టోక్యో ఒలింపిక్స్‌లో భారత ప్రస్థానం మొదలైంది. సీడింగ్ కోసం మహిళల, పురుషుల ఆర్చరీ పోటీలు జరిగాయి. ప్రపంచ నంబర్ వన్ దీపిక ఆశించిన స్థాయిలో రాణించలేదు. 




మహిళల వ్యక్తిగత ఆర్చరీ పోటీల్లో భారత క్రీడాకారిణి దీపికా కుమారి శుభారంభం చేసింది. సీడింగ్‌ కోసం నిర్వహించిన పోటీల్లో ఆమె తొమ్మిదో స్థానంలో నిలిచింది. కొరియా అమ్మాయి, దీపిక ప్రధాన ప్రత్యర్థి ఆన్‌ సాన్‌ ఒలింపిక్స్‌ రికార్డు నమోదు చేసింది.


ప్రపంచ నంబర్‌ వన్‌ దీపికా కుమారి 663 పాయింట్లు సాధించగా ఆన్‌ సాన్‌ 680 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది. తర్వాతి రౌండ్లో భూటాన్‌కు చెందిన కర్మతో దీపిక తలపడనుంది. ప్రస్తుతం ఆమె ర్యాంకు 193 కావడం గమనార్హం. ఆమెపై విజయం సాధించడం భారత ఆర్చర్‌కు సులువే. ఆన్‌ సాన్‌తో దీపిక క్వార్టర్‌ ఫైనల్లో తలపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. టోక్యోలోనే 2019లో జరిగిన ఒలింపిక్‌ అర్హత పోటీల్లో దీపికను ఆన్‌సాన్‌ వరుస సెట్లలో ఓడించింది.


టోక్యో ఒలింపిక్స్‌లో పురుషుల వ్యక్తిగత విలువిద్య పోటీల్లో భారత క్రీడాకారులు మోస్తరు ప్రదర్శన చేశారు. 72 బాణాల సీడింగ్‌ పోటీల్లో ప్రవీణ్‌ జాదవ్‌ 31, అతాను దాస్‌ 35, తరుణ్‌దీప్‌ రాయ్‌ 37 స్థానాల్లో నిలిచారు. తొలి అర్ధభాగంలో గట్టిపోటీనిచ్చిన అతాను దాస్‌ ఆఖరికి 653 పాయింట్లు మాత్రమే సాధించాడు. లక్ష్యానికి (ఎక్స్‌) 7 సార్లు మాత్రమే గురిపెట్టాడు. ప్రతి సెషన్లో తొలి మూడు బాణాలను బాగానే సంధించిన అతడు మిగిలిన వాటి ద్వారా ఎక్కువ పాయింట్లు రాబట్టలేదు.




ప్రవీణ్‌ జాదవ్‌ 656 పాయింట్లు సాధించాడు. లక్ష్యానికి 5 బాణాలు ఎక్కుపెట్టాడు. ఇక తరుణ్‌దీప్‌ 652 పాయింట్లు ఖాతాలో వేసుకున్నాడు. లక్ష్యానికి 6 బాణాలు గురి పెట్టాడు. ఇప్పుడు సాధించిన ర్యాంకుల ఆధారంగానే తొలి రౌండ్లో ప్రత్యర్థులను నిర్ణయిస్తారు. ఈ ముగ్గురి పాయింట్లను కలిపి బృంద ర్యాంకు ఇస్తారు. ఇక మిక్స్‌డ్‌ డబుల్స్‌లో మహిళల, పురుషుల వ్యక్తిగత విభాగాల్లో అగ్రస్థానాల్లో నిలిచిన పాయింట్ల ఆధారంగా ర్యాంకు కేటాయిస్తారు.


శనివారం ఆర్చరీలో పతక పోరు జరగనుంది. మరి మన క్రీడాకారులు ఏ పతకం గెలుస్తారో చూడాలి. ఆర్చరీలో పతకం గెలిస్తే టోక్యో ఒలింపిక్స్‌లో భారత్ ఖాతా తెరిచినట్టే. మరి మన ఆర్చరీ క్రీడాకారులు పతకానికి గురిపెడతారో లేదో చూద్దాం. ప్రపంచ నంబర్ వన్ అయిన దీపికపై భారీగా అంచనాలు ఉన్నాయి. ఆమె బంగారు పతకం గెలుస్తోందని అభిమానులు భావిస్తున్నారు. దీపిక గురి స్వర్ణం అవుతుందా?. ప్రస్తుత భారత జట్టును చూస్తే టోక్యో ఒలింపిక్స్ లో భారత్ 16 పతకాలు గెలుస్తోందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.