IND Vs SL 1st Test Day 2 Highlights: భారత్‌తో జరుగుతున్న మొదటి టెస్టులో శ్రీలంక రెండో రోజు ఆట ముగిసేసరికి నాలుగు వికెట్ల నష్టానికి 108 పరుగులు చేసింది. శ్రీలంక బ్యాటర్లలో పతుం నిశ్శంక (26 బ్యాటింగ్: 75 బంతుల్లో, నాలుగు ఫోర్లు), చరిత్ అసలంక (1 బ్యాటింగ్: 12 బంతుల్లో) క్రీజులో ఉన్నారు. శ్రీలంక ఇంకా 466 పరుగులు వెనకబడి ఉంది. భారత బౌలర్లలో రవిచంద్రన్ అశ్విన్ రెండు వికెట్లు తీయగా... జడేజా, బుమ్రా చెరో వికెట్ తీశారు.


శ్రీలంకకు మొదటి ఇన్నింగ్స్‌లో కొంచెం మంచి ఆరంభమే లభించింది. మొదటి వికెట్‌కు 48 పరుగులు జోడించిన అనంతరం లహిరు తిరిమన్నే (17: 60 బంతుల్లో, ఒక ఫోర్) వికెట్ రవిచంద్రన్ అశ్విన్ తీశాడు. అనంతరం ఆరు ఓవర్లలోనే మరో ఓపెనర్ కరుణ రత్నే (28: 71 బంతుల్లో, ఐదు ఫోర్లు) రవీంద్ర జడేజాకు వికెట్ల ముందు దొరికిపోయాడు.


ఆ తర్వాత పతుం నిశ్శంక, ఆల్‌రౌండర్ ఏంజెలో మాథ్యూస్ కాసేపు వికెట్ల పతనాన్ని నిలువరించారు. మూడో వికెట్‌కు 37 పరుగులు జోడించిన అనంతరం బుమ్రా... మాథ్యూస్‌ను ఎల్బీడబ్ల్యూగా అవుట్ చేశాడు. వెంటనే ధనంజయ డిసిల్వను అశ్విన్ అవుట్ చేశాడు. భారత బౌలర్లు తీసిన నాలుగు వికెట్లూ ఎల్బీడబ్ల్యూనే కావడం విశేషం.


అంతకు ముందు 129.2 ఓవర్లకు 574/8 వద్ద రోహిత్‌ శర్మ మొదటి ఇన్నింగ్స్‌ డిక్లేర్‌ చేశాడు. రవీంద్ర జడేజా (175 నాటౌట్: 228 బంతుల్లో 17 ఫోర్లు, మూడు సిక్సర్లు) భారీ సెంచరీ కొట్టాడు. మహ్మద్‌ షమి (20 నాటౌట్: 34 బంతుల్లో, మూడు ఫోర్లు) నాటౌట్‌గా నిలిచాడు. రవిచంద్రన్ అశ్విన్‌ (61; 82 బంతుల్లో 8x4) హాఫ్ సెంచరీ కొట్టాడు.


రెండో రోజు శనివారం ఓవర్‌నైట్‌ స్కోరు 357/6తో టీమ్‌ఇండియా ఆట ఆరంభించింది. రవీంద్ర జడేజా, రవిచంద్రన్‌ అశ్విన్‌ ఒకరితో మరొకరు పోటీ పడుతూ బౌండరీలు కొట్టారు. లంక బౌలర్లను ఆటాడుకున్నారు. చూస్తుండగానే హాఫ్‌ సెంచరీ బాదేసిన జడ్డూ గేర్లు మార్చేశాడు. మరో ఎండ్‌లో అశ్విన్‌ కూడా 67 బంతుల్లో 50 పరుగులు చేశాడు. 160 బంతుల్లో జడ్డూ సెంచరీ చేయడంతో 468/7తో టీమ్‌ఇండియా లంచ్‌కు వెళ్లింది. అంతకు ముందే అశ్విన్‌ను సురంగ లక్మల్‌ ఔట్‌ చేయడంతో 130 పరుగుల వీరి భాగస్వామ్యం ముగిసిపోయింది. 


జయంత్‌ యాదవ్‌ త్వరగానే ఔటైనా మహ్మద్‌ షమి (20; 34 బంతుల్లో 3x4)తో కలిసి జడ్డూ ఆడిన తీరు ఇంట్రెస్టింగా అనిపించింది. ఎందుకంటే తొమ్మిదో వికెట్‌కు ఈ జోడీ 94 బంతుల్లోనే 103 పరుగుల అజేయ భాగస్వామ్యం నెలకొల్పింది. ఆఖర్లో జడ్డూ వీర విహారం చేశాడు. వరుసగా బౌండరీలు, సిక్సర్లు కొట్టడంతో లంకేయులు అలసిపోయారు. కనీసం పరుగెత్తేందుకు వారిలో ఓపికా లేదు. షమి కూడా స్టార్‌ బ్యాటర్‌ టైపులో కవర్‌డ్రైవులు కొట్టేశాడు.