భారత్‌ వేదికగా జరుగుతున్న పరిమిత ఓవర్ల ప్రపంచకప్‌లో పరుగుల వరద పారుతోంది. ఇప్పటివరకు జరిగిన 10 మ్యాచుల్లోనే 12కు పైగా శతకాలు నమోదయ్యాయి. ఒకే మ్యాచ్‌లో నాలుగు శతకాలు కూడా నమోదయ్యాయి. ఈ ప్రపంచకప్‌లో బ్యాటర్లు ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్నారు. ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపిస్తూ తొలి బంతి నుంచే విధ్వంసకర ఇన్నింగ్స్‌లు ఆడుతున్నారు. అత్యధిక స్ట్రైక్‌ రేట్‌తో జట్టుకు విలువైన పరుగులు అందిస్తున్నారు. ఇప్పటివరకు జరిగిన మ్యాచ్‌ల్లో అత్యధిక స్ట్రైక్‌ రేట్‌ కలిగిన తొలి పది మంది ఆటగాళ్లు ఎవరో చూద్దాం.

 

కుశాల్‌ మెండీస్‌

ఈ ప్రపంచకప్‌లో అత్యధిక స్ట్రైక్‌ రేట్‌ కలిగిన ఆటగాడిగా శ్రీలంక బ్యాటర్ కుశాల్‌ మెండీస్‌ తొలి స్థానంలో ఉన్నాడు. పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో విధ్వంసకర శతకంతో చెలరేగిన కుశాల్‌ మెండీస్‌ 166.38 స్ట్రైక్‌ రేట్‌తో అగ్రస్థానంలో ఉన్నాడు. పాక్‌తో జరిగిన మ్యాచ్‌లో 77 బంతుల్లోనే 14 ఫోర్లు, 6 సిక్సుల సాయంతో 122 పరుగులు చేశాడు. పాక్ బౌలర్లందరినీ కుశాల్‌ ఊచకోత కోశాడు.

 

మార్‌క్రమ్‌

అత్యధిక స్ట్రైక్‌ రేట్‌ కలిగిన ఆటగాడిగా రెండో స్థానంలో దక్షిణాఫ్రికా బ్యాటర్‌ మార్‌క్రమ్‌ నిలిచాడు. 165.30 సగటుతో మార్‌క్రమ్‌ రెండో స్థానాన్ని ఆక్రమించాడు. శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో కేవలం 54 బంతుల్లోనే మార్‌క్రమ్‌ 106 పరుగులు సాధించాడు. ఇందులో 14 ఫోర్లు, 3 భారీ సిక్సర్లు ఉన్నాయి. ఆస్ట్రేలియాతో జరిగిన రెండో మ్యాచ్‌లోనూ మార్‌క్రమ్‌ 44 బంతుల్లో 56 పరుగులు చేసి సత్తా చాటాడు.

 

రోహిత్‌ శర్మ

టీమిండియా సారధి రోహిత్ శర్మ ఈ జాబితాలో 121.29 స్ట్రైక్‌ రేట్‌తో మూడో స్థానంలో ఉన్నాడు. ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో రాణించలేకపోయిన రోహిత్‌, అఫ్గానిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో రికార్డుల ఊచకోత కోశాడు. 84 బంతుల్లోనే 16 ఫోర్లు, అయిదు సిక్సర్లతో 131 పరుగులు చేశాడు. ప్రపంచకప్‌లో భారత్‌ తరపున అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాడిగానూ రోహిత్ రికార్డు సృష్టించాడు. 

 

సదీర సమరవిక్రమ

మరో శ్రీలంక ఆటగాడు సదీర సమరవిక్రమ 121.15 స్ట్రైక్‌ రేట్‌తో అత్యధిక స్ట్రైక్‌ రేట్‌ కలిగిన ఆటగాళ్ల జాబితాలో నాలుగో స్థానంలో నిలిచాడు. పాక్‌తో జరిగిన మ్యాచ్‌లో 89 బంతుల్లో 108 పరుగులు చేసి సత్తా చాటాడు. ఇందులో 11 ఫోర్లు, రెండు సిక్సర్లు ఉన్నాయి. దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లోనూ 19 బంతుల్లో 23 పరుగులు చేశాడు. 

 

జోస్‌ బట్లర్‌

ఈ జాబితాలో అయిదో స్థానంలో ఇంగ్లాండ్ ఆటగాడు జోస్‌ బట్లర్‌ ఉన్నాడు. 121.15 సగటుతో బట్లర్‌ అయిదో స్థానాన్ని ఆక్రమించాడు. తర్వాతి స్థానంలో 120.73 సగటుతో పాక్‌ ఆటగాడు షకీల్‌.... ఏడో స్థానంలో 118.36 స్ట్రైక్‌ రేట్‌ మరో ఇంగ్లాండ్‌ ఆటగాడు రచిన్‌ రవీంద్ర నిలిచారు. ఎనిమిదో స్థానంలో మరో లంక బ్యాటర్ అసలంక, తొమ్మిదో స్థానంలో డేవిడ్‌ మలన్‌, పదో స్థానంలో కాన్వే నిలిచారు. అత్యధిక స్ట్రైక్‌ రేట్‌ కలిగిన ఆటగాళ్ల జాబితాలో  ముగ్గురు శ్రీలంక ఆటగాళ్లకు చోటు దక్కగా.. భారత్‌ నుంచి రోహిత్‌ శర్మకు ఒక్కడికే స్థానం దక్కింది.