India fail to secure Paris Olympics spots but : ప్రపంచ టేబుల్‌ టెన్నిస్‌ టీమ్‌ ఛాంపియన్‌షిప్‌(World Team Table Tennis Championships 2024)లో భారత జట్ల పోరాటం ప్రిక్వార్టర్‌ ఫైనల్లోనే ముగిసింది. భారత మహిళల జట్టు 1-3తో చైనీస్‌ తైపీ చేతిలో ఓడగా.. పురుషుల జట్టు 0-3తో దక్షిణకొరియా చేతిలో పరాజయం పాలైంది. మహిళల మ్యాచ్‌లో తొలి విజయం భారత్‌కే దక్కింది. మనిక 11-8, 8-11, 4-11, 11-9, 11-9తో చెన్‌ జు యుపై గెలిచి జట్టును ఆధిక్యంలో నిలిపింది. రెండో సింగిల్స్‌లో శ్రీజ ఆకుల 6-11, 9-11, 5-11తో ప్రపంచ నెంబర్‌ 10వ ప్లేయర్‌ చెంగ్‌ యి చింగ్‌ చేతిలో ఓడింది. ఆ తర్వాత ఐహిక ముఖర్జీ, మనిక బత్ర వరుస మ్యాచ్‌ల్లో ఓడటంతో భారత్‌ నిష్క్రమించక తప్పలేదు. పురుషుల విభాగంలో హర్మీత్‌ దేశాయ్‌, శరత్‌కమల్‌, సత్యన్‌ నిరాశపరిచారు. 


అయినా ఒలింపిక్స్‌కు ఛాన్స్‌!
ఈ టోర్నీలో క్వార్టర్‌ఫైనల్‌ చేరివుంటే భారత జట్లకు నేరుగా ఒలింపిక్స్‌ బెర్తులు లభించేవి. ప్రిక్వార్టర్స్‌లో ఓడినా పురుషులు, మహిళల విభాగంలో భారత జట్లు ఒలింపిక్‌ బెర్తులు దక్కించుకునే అవకాశముంది. ర్యాంకింగ్స్‌లో మెరుగ్గా ఉండటమే కారణం. భారత మహిళల జట్టు 17వ ర్యాంకులో ఉండగా.. పురుషుల జట్టు 15వ స్థానంలో కొనసాగుతోంది. మార్చి 5న ర్యాంకింగ్స్‌ ఆధారంగా ప్రపంచ టేబుల్‌ టెన్నిస్‌ సమాఖ్య బెర్తులను కేటాయిస్తుంది.


నాకౌట్‌ చేరారిలా....
భారత పురుషుల, మహిళల జట్లు నాకౌట్‌ దశకు అర్హత సాధించాయి. గ్రూప్‌–1లోని చివరి లీగ్‌ మ్యాచ్‌లో భారత మహిళల జట్టు 3–2తో స్పెయిన్‌పై గెలిచి 7 పాయింట్లతో రెండో స్థానాన్ని దక్కించుకుంది. ఆకుల శ్రీజ, మనిక బత్రా కీలక సమయంలో రాణించడంతో భారత మహిళల జట్టు గ్రూప్‌-1 చివరి పోరులో 3-2తో స్పెయిన్‌ను ఓడించి నాకౌట్‌ చేరింది. తొలి రెండు సింగిల్స్‌లో ఓడిన శ్రీజ, మనిక.. రెండో సింగిల్స్‌లో గెలిచి భారత్‌కు విజయాన్ని అందించారు. మొదట శ్రీజ 9-11, 11-9, 11-13, 4-11తో మరియా చేతిలో, తర్వాత మనిక 11-13, 11-6, 11-8, 9-11, 7-11తో సోఫియా జాంగ్‌ చేతిలో తలొంచారు. కానీ ఐహిక ముఖర్జీ 11-8, 11-13, 11-8, 9-11, 11-4తో ఎల్విరా రాద్‌ను ఓడించి భారత్‌ను పోటీలోకి తెచ్చింది. ఆపై మనిక 11-9, 11-2, 11-4తో మరియాపై, శ్రీజ 11-6, 11-13, 11-6, 11-3తో సోఫియాపై నెగ్గి జట్టుకు విజయాన్ని అందించారు. దీంతో 4  మ్యాచ్‌ల్లో 3 విజయాలతో భారత్‌ రెండో స్థానంలో నిలిచింది.
 
పురుషుల జట్టు కూడా..
ప్రపంచ టేబుల్‌ టెన్నిస్‌ ఛాంపియన్‌షిప్‌లో  పురుషుల జట్టు కూడా నాకౌట్‌ చేరింది. గ్రూప్‌-3 చివరి పోరులో భారత్‌ 3-0తో న్యూజిలాండ్‌ను చిత్తు చేసింది. హర్మీత్‌ దేశాయ్‌ 11-5, 11-1, 11-6తో తిమోతిపై నెగ్గగా.. సత్యన్‌ 11-3, 11-7, 11-6తో అల్ఫ్రెడ్‌ డెలాపై, మనుష్‌ షా 6-11, 11-4, 11-8, 11-6తో హెండర్సన్‌పై గెలిచారు. 4 మ్యాచ్‌ల్లో 2 విజయాలతో మూడో స్థానంతో భారత్‌ ముందంజ వేసింది. అయితే ఈ ఓటమితో పురుషుల జట్ల పోరాటం ముగిసే ఉంది.