Venkatesh Iyer Injury: దులీప్ ట్రోఫీ సెమీఫైనల్ మ్యాచులో గాయపడిన టీమిండియా ఆల్ రౌండర్ వెంకటేశ్ అయ్యర్ నేడు మైదానంలోకి దిగలేదు. అతని స్థానంలో ఆదిత్య సర్వతేను సెంట్రల్ జోన్ జట్టులోకి తీసుకుంది. బంతి మెడ వెనుక తగలటంతో గాయపడిన అయ్యర్ ప్రస్తుతం బాగానే ఉన్నట్లు సమాచారం.


అసలేం జరిగిందంటే..


దులీప్ ట్రోఫీ సెమీఫైనల్ మ్యాచ్ సందర్భంగా శుక్రవారం వెస్ట్ జోన్- సెంట్రల్ జోన్ మధ్య రెండో రోజు  మ్యాచ్ జరిగింది. వెస్ట్ బౌలర్ చింతన్ గజా వేసిన 26వ ఓవర్లో అయ్యర్ సిక్సర్ బాదాడు. ఆ తర్వాత 28వ ఓవర్ బౌలింగ్ కు వచ్చిన గజా వేసిన బంతిని వెంకటేశ్ అయ్యర్ డిఫెన్స్ ఆడాడు. అది బౌలర్ దగ్గరకు వెళ్లటంతో.. అంతకుముందు సిక్సర్ కొట్టాడన్న ఆవేశంతో అతను విసురుగా అయ్యర్ పైకి విసిరాడు. అది అయ్యర్ మెడకు బలంగా తగిలింది. దీంతో అతను విలవిల్లాడాడు. అయ్యర్ ను తీసుకెళ్లడానికి అంబులెన్స్ మైదానంలోకి వచ్చింది. అయితే కాసేపటికి తేరుకున్న వెంకటేశ్ నడుచుకుంటూనే మైదానాన్ని వీడాడు. అప్పటికి 6 పరుగులతో ఉన్న అయ్యర్ రిటైర్డ్ హర్ట్ గా వెనుదిరిగాడు. 


నొప్పిని భరిస్తూనే బ్యాటింగ్


అనంతరం నొప్పిని భరిస్తూనే కష్టాల్లో ఉన్న తన జట్టు కోసం బ్యాటింగ్ కు వచ్చాడు. అయితే 14 పరుగులు చేసి ఔటయ్యాడు. ఈరోజు ఇంక అయ్యర్ మైదానంలోకి దిగలేదు. దగ్గర్లోని ఆసుపత్రిలో స్కానింగ్ చేయించుకున్న వెంకటేశ్ అయ్యర్ పరిస్థితి సాధారణంగానే ఉన్నట్లు తేలింది. బంతి విసిరిన గజాపై ఎటువంటి చర్యలు తీసుకోలేదు.


ఆధిక్యంలో వెస్ట్ జోన్ 


సెమీస్ లో తొలుత బ్యాటింగ్ చేసిన వెస్ట్ జోన్ జట్టు 257 పరుగులు చేసింది. తర్వాత బ్యాటింగ్ కు దిగిన సెంట్రల్ జోన్ 128 పరుగులకే ఆలౌట్ అయ్యింది. ప్రస్తుతం రెండో ఇన్నింగ్స్ లో వెస్ట్ జోన్ 3 వికెట్ల నష్టానికి 130 పరుగులతో కొనసాగుతోంది. పృథ్వీ షా 104 పరుగులతో అజేయంగా కొనసాగుతున్నాడు. ప్రస్తుతం వెస్ట్ జోన్ జట్టు 259 పరుగుల ఆధిక్యంలో ఉంది.