T20 World Cup India Squad: ఐసీసీ టీ20 ప్రపంచకప్‌-2022 సందడి మొదలైంది! వరుసగా అన్ని దేశాలు జట్లను ప్రకటించేస్తున్నాయి. 15 మందితో కూడిన టీమ్‌ఇండియాను బీసీసీఐ సెలక్టర్లు సోమవారం ప్రకటించేశారు. మరో ముగ్గుర్ని స్టాండ్‌బైగా తీసుకున్నారు. సంజూ శాంసన్‌ను పక్కన పెట్టడం తప్పిస్తే కుర్రాళ్లు, సీనియర్ల మేళవింపుతో టీమ్‌ఇండియా ఎంపిక బాగానే అనిపిస్తోంది. మరి భారత బృందంలో ఎవరి అనుభవం ఎంత? గతంలో ఏమైనా ప్రపంచకప్‌లు ఆడారా చూద్దాం!!


రోహిత్‌ శర్మ: టీమ్‌ఇండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మకు పొట్టి ఫార్మాట్లో ఎంతో అనుభవం ఉంది.  అతడు 136 అంతర్జాతీయ టీ20లు ఆడాడు. 32.32 సగటు, 140 స్ట్రైక్‌రేట్‌తో 3620 పరుగులు చేశాడు. 4 సెంచరీలు, 28 హాఫ్ సెంచరీలు, 323 బౌండరీలు, 171 సిక్సర్లు దంచాడు. టీ20 ప్రపంచకప్పుల్లో 33 మ్యాచులాడి 38.50 సగటు, 131 స్ట్రైక్‌రేట్‌తో 847 రన్స్‌ కొట్టాడు.


కేఎల్‌ రాహుల్‌: భారత జట్టుకు దొరికిన అద్భుతమైన ఓపెనర్‌  కేఎల్‌ రాహుల్‌. అతడు ఫామ్‌లో ఉన్నాడంటే ఈ ఫార్మాట్లో పరుగులు వరద పారుతుంది. 61 మ్యాచుల్లో 39 సగటు, 140 స్ట్రైక్‌రేట్‌తో 1963 పరుగులు చేసిన అనుభవం అతడి సొంతం. 2 సెంచరీలు, 17 హాఫ్‌ సెంచరీలు, 172 బౌండరీలు, 79 సిక్సర్లు బాదేశాడు. గతేడాది మాత్రమే రాహుల్‌ ప్రపంచకప్‌ ఆడాడు. 5 మ్యాచుల్లో 48 సగటు, 152 స్ట్రైక్‌రేట్‌తో 194 రన్స్‌ చేశాడు.


విరాట్‌ కోహ్లీ: టీమ్‌ఇండియా కింగ్‌ గురించి ఎంత చెప్పినా తక్కువే! భారీ సిక్సర్లు బాదలేకపోయినా గ్యాపుల్లో బౌండరీలు బాది స్కోరు పెంచుతాడు కోహ్లీ. 104 టీ20ల్లో 52 సగటు, 138 స్ట్రైక్‌రేట్‌తో 3584 పరుగులు చేశాడు. 1 సెంచరీ, 32 హాఫ్‌ సెంచరీలు, 319 బౌండరీలు, 104 సిక్సర్లు కొట్టాడు. టీ20 ప్రపంచకప్‌ల్లో 21 మ్యాచులాడి 76 సగటు, 130 స్ట్రైక్‌రేట్‌తో 845 రన్స్‌ చేశాడు.


సూర్యకుమార్‌ యాదవ్‌: టీమ్‌ఇండియా మిస్టర్‌ 360పై భారీ అంచనాలే ఉన్నాయి. మైదానం అన్ని వైపులా పరుగులు చేయడంలో అతడికి తిరుగులేదు. ఇప్పటి వరకు 28 టీ20ల్లో 36 సగటు, 173 స్ట్రైక్‌రేట్‌తో 811 పరుగులు చేశాడు. 1 సెంచరీ, 6 హాఫ్‌ సెంచరీలు చేశాడు. 76 బౌండరీలు, 45 సిక్సర్లు దంచాడు. గతేడాది టీ20 ప్రపంచకప్‌లో 4 మ్యాచుల్లో 42 సగటు, 144 స్ట్రైక్‌రేట్‌తో 42 పరుగులే చేశాడు.


దీపక్‌ హుడా: టీ20 ప్రపంచకప్‌ జట్టులో దీపక్ హుడా ఎంపికవ్వడం అనూహ్యమే! దేశవాళీ, ఐపీఎల్‌ మెరుపులే ఇందుకు కారణం. ఈ ఏడాదే టీ20 ఫార్మాట్లో అరంగేట్రం చేసిన అతడు 12 మ్యాచుల్లో 41 సగటు, 155 స్ట్రైక్‌రేట్‌తో 293 పరుగులు చేశాడు. ఒక సెంచరీ, 27 బౌండరీలు, 13 సిక్సర్లు దంచాడు. గతంలో టీ20 ప్రపంచకప్‌ ఆడిన అనుభవం లేదు.


దినేశ్‌ కార్తీక్‌: ఐపీఎల్‌లో అద్భుత ప్రదర్శనతో టీ20 ప్రపంచకప్‌ జట్టులో చోటు సంపాదించాడు. ఫినిషర్‌గా అతడిపై భారీ అంచనాలే ఉన్నాయి. ఇప్పటి వరకు 50 టీ20ల్లో 28 సగటు, 139 స్ట్రైక్‌రేట్‌తో 592 రన్స్‌ చేశాడు. ఒక హాఫ్‌ సెంచరీ, 64 బౌండరీలు, 21 సిక్సర్లు దంచాడు. మొత్తంగా టీ20ల్లో 363 మ్యాచుల్లో 134 స్ట్రైక్‌రేట్‌, 28 సగటుతో 6847 పరుగులు సాధించాడు. గతంలో ప్రపంచకప్‌ ఆడిన అనుభవం ఉంది. 6 మ్యాచుల్లో 57 రన్స్‌ చేశాడు.


రిషభ్‌ పంత్‌: లెఫ్ట్‌ హ్యాండర్‌ కావడం, ఆస్ట్రేలియాలో మెరుగ్గా ఆడటం పంత్‌ ఎంపికకు కారణం. అయితే అంచనాల మేరకు పొట్టి ఫార్మాట్లో రాణించలేదు. 58 టీ20ల్లో 126 స్ట్రైక్‌రేట్‌, 23 సగటుతో 934 రన్స్‌ చేశాడు. 3 హాఫ్‌ సెంచరీలు, 79 బౌండరీలు, 35 సిక్సర్లు బాదేశాడు. గతేడాది టీ20 ప్రపంచకప్‌లో 5 మ్యాచుల్లో 39 సగటు, 125 స్ట్రైక్‌రేట్‌తో 78 రన్సే చేశాడు.


అక్షర్‌ పటేల్‌: ఆల్‌ రౌండర్‌ కోటాలో అక్షర్‌ జట్టులో ఎంపికయ్యాడు. టీమ్‌ఇండియా తరఫున 26 టీ20ల్లో 137 స్ట్రైక్‌రేట్‌, 18 సగటుతో 147 రన్స్‌ చేశాడు. 7.27 ఎకానమీతో 28.33 సగటుతో 21 వికెట్లు పడగొట్టాడు. గతంలో టీ20 ప్రపంచకప్‌ ఆడిన అనుభవం లేదు.


రవిచంద్రన్‌ అశ్విన్‌: ఆస్ట్రేలియా పిచ్‌లపై రవిచంద్రన్‌ అశ్విన్‌ హ్యాండీగా ఉంటాడు. అక్కడి పిచ్‌లు బౌన్సీ, స్పిన్‌కు సహకరించడమే ఇందుకు కారణం. యాష్ ఇప్పటి వరకు 56 మ్యాచుల్లో 6.81 ఎకానమీ, 21.77 సగటుతో 66 వికెట్లు పడగొట్టాడు. 116 స్ట్రైక్‌రేట్‌, 32 సగటుతో 161 రన్స్‌ చేశాడు. 18 టీ20 ప్రపంచకప్‌ మ్యాచుల్లో 6.01 ఎకానమీ, 15.26 సగటుతో 26 వికెట్లు పడగొట్టాడు. 


భువనేశ్వర్‌ కుమార్‌: ఈ ఏడాది భువీ మంచి ఫామ్‌లో ఉన్నాడు. టీమ్‌ఇండియా తరఫున ఎక్కువ వికెట్లు పడగొట్టాడు. అతడి అమ్ముల పొదిలో అన్ని రకాల బౌలింగ్‌ అస్త్రాలు ఉన్నాయి. ఇప్పటి వరకు 70 టీ20 మ్యాచుల్లో 6.86 ఎకానమీ, 21.73 సగటుతో 84 వికెట్లు పడగొట్టాడు. అప్పుడప్పుడు బ్యాటుతోనూ రాణిస్తుంటాడు. 62 పరుగులు చేశాడు. టీ20 ప్రపంచకప్‌ అనుభవం ఉన్నా ఎక్కువ మ్యాచులేం ఆడలేదు. 7 మ్యాచుల్లో 5.81 ఎకానమీ, 32 సగటుతో 4 వికెట్లే తీశాడు.


అర్షదీప్‌ సింగ్‌: అరంగేట్రం చేసిన మూడు నెలల్లోనే టీ20 ప్రపంచకప్‌నకు ఎంపికయ్యాడు అర్షదీప్‌ సింగ్‌. ఇప్పటి వరకు ఆడింది 11 టీ20లే అయినా 7.38 ఎకానమీ, 20.14 సగటుతో 14 వికెట్లు తీశాడు. పవర్‌ప్లే, డెత్‌లో బౌలింగ్‌ చేయడం అతడి ప్రత్యేకత. అప్పుడప్పుడు బ్యాటుతో ఒకట్రెండు పరుగులు చేయగలడు. ఐపీఎల్‌ సహా అన్ని టీ20లు కలిపి 62 మ్యాచుల్లో 7.87 ఎకానమీ, 24.38 సగటుతో 70 వికెట్లు తీసిన అనుభవం ఉంది. 


హార్దిక్‌ పాండ్య: ఈ ప్రపంచకప్‌లో టీమ్‌ఇండియాకు అత్యంత విలువైన ఆటగాడు హార్దిక్‌. ఆసీస్‌ పిచ్‌లపై బంతిని బౌన్స్‌ చేయగలడు. భారీ సిక్సర్లు దంచగలడు. ఇప్పటి వరకు పాండ్య 70 టీ20ల్లో 144 స్ట్రైక్‌రేట్‌, 23.26 సగటుతో 884 పరుగులు చేశాడు. 1 హాఫ్ సెంచరీ, 61 బౌండరీలు, 48 సిక్సర్లు దంచాడు. 8.30 ఎకానమీ, 27.66 సగటుతో 54 వికెట్లు పడగొట్టాడు. ఇక టీ20 ప్రపంచకప్‌లో 10 మ్యాచులాడి 144 స్ట్రైక్‌రేట్‌, 21 సగటుతో 85 రన్స్‌ చేశాడు. 5 వికెట్లు పడగొట్టాడు.


యుజ్వేంద్ర చాహల్‌: సెలక్టర్లు మరోసారి యూజీపై నమ్మకం ఉంచారు.  లెగ్‌బ్రేక్‌ గూగ్లీలతో అతడు ప్రత్యర్థిని సులువుగా బోల్తా కొట్టించగలడు. టీమ్‌ఇండియా తరఫున ఇప్పటి వరకు 66 టీ20ల్లో 8.08 ఎకానమీ, 24.32 సగటుతో 83 వికెట్లు పడగొట్టాడు. ఇప్పటి వరకు అతడికి టీ20 ప్రపంచకప్‌లో చోటు దొరక్కపోవడం విచిత్రమే!


జస్ప్రీత్‌ బుమ్రా: టీమ్‌ఇండియా ఏస్‌ బౌలర్‌ జస్ప్రీత్‌ బుమ్రా  కొన్నాళ్లుగా విశ్రాంతి తీసుకుంటున్నాడు. అతడిపై చాలా ఆశలే ఉన్నాయి. ఇప్పటి వరకు జట్టు తరఫున 58 మ్యాచుల్లో 6.46 ఎకానమీ, 19.46 సగటుతో 69 వికెట్లు పడగొట్టాడు. 10 టీ20 ప్రపంచకప్‌ మ్యాచులాడి 6.41 ఎకానమీ, 22.54 సగటుతో 11 వికెట్లు పడగొట్టాడు. 


హర్షల్‌ పటేల్‌: కాలం గడిచే కొద్దీ తనకు తాను మెరుగులు దిద్దుకున్న పేసర్‌ హర్షల్‌ పటేల్‌. అతడి నుంచి టీమ్‌ఇండియా ఎక్కువగానే ఆశిస్తోంది. పేస్‌లో వైవిధ్యం చూపించే హర్షల్‌ తెలివిగా వికెట్లు తీస్తాడు. ఇప్పటి వరకు 17 అంతర్జాతీయ టీ20ల్లో 8.58 ఎకానమీ, 20.95 సగటుతో 23 వికెట్లు పడగొట్టాడు. అవసరమైతే సిక్సర్లూ బాదగలడు. ఐపీఎల్‌ సహా అన్ని రకాల టీ20ల్లో 149 మ్యాచులాడి 182 వికెట్లు పడగొట్టాడు. గతంలో ప్రపంచకప్‌లు ఆడిన అనుభవం లేదు.