పారిస్‌ ఒలింపిక్స్‌ షూటింగ్‌ విభాగంలో భారత్‌నుంచి మరో బెర్త్‌ ఖాయమైంది. పురుషుల 25 మీటర్ల ర్యాపిడ్‌ ఫైర్‌ ఈవెంట్‌లో విజయ్‌వీర్‌ సిద్ధూ విశ్వ క్రీడలకు అర్హత సాధించాడు. విజయ్‌ వీర్‌ ఒలింపిక్‌ బెర్త్‌ ఖాయం చేయడంతో భారత్‌ నుంచి పాల్గొనే షూటర్ల సంఖ్య 17కు పెరిగింది. ఆసియా ఒలింపిక్‌ క్వాలిఫయర్స్‌(Asia Olympic Qualifiers)  టోర్నీలో విజయ్‌వీర్‌(Vijayveer Sidhu) రజత పతకం గెలిచి విశ్వక్రీడలకు బెర్త్‌ ఖాయం చేశాడు. క్వాలిఫయింగ్‌ దశలో 577 పాయింట్లు సాధించిన విజయ్‌వీర్‌ నాలుగో స్థానంలో నిలిచాడు. ఫైనల్‌కు చేరిన ఆరుగురిలో నలుగురికి ఒలింపిక్స్‌కు అర్హత సాధించే అవకాశం ఉండగా అతనికి ఈ చాన్స్‌ లభించింది. చండీగఢ్‌కు చెందిన 21 ఏళ్ల వీర్‌ గత ఏడాది హాంగ్జూ ఆసియా క్రీడల్లో కాంస్యం సాధించాడు.

  



ఇప్పటికే రిథమ్‌ సాంగ్వాన్‌...
ఈ ఏడాది పారిస్‌ వేదికగా జరుగబోయే ఒలింపిక్స్‌(2024 Paris Olympics)లో పాల్గొనేందుకు మరో భారత షూటర్‌ బెర్త్‌ ఖాయం చేసుకుంది. హరియాణా యువ షూటర్‌ రిథమ్‌ సాంగ్వాన్‌(Rhythm Sangwan) భారత్‌ నుంచి పారిస్‌ ఒలింపిక్స్‌లో పాల్గొనబోయే 16వ షూటర్‌గా నిలిచింది. సాంగ్వాన్‌ ఆసియా క్వాలిఫయర్స్‌(Asia Qualifiers 2024) మహిళల 25 మీటర్ల స్పోర్ట్స్‌ పిస్టల్‌లో కాంస్య పతకం సొంతం చేసుకుంది. దీంతో ఒలింపిక్స్‌లో పాల్గొనే అవకాశాన్ని దక్కించుకుంది. 20 ఏళ్ల రిథమ్ సాంగ్వాన్‌కు ఆసియా క్వాలిఫయర్స్‌లో ఇది మూడో పతకం కావడం విశేషం. 10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌లో కాంస్య పతకం సాధించిన ఆమె.. 10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌ మిక్స్‌డ్‌ టీమ్‌ విభాగంలో అర్జున్‌ చీమాతో కలిసి రజత పతకం అందుకుంది. పారిస్‌ ఒలింపిక్స్‌కు భారత్‌ నుంచి ఇదివరకే 15 మంది షూటర్లు తమ బెర్తులను ఖాయం చేసుకున్నారు. రిథమ్‌ సాంగ్వాన్‌ అర్హతతో భారత్‌ నుంచి పారిస్ ఒలింపిక్స్‌లో పోటీపడే షూటర్ల సంఖ్య 16కి చేరింది. మిగతా క్వాలిఫయర్స్‌ పోటీల అనంతరం ఈ సంఖ్య మరింత పెరగొచ్చు. భారత్‌ తరఫున అత్యధికంగా టోక్యో ఒలింపిక్స్‌లో 15 మంది షూటర్లు బరిలో దిగారు. జకార్తాలో జరుగుతున్న ఆసియా క్వాలిఫయర్స్‌లోనే ఇషా సింగ్, వరుణ్‌ తోమర్‌ 10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్ విభాగంలో బంగారు పతకాలు సాధించి పారిస్ ఒలింపిక్స్‌ బెర్తులను ఖరారు చేసుకున్నారు. 2021లో జపాన్‌ వేదికగా ముగిసిన టోక్యో ఒలింపిక్స్‌లో భారత్‌.. 15 మంది షూటర్లతో బరిలోకి దిగగా తాజాగా ఆ సంఖ్య 16కు చేరింది. 


ఒలింపిక్స్‌కు తెలంగాణ షూటర్
ఆసియా ఒలింపిక్ క్వాలిఫ‌య‌ర్స్‌(Asian Olympic Qualifiers) లో భార‌త షూట‌ర్లు  అద‌ర‌గొట్టారు. తెలంగాణకు చెందిన స్టార్‌ షూటర్‌ ఈషా సింగ్ (Esha Singh)పారిస్ ఒలింపిక్స్(Paris Olympics) బెర్త్‌ను ఖరారు చేసుకుంది. జ‌కార్తా వేదిక‌గా జ‌రిగిన ఆసియా ఒలింపిక్ క్వాలిఫ‌య‌ర్ టోర్నమెంట్‌లో మ‌హిళ‌ల 10 మీట‌ర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో స్వర్ణప‌తకాన్ని గెల‌వ‌డం ద్వారా ఈషా ఒలింపిక్స్‌కు అర్హత సాధించింది. 10 మీట‌ర్ల ఎయిర్ పిస్టల్(Women’s 10-meter air pistol category) విభాగంలో ఈషా సింగ్ 243.1 స్కోరు చేసి స్వర్ణం కైవ‌సం చేసుకుంది. పాకిస్తాన్ కు చెందిన కిష్మలా త‌ల‌బ్ ర‌జ‌కాన్ని అందుకోగా, భార‌త్‌కు చెందిన రిథ‌మ్ సాంగ్వాన్క్యాంస ప‌త‌కాన్ని ముద్దాడింది. ఒలింపిక్ బెర్తును ఖాయం చేసుకున్న ఈషా సింగ్ పై ప్రశంస‌ల జ‌ల్లు కురుస్తోంది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ క‌ల్వకుంట్ల క‌విత(Kavitha) సోష‌ల్ మీడియా వేదిక‌గా ఈషాకు అభినంద‌న‌లు తెలిపారు. పారిస్ ఒలింపిక్స్ బెర్త్‌ను సొంతం చేసుకున్న తెలంగాణ ముద్దు బిడ్డ ఈషాసింగ్ కు శుభాకాంక్షలంటూ ట్వీట్‌ చేశారు. ఒలింపిక్ వేదిక‌పై స‌త్తా చాటాల‌ని కోరుకుంటున్నట్లు క‌విత ట్వీట్ చేశారు.