US Open 2023: మహిళల  టెన్నిస్‌లో సుమారు దశాబ్దంన్నర పాటు   ఏకఛత్రాధిపత్యం  సాధించిన యూఎస్‌కు చెందిన విలియమ్స్ సిస్టర్స్ (వీనస్ విలియమ్స్, సెరెనా విలియమ్స్) తర్వాత   ప్రభ కోల్పోయి  ఒడిదొడుకులు ఎదుర్కుంటున్న అమెరికా టెన్నిస్‌లో కొత్త తార అవతరించింది. ఫ్లోరిడాకు చెందిన యువ సంచలనం కోకో గాఫ్ యూఎస్ ఓపెన్ - 2023 ఛాంపియన్ అయింది. మహిళల సింగిల్స్‌లో విలియమ్స్ సిస్టర్స్‌ను మరిపిస్తూ  ‘నేనున్నాను’ అంటూ అమెరికాకు కొత్త ధైర్యాన్ని అందించింది. యూఎస్ ఓపెన్  మహిళల సింగిల్స్ ఫైనల్‌లో కోకో గాఫ్.. 2-6, 6-3, 6-2 తేడాతో  రెండో సీడ్ అరీనా సబలెంకను ఓడించింది.


భారత కాలమానం ప్రకారం ఆదివారం తెల్లవారుజామున న్యూయార్క్‌లోని ఆర్థర్ ఆషే స్టేడియంలో ముగిసిన మహిళల సింగిల్స్ ఫైనల్స్‌లో  ఆరో సీడ్  కోకో గాఫ్ తొలి గేమ్‌ (2-6) నే కోల్పోయి చిక్కుల్లో పడింది.   కానీ ఆమె పుంజుకోవడానికి ఏమంత సమయం పట్టలేదు.  రెండో గేమ్ నుంచి జూలు విదిల్చిన గాఫ్.. దూకుడుగా ఆడటందో ఆరో సీడ్ సబలెంక  వెనుకబడింది. రెండో గేమ్ గాఫ్ గెలిచాక నిర్ణయాత్మక మూడో  గేమ్‌‌ను కూడా ఆమే సొంతం చేసుకోవడంతో  యూఎస్ ఓపెన్ టైటిల్ ఆమె వశమైంది. 


 






సెరెనా తర్వాత ఆమెనే.. 


ఈ విజయం ద్వారా  గాఫ్  కొత్త చరిత్ర సృష్టించింది.  ఈ 19 ఏండ్ల నల్లకలువకు ఇదే మేజర్ టైటిల్. గతేడాది ఫ్రెంచ్ ఓపెన్‌లో రన్నరప్‌గా నిలిచిన గాఫ్.. 1999లో సెరెనా విలియమ్స్ తర్వాత ఈ టోర్నీ నెగ్గిన తొలి అమెరికన్ టీనేజర్ కావడం గమనార్హం.  పిన్న వయసులోనే  యూఎస్ ఓపెన్ నెగ్గిన అమెరికన్ ఆటగాళ్లలో ట్రాసీ ఆస్టిన్, సెరెనా విలియమ్స్ తర్వాత ఆ ఘనత దక్కించుకున్న  ప్లేయర్  కోకోనే కావడం విశేషం. 






గాఫ్ ప్రయాణం సాగిందిలా.. 


యూఎస్ ఓపెన్‌ - 2023లో గాఫ్ తొలి రౌండ్‌లో అన్‌సీడెడ్ ప్లేయర్  సీగ్మండ్‌ను ఓడించింది. రెండో రౌండ్‌లో అండ్రీవా,  మూడో రౌండ్‌లో మెర్టెన్స్‌ను చిత్తు చేసి   ప్రీ క్వార్టర్స్‌కు ప్రవేశించింది. ఈ పోరులో వోజ్నియాకి‌తో  విజయం కోసం శ్రమించిన  గాఫ్.. క్వార్టర్స్‌లో డిఫెండింగ్ ఛాంపియన్  ఇగా  స్వియాటెక్‌ను ఓడించిన ఒస్టపెంకో‌ను అలవోకగా ఓడించింది.  ఇక సెమీస్‌లో  పదో సీడ్ కరోలినా ముచోవాను చిత్తు చేసిన  గాఫ్.. ఫైనల్ పోరులో సబలెంకను మట్టికరిపించి టైటిల్‌ను సొంతం చేసుకుంది.  


ఫైనల్‌లో జకో వర్సెస్ మెద్వెదెవ్.. 


మహిళల సింగిల్స్ ముగియడంతో ఇక అందరి కళ్లూ  పురుషుల సింగిల్స్ మీద కేంద్రీకృతమయ్యాయి.  శనివారం జరిగిన తొలి సెమీస్‌లో  వరల్డ్ నెంబర్ టూ నొవాక్ జకోవిచ్.. 6-3, 6-2, 7-6 (7-4) తేడాతో అమెరికాకే చెందిన బెన్ షెల్టన్‌‌ను ఓడించాడు. మరో సెమీస్‌లో  డిఫెండింగ్ ఛాంపియన్ కార్లోస్ అల్కరాజ్ (స్పెయిన్).. 6-7 (3-7), 6-3, 3-6 తేడాతో   మూడో సీడ్ డానిల్ మెద్వెదెవ్ ఓడించాడు. దీంతో ఫైనల్ పోరు  జకోవిచ్ - మెద్వెదెవ్ మధ్య  జరుగనుంది.  భారత కాలమానం  ప్రకారం నేటి రాత్రి  1.30 గంటలకు ఆ మ్యాచ్ మొదలుకానుంది. 

































ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి   
Join Us on Telegram: https://t.me/abpdesamofficial