Wrestlers Protest: నేనిక్కడ ఎవరి దయతోనో రాలేదు - కుట్రను ఛేదిస్తానంటూ రెజ్లర్లపై బ్రిజ్‌భూషణ్‌ రివర్స్‌ అటాక్‌!

Wrestlers Protest: తనపై రాజకీయ కుట్ర జరుగుతోందని రెజ్లింగ్‌ సమాఖ్య అధ్యక్షుడు బ్రిజ్‌ భూషణ్‌ శరణ్‌ సింగ్‌ అంటున్నారు. టోర్నీ నిర్వాహకులు ఏర్పాటు చేసిన కేంద్రాల్లోనే ఎవరైనా బస చేస్తారని పేర్కొన్నారు.

Continues below advertisement

Wrestlers Protest: 

Continues below advertisement

తనపై రాజకీయ కుట్ర జరుగుతోందని భారత రెజ్లింగ్‌ సమాఖ్య అధ్యక్షుడు బ్రిజ్‌ భూషణ్‌ శరణ్‌ సింగ్‌ అంటున్నారు. టోర్నీ నిర్వాహకులు ఏర్పాటు చేసిన కేంద్రాల్లోనే ఎవరైనా బస చేస్తారని పేర్కొన్నారు. సమాఖ్య పదవికి రాజీనామా చేసే ప్రసక్తే లేదంటున్నారు. మరోవైపు కుస్తీవీరులూ తగ్గడం లేదు. బ్రిజ్‌ భూషణ్‌పై ఎఫ్‌ఐఆర్‌ దాఖలు చేస్తామని హెచ్చరిస్తున్నారు. ఇప్పుడిది జాతీయ సమస్యగా మారిపోయిందని పేర్కొంటున్నారు.

ఒలింపిక్ పతక విజేతలు వినేశ్‌ ఫొగాట్‌, బజరంగ్‌ పునియా సహా ప్రధాన రెజ్లర్లు డబ్ల్యూఎఫ్‌ఐ అధ్యక్షుడు బ్రిజ్‌ భూషణ్‌ సింగ్‌కు వ్యతిరేకంగా పోరాడుతున్నారు. ఆయన్ను వెంటనే సమాఖ్య నుంచి తొలగించాలని డిమాండ్‌ చేస్తున్నారు. అలాగే సమాఖ్యనూ రద్దు చేయాలని కోరుతున్నారు. ఆయన వల్ల ఎంతో మంది మహిళా రెజ్లర్లు లైంగిక వేధింపులకు గురయ్యారని వినేశ్‌ ఫొగాట్‌ స్పష్టం చేసింది. దిల్లీలోని జంతర్‌ మంతర్‌ వద్ద నిరసనలకు నాయకత్వం వహిస్తోంది.

అమ్మాయిల గదులకు అడ్డంగా పడుకొనేవాడని ఓ మహిళా రెజ్లర్‌ చేసిన ఆరోపణలపై బ్రిజ్ భూషణ్‌ స్పందించారు. టోర్నీ నిర్వాహకులు ఏర్పాటు చేసిన ప్రదేశంలోనే ఎవరైనా బస చేస్తారని అన్నారు. 'టోర్నీ నిర్వాహకులే బస ఏర్పాటు చేస్తారు. ప్రతి దేశ జట్టుకు ప్రత్యేకమైన ప్రాంతాన్ని కేటాయిస్తారు. నేను గది తలుపు తెరిచే పడుకున్నానని ఆ మహిళా రెజ్లర్‌ ఆరోపించింది బల్గేరియా టోర్నీకి సంబంధించి కాదు' అని ఆయన వెల్లడించారు.

'నేనిక్కడ ఎవరి దయపై ఆధారపడి లేను. ప్రజలు ఎన్నుకోవడంతోనే వచ్చాను. నేనిప్పటి వరకు ఎవరితోనూ మాట్లాడలేదు. ఈ రోజు సాయంత్రం మీడియాతో మాట్లాడతాను. హరియాణా నుంచి 300 మంది అథ్లెట్లు ఇక్కడికి వచ్చారు. రెజ్లింగ్‌, మహిళా రెజ్లర్ల గౌరవంతో ఆడుకుంటున్న వారి రాజకీయ కుట్రలను బయట పెడతాను' అని బ్రిజ్‌ భూషణ్‌ ఫేస్‌బుక్‌లో రాశారు.

కుస్తీ వీరులూ తగ్గేదే లే అంటున్నారు. 'అథ్లెట్లు ఇక్కడికొచ్చి ఆందోళన చేయడం బాధాకరం. ఫలితంగా వారు సాధన చేయలేకపోతున్నారు. మేం భారత రెజ్లింగ్‌ సమాఖ్యకు వ్యతిరేకంగానే పోరాడుతున్నాం. మా డిమాండ్లు వినాలని ప్రధాన మంత్రి, హోం మంత్రి, కేంద్ర క్రీడల మంత్రిని కోరుతున్నాం. బ్రిజ్‌ భూషణ్‌ సింగ్‌ ఈ పోరాటాన్ని రాజకీయం చేస్తున్నారు' అని ఒలింపిక్‌ పతక విజేత బజరంగ్‌ పునియా అన్నాడు. తమ పోరాటంలో ప్రధాన మంత్రి జోక్యం చేసుకోవాలని వినేశ్ ఫొగాట్‌ కోరింది. సాయంత్రంలోగా తమకు అనుకూలంగా తీర్మానం చేయకపోతే శనివారం ఎఫ్‌ఐఆర్‌ దాఖలు చేస్తామని హెచ్చరించింది.

రెజ్లర్లకు న్యాయం జరగాలని ఒలింపిక్‌ పతక విజేత, బాక్సర్‌ విజేందర్‌ సింగ్‌ అన్నాడు. వారు చేసిన ఆరోపణలపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు. ఇందులో ఎవరెవరికి పాత్ర ఉందో తేల్చాలన్నారు. 'రెజ్లర్లు, అధికారులు, కేంద్ర క్రీడల మంత్రి మధ్య సాగిన చర్చలను లైవ్‌ రికార్డింగ్‌ చేయాలి. అప్పుడే వారేం చర్చించారో తెలుస్తుంది. ఎవరిది తప్పో, ఎవరిది ఒప్పో తెలుస్తుంది' అని ఆయన అన్నారు.

మరోవైపు బ్రిజ్‌ భూషణ్‌పై చర్యలు తీసుకోవాలని కోరుతూ భారత ఒలింపిక్‌ సంఘం అధ్యక్షురాలు పీటీ ఉషకు కుస్తీవీరులు లేఖ రాశారు. బజరంగ్‌ పునియా, వినేశ్‌ ఫొగాట్‌, సాక్షి మలిక్, రవి దహియా, దీపక్‌ పునియా దానిపై సంతకం చేశారు.

Continues below advertisement
Sponsored Links by Taboola