Team India captain Rohit Sharma playing gully cricket at Worli Mumbai : టీమ్‌ఇండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ (Rohit Sharma) విరామ సమయం ఆస్వాదిస్తున్నాడు. ఇంట్లో టీవీ చూస్తూ సేద తీరుతున్నాడు.  కుటుంబంతో కలిసి ఎంజాయ్‌ చేస్తున్నాడు. వీలు దొరికితే గల్లీ క్రికెట్‌ ఆడుతూ ఉత్సాహం పొందుతున్నాడు. ఆదివారం ముంబయిలోని వర్లీలో అతడు గల్లీ క్రికెట్‌ ఆడాడు. భారీ షాట్లు కొడుతూ అలరించాడు. చుట్టు పక్కల వారితో కలిసి సందడి చేశాడు. దీనిని ఎవరో వీడియో తీసి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. అది కాస్తా ఇప్పుడు వైరల్‌గా మారింది.


టీమ్‌ఇండియా ప్రస్తుతం దక్షిణాఫ్రికాతో ఐదు టీ20ల సిరీస్‌ ఆడుతోంది. 0-2తో వెనకబడింది. నేడు విశాఖలో మూడో మ్యాచులో తలపడనుంది. ఈ టోర్నీలో సెలక్టర్లు ఎక్కువగా కుర్రాళ్లకు అవకాశం ఇచ్చారు. మూడు ఫార్మాట్లు ఆడుతూ బిజీగా ఉండే ఆటగాళ్లకు విశ్రాంతి ఇచ్చారు. రోహిత్‌ శర్మతో పాటు విరాట్‌ కోహ్లీ, జస్ప్రీత్‌ బుమ్రా, మహ్మద్‌ షమి, రవిచంద్రన్‌ అశ్విన్‌కు విరామం ప్రకటించారు. దాంతో వారు వారి కుటుంబ సభ్యలతో కలిసి సేద తీరుతున్నారు.






దక్షిణాఫ్రికా సిరీస్‌ ముగిశాక టీమ్‌ఇండియా ఐర్లాండ్‌కు బయల్దేరుతుంది. ఇందులోనూ కుర్రాళ్లకే చోటివ్వనున్నారు. ఇక సీనియర్లు నేరుగా ఇంగ్లాండ్‌కు బయల్దేరుతారు. అక్కడ ప్రాక్టీస్‌ మ్యాచులు ఆడతారు. ఆ తర్వాత గతేడాది ఆగిపోయిన ఐదో టెస్టులో తలపడతారు. ఇందులో గెలిస్తే భారత్‌ సరికొత్త చరిత్ర సృష్టించింది. ఒక వేళ డ్రా చేసుకున్నా సిరీస్‌ టీమ్‌ఇండియా వశం అవుతుంది.


ప్రస్తుతం హిట్‌మ్యాన్‌ ఫామ్‌పై అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఐపీఎల్‌లో అతడు సరిగ్గా రాణించకపోవడమే ఇందుకు కారణం. ఈ సీజన్లో 14 మ్యాచులు ఆడిన రోహిత్‌ 19.14 సగటు, 120 స్ట్రైక్‌రేట్‌తో 268 పరుగులే చేశాడు. ఐపీఎల్‌ కెరీర్లో అతడిదే అత్యల్ప స్కోరు. అతడు నాయకత్వం వహించిన ముంబయి ఇండియన్స్‌ సైతం పేలవ ప్రదర్శనతో టోర్నీని ముగించింది.