బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ చాంపియన్ షిప్‌లో భారత్‌కు పతకం ఖాయం అయింది. తెలుగు తేజం కిడాంబి శ్రీకాంత్.. మార్క్ కాల్జోను ఓడించి సెమీస్‌కు దూసుకెళ్లాడు. కేవలం 26 నిమిషాల్లోనే ముగిసిన ఈ గేమ్‌లో 21-8, 21-7తో శ్రీకాంత్ విజయం సాధించాడు. ఈ విజయంతో భారత్‌కు ఒక పతకం ఖాయం అయింది.
మెన్స్ సింగిల్స్‌లో భారత్‌కు ఇది మూడో పతకం. మొదటి గేమ్ సగానికి 11-5తో ఆధిపత్యంలో ఉన్న శ్రీకాంత్.. తర్వాత 21-8తో గేమ్‌ను ముగించాడు. అదే ఊపులో రెండో సెట్‌ను కూడా 21-7తో గెలుచుకుని సెమీస్‌కు దూసుకెళ్లాడు.
డిఫెండింగ్ చాంపియన్ పీవీ సింధు క్వార్టర్ ఫైనల్స్‌లో తై ట్జు యింగ్ చేతిలో ఓటమి పాలై ఇంటి బాట పట్టింది. తై ట్జు యింగ్ 21-17, 21-13తో సింధుపై విజయం సాధించింది. ఈ మ్యాచ్ 42 నిమిషాల పాటు సాగింది. వీరిద్దరూ ఇప్పటివరకు 20 మ్యాచ్‌ల్లో తలపడగా.. యింగ్ 15 సార్లు విజయం సాధించింది. సింధుకు కేవలం ఐదు విజయాలు మాత్రమే దక్కాయి.
1983లో ప్రకాష్ పదుకోన్, 2019లో బి.సాయి ప్రణీత్ తర్వాత వరల్డ్ చాంపియన్ షిప్‌లో సెమీస్‌కు చేరిన మూడో భారతీయుడు శ్రీకాంత్ మాత్రమే. అయితే ఇదే టోర్నీలో ఆడుతున్న లక్ష్యసేన్ కూడా క్వార్టర్స్‌లో విజయానికి చేరువలో ఉన్నాడు. తను కూడా విజయం సాధిస్తే.. భారత్‌కు రెండు పతకాలు ఖాయం అవుతాయి.