World Athletics Championships: ప్రపంచ అథ్లెటిక్స్  4X400 మీటర్ల  విభాగంలో భారత పురుషుల రిలే జట్టు సంచలన ప్రదర్శనతో ఫైనల్‌కు అర్హత సాధించింది.  ఒక్క దెబ్బకు రెండు పిట్టలు అన్న చందంగా ఫైనల్‌కు క్వాలిఫై కావడమే కాదు.. ఆసియా రికార్డును కూడా బద్దలుకొట్టి కొత్త చరిత్రను లిఖించింది. బుడాపెస్ట్ (హంగేరి) వేదికగా జరుగుతున్న  వరల్డ్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్స్‌లో భాగంగా శనివారం జరిగిన పురుషుల 4X400 మీటర్ల  హీట్స్‌లో  భారత బృందం  మహ్మద్ అనాస్, అమోజ్ జాకబ్, మహ్మద్ అజ్మల్, రాజేశ్ రమేశ్‌లు 2 నిమిషాల 59.05 సెకన్లలోనే రేసు ముగించి క్వాలిఫై రౌండ్‌లో రెండో స్థానంలో నిలిచారు. 


అనాస్, అమోజ్, అజ్మల్, రాజేశ్‌లు  చిరుతల్లా పరిగెత్తి  రెండో స్థానంలో నిలవడంతో  ఈ పోటీలలో భారత్ ఫైనల్‌కు అర్హత సాధించింది.  వరల్డ్ అథ్లెటిక్స్‌లో ఈ విభాగం (4X400)లో భారత్ ఫైనల్స్‌కు క్వాలిఫై  అవడం ఇదే తొలిసారి కావడం విశేషం.  దీంతో పాటు ఈ నలుగురూ కలిసి  నెలకొల్పిన  రికార్డు  (2 నిమిషాల 59.05 సెకన్ల) కూడా  ఆసియాలో ప్రథమ స్థానంలో నిలిచింది. గతంలో జపాన్ బ‌ృందం.. 2 నిమిషాల 59.51 సెకన్లతో ముందుండేది. ఇప్పుడు భారత్ జపాన్ రికార్డును బద్దలుకొట్టి ఆసియాలోనే ఫాస్టెస్ట్ టీమ్ రికార్డును నమోదు చేసింది. 






శనివారం ముగిసిన  4X400 రిలే పోటీలలో అమెరికా బృందం (ట్రెవర్ బసిట్, మాథ్యూ బోలింగ్, క్రిస్టోఫర్ బెయిలీ, జస్టిన్ రాబిన్సన్) 2 నిమిషాల 58.47 సెకన్లలోనే    హీట్స్‌ను పూర్తిచేసి అగ్రస్థానంలో నిలిచింది. రెండో స్థానంలో భారత్ నిలువగా గ్రేట్ బ్రిటన్,  బొట్స్‌వానా, జమైకా, ఫ్రాన్స్, ఇటలీ, నెదర్లాండ్స్ బృందాలు కూడా ఫైనల్స్‌కు అర్హత సాధించాయి.  నేడు (ఆదివారం) తుది పోరు జరుగనుంది. 


అందరి చూపు  గోల్డెన్ బాయ్ పైనే.. 


ఇవే పోటీలలో మరో భారత స్టార్ అథ్లెట్  నేడు పోటీలోకి దిగనున్నాడు.  టోక్యో ఒలింపిక్స్‌లో జావెలిన్ త్రోలో  స్వర్ణం నెగ్గిన  గోల్డెన్ బాయ్ నీరజ్ చోప్రా కూడా నేడు ఫైనల్స్‌లో తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాడు. గతేడాది ఇదే ఈవెంట్‌లో రజతంతో సరిపెట్టుకున్న  నీరజ్.. ఈసారి పతకం స్వర్ణం సాధిస్తాడని భారత అభిమానులు కోట్లాది ఆశలు పెట్టుకున్నారు. టోక్యో ఒలింపిక్స్‌తో పాటు డైమండ్ లీగ్‌లోనూ స్వర్ణం నెగ్గిన నీరజ్..  వరల్డ్  అథ్లెటిక్స్‌లో  సత్తా చాటి   పారిస్ ఒలింపిక్స్‌కు సన్నద్ధమవ్వాలని భావిస్తున్నాడు. ఇందుకు తగ్గట్టుగానే  చోప్రా.. రెండ్రోజుల క్రితమే ముగిసిన  క్వాలిఫై రౌండ్‌లో తొలి ప్రయత్నంలోనే జావెలిన్‌ను 88.77 మీటర్ల దూరం విసిరి ఫైనల్‌కు అర్హత సాధించడంతో అతడి మీద అంచనాలు అమాంతం పెరిగాయి.  ఫైనల్స్‌‌లో నీరజ్‌కు  జులియన్ వెబర్, వాద్లెచ్‌తో పాటు  చిరకాల  ప్రత్యర్థి పాకిస్తాన్‌కు చెందిన అర్షద్ నదీమ్  కూడా సవాల్ విసిరే అవకాశాలు మెండుగా ఉన్నాయి. మరి నీరజ్ ఈ సవాళ్లను ఎలా అధిగమిస్తాడనేది ఆసక్తికరంగా మారింది.


 









ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి   
Join Us on Telegram: https://t.me/abpdesamofficial