US Open 2023: భారత వెటరన్ టెన్నిస్ ఆటగాడు రోహన్ బోపన్న యూఎస్ ఓపెన్‌లో అప్రతీహాత విజయాలతో సాగుతూనే సరికొత్త చరిత్ర సృష్టించాడు. 43 ఏండ్ల వయసులో ఫైనల్ చేరిన తొలి ఆటగాడిగా రికార్డులకెక్కాడు. టెన్నిస్‌లో ఓపెన్ ఎరా యుగం మొదలయ్యాక గ్రాండ్‌స్లామ్ ఓపెన్ ఫైనల్ అత్యంత పెద్ద వయస్కుడిగా బోపన్న సరికొత్త చరిత్ర సృష్టించాడు. బోపన్నకు ఇది రెండో గ్రాండ్‌స్లామ్ కావడం విశేషం.
గురువారం రాత్రి న్యూయార్క్‌లోని లూయిస్ ఆర్మ్‌స్ట్రాంగ్ స్టేడియం వేదికగా జరిగిన పురుషుల డబుల్స్ సెమీస్‌లో రోహన్ బోపన్న తన ఆస్ట్రేలియన్ సహచరుడు మాథ్యూ ఎబ్డెన్ జోడీ.. 7-6 (7-3), 6-2 తేడాతో ఫ్రెంచ్ ధ్వయం నికోలస్ మహుత్, పెర్రీ హ్యూగ్స్ హర్బర్ట్‌లను ఓడించి యూఎస్ ఓపెన్ ఫైనల్స్‌కు అర్హత సాధించింది.
ఈ గేమ్‌లో భాగంగా ఆట ఆరంభం కాగానే తొలి సెట్‌ను 4-2తో కోల్పోయిన బోపన్న జోడీ.. టై బ్రేకర్‌లో పుంజుకుంది. 65 నిమిషాల పాటు సాగిన తొలి గేమ్‌ను తక్కువ మార్జిన్‌తో నెగ్గింది. అయితే రెండో గేమ్‌లో మాత్రం ఈ జోడీ జూలు విదిల్చింది. ఫ్రెంచ్ జోడీకి ఏమాత్రం అవకాశం చిక్కకుండా ఆటను వారి నుంచి దూరం చేసింది. రెండో గేమ్‌లో పూర్తి ఆధిపత్యం చెలాయించిన బోపన్న - ఎబ్డెన్‌లు ఫైనల్‌కు దూసుకెళ్లారు. ఈ జోడీ రెండో సెమీస్‌లో గెలుపొందిన జో సలిస్‌బురి (యూకే) - రాజీవ్ రామ్ (యూఎస్ఎ)లను ఫైనల్‌లో ఢీకొననుంది.
బోపన్న రికార్డు..
టెన్నిస్‌లో ఓపెన్ ఎరా ప్రారంభమయ్యాక గ్రాండ్ స్లామ్ ఫైనల్ ఆడుతున్న అత్యంత పెద్ద వయసున్న ప్లేయర్‌గా బోపన్న తన పేరును చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించాడు. ప్రస్తుతం బోపన్న వయసు 43 ఏండ్ల ఆరు నెలలు. గతంలో ఈ రికార్డు కెనడాకు చెందిన డానియల్ నెస్టర్ (43 ఏండ్ల 4 నెలలు) పేరిట ఉండేది. 2010లో బోపన్న ఇదే యూఎస్ ఓపెన్‌లో పాకిస్తాన్‌కు చెందిన ఐసాముల్ హక్ ఖురేషితో కలిసి ఫైనల్ ఆడాడు.
కోకో కేక..
అమెరికా యువ సంచలనం కోకో గాఫ్ సాధించింది. మహిళల ఓపెన్‌లో విలియమ్స్ సిస్టర్స్ తర్వాత ప్రభ కోల్పోయిన అమెరికా టెన్నిస్‌లో ఆ స్థానాన్ని భర్తీ చేసేందుకు వచ్చిన కోకో గాఫ్.. తన కెరీర్‌లో తొలిసారి యూఎస్ ఓపెన్ ఫైనల్ ఆడనుంది. గురువారం రాత్రి గాప్.. 6-4, 7-5 తేడాతో పదో సీడ్ చెక్ ప్లేయర్ కరోలినా ముచోవాను ఓడించింది. తద్వారా గాఫ్.. 1999 తర్వాత యూఎస్ ఓపెన్ ఫైనల్‌లో అడుగిడిన అత్యంత పిన్న వయస్కురాలైన అమెరికా క్రీడాకారిణిగా రికార్డులకెక్కింది. 1999లో సెరెనా విలియమ్స్ 17 ఏండ్ల వయసులోనే యూఎస్ ఓపెన్ ఫైనల్ చేరింది. ప్రస్తుతం గాఫ్ వయసు -19 సంవత్సరాలు. ఫైనల్‌లో ఆమె కీస్-సబలెంకల మధ్య జరిగే రెండో సెమీస్ పోరులో విజేతతో తలపడనుంది.
ఇక పురుషుల సెమీస్ మ్యాచ్‌లు శనివారం మొదలవుతాయి. తొలి సెమీస్‌లో అమెరికాకే చెందిన బెన్ షెల్టన్.. సెర్బియా స్టార్ నొవాక్ జకోవిచ్‌ను ఢీకొంటాడు. రెండో సెమీస్‌లో స్పెయిన్ స్టార్ కార్లోస్ అల్కరాజ్.. రష్యాకు చెందిన డానియల్ మెద్వెదెవ్‌తో తలపడతాడు.
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి
Join Us on Telegram: https://t.me/abpdesamofficial