్ట్రీమ్ చేయడం వంటి ఆప్షన్లు కూడా లేవు.


ప్రైమ్ వీడియో వెబ్‌సైట్ ద్వారా వినియోగదారులు ఈ కొత్త వార్షిక సబ్‌స్క్రిప్షన్‌ను కొనుగోలు చేయవచ్చని అమెజాన్ తెలిపింది. అయితే వినియోగదారులు తమకు కావాల్సినప్పుడు ఫుల్ ప్రైమ్ వీడియో ఎక్స్‌పీరియన్స్‌కు కూడా అప్‌గ్రేడ్ చేసుకోవచ్చు. దీని ధర రూ.1,499గా ఉంది. అమెజాన్ ప్రైమ్ ద్వారా మ్యూజిక్ స్ట్రీమింగ్, ఫాస్ట్ డెలివరీలు కూడా పొందవచ్చు.


ఎయిర్‌టెల్ భాగస్వామ్యంతో అమెజాన్ మొబైల్ ఓన్లీ ప్లాన్‌ను గతేడాది లాంచ్ చేసింది. దీని ధర రూ.89గా ఉంది. దీంతోపాటు 28 రోజుల వ్యాలిడిటీతో 6 జీబీ డేటాను కూడా అందిస్తారు. దీంతోపాటు రూ.299 ప్లాన్ కూడా ఉంది. అమెజాన్ ప్రైమ్ వీడియో మొబైల్ ఎడిషన్‌తో పాటు రోజుకు 1.5 జీబీ డేటాను కూడా అందిస్తున్నారు. దీని వ్యాలిడిటీ 28 రోజులుగా ఉంది. నెట్‌ఫ్లిక్స్, వూట్, డిస్నీప్లస్ హాట్‌స్టార్ వంటి ఓటీటీలతో పోటీ పడాలని అమెజాన్ భావవిస్తుంది. ఈ మొబైల్ వెర్షన్ ద్వారా వీటితో పాటు నెట్‌ఫ్లిక్స్‌తో కూడా అమెజాన్ ప్రైమ్ పోటీ పడనుంది.


Also Read: ఐఫోన్ 14 సిరీస్ వ‌చ్చేసింది - ధర విషయంలో జాగ్రత్త పడ్డ యాపిల్ - మనదేశంలో ఎంతంటే?