World Athletics Championships 2022: ప్రపంచ అథ్లెటిక్స్‌ ఛాంపియన్‌షిప్స్‌లో ఇద్దరు కుర్రాళ్లు చరిత్ర సృష్టించేలా కనిపిస్తున్నారు. మురళీ శ్రీశంకర్‌ (Murali Sreeshankar) పురుషుల లాంగ్‌జంప్‌ ఫైనల్‌కు అర్హత సాధించాడు. సైన్యంలో పనిచేస్తున్న అవినాశ్‌ సాబుల్‌ (Avinash Sable) 3000 మీటర్ల స్టీపుల్‌ ఛేజ్‌ ఫైనల్‌కు చేరుకున్నాడు. వీరిద్దరిలో ఎవరైనా పతకం గెలిస్తే అద్భుతమే!


ఈ సీజన్లో శ్రీశంకర్‌ నిలకడగా రాణిస్తున్నాడు. లాంగ్‌జంప్‌లో 8 మీటర్లు దూకి నేరుగా ప్రపంచ అథ్లెటిక్స్‌ ఫైనల్‌కు చేరుకున్నాడు. అతడి సహరులైన జస్విన్‌ అల్‌డ్రిన్‌ (7.79 మీ), మహ్మద్‌ అనీస్‌ యహియా (7.73 మీ) కన్నా మెరుగైన ప్రదర్శన చేశాడు. ఫైనల్‌ పోటీల్లో అతడిపైనే అందరి చూపూ నెలకొననుంది. ఎందుకంటే రెండు నెలల క్రితమే అతడు 8.36 మీటర్లు దూకడం గమనార్హం. ఇప్పటికే ప్రపంచ అథ్లెటిక్స్‌ ఫైనల్‌ చేరిన తొలి భారతీయుడిగా శ్రీశంకర్‌ రికార్డు సృష్టించాడు.




భారత సైన్యంలో పనిచేస్తున్న అవినాశ్‌ సాబుల్‌ సైతం ఇలాంటి ఘనతే అందుకున్నాడు. 8:8:75 నిమిషాల్లో పూర్తిచేసి 3000 మీటర్ల స్టేపుల్‌ ఛేజ్‌ ఫైనల్‌కు నేరుగా అర్హత సాధించాడు. అర్హత పోటీల్లో అతడు మూడో స్థానంలో నిలవడం గమనార్హం.


'ఒలింపిక్స్‌ తర్వాత నేను ఇంటికే పరిమితమయ్యాను. వ్యవసాయం చేశాను. కొవిడ్‌ రావడంతో నా ఆరోగ్యం దెబ్బతింది. బలహీనంగా మారాను. 8:30 నిమిషాల్లోనూ పరుగు పూర్తి చేయలేనేమోనని అనుకున్నాను. ఒకానొక దశలో ఒలింపిక్స్‌ నుంచీ తప్పుకోవాలని భావించా. ప్రతిష్ఠాత్మక పోటీల్లో పరుగెత్తడం కీలకమని కోచులు సూచించారు. అవకాశం వచ్చినప్పుడు ఎందుకు వదులుకుంటావని చెప్పారు. అప్పటికి నాకేమాత్రం ఆత్మవిశ్వాసం లేదు. నిరాశపడ్డాను' అని సాబుల్‌ మీడియాకు వివరించడం గమనార్హం.