Aiden Markram: ఐపీఎల్ 2023లో దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మెన్ ఎయిడెన్ మార్క్రమ్ సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) బాధ్యతలు స్వీకరించనున్నాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీ జట్టు కెప్టెన్సీ కోసం ఎయిడెన్ మార్క్రమ్ పేరును ప్రకటించింది. ఎయిడెన్ మార్క్రమ్ సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్సీ కోసం మయాంక్ అగర్వాల్‌తో పోటీ పడ్డాడు. అయితే కెప్టెన్‌గా ఎయిడెన్ మార్క్రమ్ పేరును ప్రకటించడంతో మయాంక్ అగర్వాల్‌కు నిరాశ ఎదురైంది.


అండర్-19 ప్రపంచకప్‌ను గెలుచుకున్న దక్షిణాఫ్రికా
దక్షిణాఫ్రికా ఇప్పటి వరకు అంతర్జాతీయ స్థాయిలో వన్డే ప్రపంచకప్ లేదా టీ20 ప్రపంచకప్ గెలవలేదు. కానీ ఈ జట్టు అండర్-19 ప్రపంచకప్‌ను గెలుచుకుంది. అండర్-19 ప్రపంచకప్‌లో దక్షిణాఫ్రికాను తొలిసారిగా ఎయిడెన్ మార్క్రమ్ గెలిపించాడు. 2014లో ఆఫ్రికన్ అండర్-19 జట్టుకు ఎయిడెన్ మార్క్రమ్ కెప్టెన్‌గా వ్యవహరించాడు. కెప్టెన్సీతో పాటు అతను తన జట్టు కోసం అత్యధిక పరుగులు చేయడం ద్వారా ఈ ట్రోఫీని అందుకున్నాడు.


దక్షిణాఫ్రికా టీ20 లీగ్ (SA20)లో కూడా సన్‌రైజర్స్ ఫ్రాంచైజీ ఎయిడెన్ మార్క్రమ్‌ను అతని జట్టుకు కెప్టెన్‌గా చేసింది. అతను సన్‌రైజర్స్ ఈస్టర్న్ క్యాప్‌ కెప్టెన్‌గా, బ్యాట్స్‌మన్‌గా అద్భుత ప్రదర్శన చేశాడు. అతని కెప్టెన్సీలో అతను ఇటీవల ముగిసిన SA20లో సన్‌రైజర్స్ ఈస్టర్న్ క్యాప్‌ని ఛాంపియన్‌గా నిలిపాడు.


గత రెండు ఐపీఎల్ సీజన్లలో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు పూర్తిగా ఫ్లాప్ అయ్యింది. ఐపీఎల్ 2021, ఐపీఎల్ 2022 సీజన్లలో పాయింట్ల పట్టికలో ఎనిమిదో ర్యాంక్‌ను సాధించింది. ఈ జట్టు చివరిగా 2016లో టైటిల్‌ను గెలుచుకుంది. అటువంటి పరిస్థితిలో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టును తిరిగి విన్నింగ్ ట్రాక్‌లోకి తీసుకురావడం ఎయిడెన్ మార్క్రమ్‌పై ఆధారపడి ఉంటుంది.


టీ20 క్రికెట్‌లో బలమైన బ్యాటింగ్ రికార్డు
ఎయిడెన్ మార్క్రమ్ వయస్సు కేవలం 28 సంవత్సరాలు మాత్రమే. టెస్టులు, వన్డేల్లో అంత ప్రభావవంతంగా లేకపోయినా టీ20లో మాత్రం అద్భుతమైన ఆటతీరు కనబరుస్తున్నాడు. టీ20 ఇంటర్నేషనల్‌లో ఈ ఆటగాడు ఇప్పటివరకు 31 మ్యాచ్‌లలో 38 సగటు, 148 స్ట్రైక్ రేట్‌తో 879 పరుగులు చేశాడు. ఐపీఎల్‌లో కూడా ఈ ఆటగాడి సగటు మరింత మెరుగ్గా ఉంది. ఐపీఎల్‌లో మార్క్రమ్ 40.54 సగటు, 134 స్ట్రైక్ రేట్‌తో 527 పరుగులు చేశాడు.


మరో వైపు టీమ్ మేనేజ్‌మెంట్ నిర్ణయంపై సన్‌రైజర్స్ హైదరాబాద్ అభిమానులు హర్షం వ్యక్తం చేయడం లేదు. వాస్తవానికి సన్‌రైజర్స్ హైదరాబాద్ అభిమానులు ఎయిడెన్ మార్క్రమ్‌కు బదులుగా మయాంక్ అగర్వాల్ మెరుగైన కెప్టెన్సీ ఎంపిక అని నమ్ముతున్నారు. ఈ కర్ణాటక బ్యాట్స్‌మన్‌ను జట్టుకు కెప్టెన్‌గా చేసి ఉండాలని అభిప్రాయపడుతున్నారు.


డేవిడ్ వార్నర్, కెమ్ విలియమ్సన్ తర్వాత సన్‌రైజర్స్ హైదరాబాద్ మళ్లీ విదేశీ కెప్టెన్ పైనే నమ్మకం ఉంచిందని అభిమానులు అంటున్నారు. అందుకే ఇప్పుడు దక్షిణాఫ్రికాకు చెందిన ఎయిడెన్ మార్క్రమ్‌ను కెప్టెన్‌గా చేసిందని మండి పడుతుంది. ఈ జట్టు విదేశీ కెప్టెన్లను ప్రేమిస్తుందని కామెంట్లు చేస్తున్నారు.


దీంతోపాటు డేవిడ్ వార్నర్, కేన్ విలియమ్సన్ కెప్టెన్ కావడానికి ముందు మూడు సీజన్ల పాటు జట్టులో ఆటగాళ్లుగా ఉన్నారని, అయితే ఎయిడెన్ మార్క్రమ్ కేవలం ఒక్క సీజన్ తర్వాతనే కెప్టెన్‌గా మారారని అభిమానులు అంటున్నారు. అయితే మయాంక్ అగర్వాల్‌కు కెప్టెన్సీ అనుభవం కూడా ఎక్కువగా ఉందని సోషల్ మీడియాలో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫ్యాన్స్ అంటున్నారు.