రెండు మ్యాచులు ఆడిన తర్వాత డగౌట్ లో కూర్చోవడం చాలా కష్టంగా ఉంటుందని టీమిండియా ఆల్ రౌండర్ అక్షర్ పటేల్ అన్నాడు. సోమవారం జింబాబ్వేతో జరిగిన మూడో వన్డేలో 10 ఓవర్లలో 30 పరుగులు ఇచ్చి 2 వికెట్లు తీశాడు అక్షర్. అందులో ఒక మెయిడిన్ ఓవర్ కూడా ఉంది. మ్యాచ్ అనంతరం మాట్లాడిన ఈ స్పిన్నర్ జట్టులో తన స్థానం గురించి కీలక వ్యాఖ్యలు చేశాడు. 


డగౌట్ లో కూర్చోవడం కష్టమే


రెండు మ్యాచుల్లో మంచి ప్రదర్శన చేసిన తర్వాత కూడా డగౌట్ లో కూర్చోవడం కొంచెం కష్టంగానే ఉంటుందని అక్షర్ పేర్కొన్నాడు. అయినా వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవడమే తన చేతిలో ఉందన్నాడు. తనకు వచ్చిన ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకోవాలనుకుంటున్నట్లు చెప్పాడు. తాను ఇక్కడ బాగా రాణిస్తే, తర్వాతి గేమ్ ఆడతానని అన్నాడు. ఒకవేళ బాగా ఆడినా తర్వాతి మ్యాచుకు అవకాశం రాకపోయినా దానినీ సానుకూలంగానే తీసుకుంటానని అక్షర్ తెలిపాడు. ఆ సమయంలో తనను తాను మెరుగుపరచుకోవడానికి ప్రయత్నిస్తానన్నాడు.


 సుస్థిరం స్థానం కోసం పోటీ
 
ఎడమ చేతి వాటం స్పిన్నర్ అయిన అక్షర్ పటేల్ లోయర్ మిడిలార్డర్ లో ఉపయుక్తమైన పరుగులు చేయగలడు. అయినా కూడా ఆ స్థానంలో రవీంద్ర జడేజా కుదురుకోవటంతో ఇప్పటికీ అక్షర్ కు జట్టులో స్థానం సుస్థిరం కాలేదు. అప్పుడప్పుడు వచ్చిన అవకాశాలను వినియోగించుకుని 2014 నుంచి వన్డేల్లో 50 వికెట్లు పడగొట్టాడు అక్షర్.


పిచ్ స్పిన్నర్లకు సహకరించింది
సోమవారం జరిగిన వన్డేలో పిచ్ కొంచెం పొడిగా ఉందని.. స్పిన్నర్లకు సహకరించిందని తెలిపాడు. అవతలి ఎండ్ నుంచి స్టంప్స్ లైనులో బౌలింగ్ చేసేందుకు ప్రయత్నించానని చెప్పాడు. దీంతో బ్యాటర్ తప్పు చేసే అవకాశం ఉందని.. దాంతో వికెట్లు వస్తాయని అన్నాడు. 


గిల్ బ్యాటింగ్ ఆకట్టుకుంది
గిల్ బ్యాటింగ్ చేస్తున్న విధానం, సింగిల్స్ ను డబుల్స్ గా మార్చే విధానం ఆకట్టుకున్నాయని అక్షర్ తెలిపాడు. స్ట్రైక్ రొటేట్ చేస్తాడని, డాట్ బాల్స్ ఎక్కువ ఆడడని తన సహచర ఆటగాడిని ప్రశంసించాడు. స్పిన్నర్లను బాగా ఆడతాడని.. స్వీప్, రివర్స్ స్వీప్ కూడా బాగా ఆడగలడని అన్నాడు. భారత బౌలింగ్ యూనిట్ గా తాము తమ ప్రణాళికలను పక్కాగా అమలు చేశామని చెప్పాడు. అవేష్ ఖాన్, శార్దూల్ ఠాకూర్ యార్కర్లు, వైడ్ యార్కర్లు బాగా వేశారని అన్నాడు. 


భవిష్యత్తులో రిజర్వ్ బెంచ్ ను పటిష్టం చేయడం కోసం భారత మేనేజ్ మెంట్ యువకులకు అవకాశం కల్పిస్తోంది. అగ్రశ్రేణి ఆటగాళ్ల పనిభారాన్ని నియంత్రించడం కోసం ఆటగాళ్లను రొటేట్ చేస్తోంది. ఈ క్రమంలోనే అక్షర్ ను జింబాబ్వే పర్యటనలో ఆడించింది. ఈ అవకాశాన్ని అతడు రెండు చేతులా అందిపుచ్చుకున్నాడు.