Squash World Cup 2025: 2025 సంవత్సరం ముగిసేలోపు క్రీడా ప్రపంచంలో భారతదేశం మరో చారిత్రాత్మక విజయాన్ని సాధించింది. భారత స్క్వాష్ జట్టు స్క్వాష్ ప్రపంచ కప్ 2025 టైటిల్‌ను గెలుచుకుని సరికొత్త చరిత్ర సృష్టించింది. స్క్వాష్ ప్రపంచ కప్‌ను గెలుచుకున్న తొలి ఆసియా దేశంగా భారత్ రికార్డులు తిరగరాసింది. ఆదివారం జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో భారత్ 3-0 తేడాతో హాంకాంగ్‌ను ఓడించి ట్రోఫీని కైవసం చేసుకుంది.
ఈ విజయానికి మరో ప్రత్యేకత ఏమిటంటే, భారత్ ఈ టోర్నమెంట్‌లో ఒక్క మ్యాచ్ కూడా కోల్పోలేదు. మిక్స్‌డ్-టీమ్ ఫార్మాట్‌లో జరిగిన ఈ టోర్నమెంట్ భారత ఆటగాళ్ల ఆత్మవిశ్వాసం, క్రమశిక్షణ, నిలకడకు అద్భుతమైన ఉదాహరణగా నిలిచింది. ఇంతకు ముందు భారత జట్టు స్క్వాష్ ప్రపంచ కప్ ఫైనల్‌కు ఎప్పుడూ చేరుకోలేదు. 2023లో సెమీ-ఫైనల్ వరకు వచ్చి జట్టు ఓడిపోయింది. అయితే ఈసారి జట్టు పూర్తి సన్నద్ధతతో, గెలవాలన్న తపన, లక్ష్యాలతో బరిలోకి దిగింది.
గ్రూప్ దశ నుండి ఫైనల్ వరకు భారత్ ఆధిపత్యం
రెండవ సీడ్ పొందిన భారత జట్టు గ్రూప్ దశలో స్విట్జర్లాండ్, బ్రెజిల్ జట్లను 4-0 తేడాతో ఓడించి ఘనంగా ప్రారంభించింది. అనంతరం క్వార్టర్ ఫైనల్లో దక్షిణాఫ్రికాను ఓడించింది. సెమీఫైనల్‌లో భారత జట్టు రెండుసార్లు ఛాంపియన్ అయిన ఈజిప్ట్‌తో తలపడినా తడబడలేదు. భారత్ అద్భుతమైన ఆటతీరుతో 3-0 తేడాతో ఈజిష్ట్ జట్టుపై విజయం సాధించి ఫైనల్‌కు చేరుకుంది.
ఫైనల్‌లో టీమిండియా అద్భుత ప్రదర్శన
ఫైనల్ మ్యాచ్‌లో అనుభవజ్ఞురాలైన భారత క్రీడాకారిణి జోష్నా చిన్నప్ప ప్రపంచ ర్యాంకింగ్‌లో 37వ స్థానంలో ఉన్న లీ కా యీని 3-1 తేడాతో ఓడించి భారత జట్టుకు మంచి ఆరంభం ఇచ్చింది. ఆ తర్వాత ఆసియా క్రీడల పతక విజేత అభయ్ సింగ్ అలెక్స్ లౌను 3-0 తేడాతో ఓడించి భారత్ ఆధిక్యాన్ని మరింత పెంచాడు. చివరి మ్యాచ్‌లో 17 ఏళ్ల యంగ్ ప్లేయర్ అనాహత్ సింగ్ అద్భుతంగా రాణించి ప్రపంచ ర్యాంకింగ్‌లో 31వ స్థానంలో ఉన్న టొమాటో హోను 3-0 తేడాతో ఓడించడంతో భారత్ విజయం ఖాయమైంది. ఆ తర్వాత భారత పురుషుల జాతీయ ఛాంపియన్ వెలవన్ కుమార్ ఆడే అవకాశం రాలేదు.
ఒలింపిక్స్‌కు ముందు గొప్ప విజయం
ఈ స్క్వాష్ టోర్నమెంట్‌లో మొత్తం 12 దేశాలు పాల్గొన్నాయి. ఇందులో ఆస్ట్రేలియా, ఈజిప్ట్, హాంకాంగ్, జపాన్, మలేషియా, ఇరాన్, పోలాండ్, దక్షిణాఫ్రికా, స్విట్జర్లాండ్ వంటి పటిష్ట దేశాలు ఉన్నాయి. 1996లో స్క్వాష్ ప్రపంచ కప్ ప్రారంభమైంది. ఇప్పటివరకు ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, ఈజిప్ట్ వంటి జట్లు వరల్డ్ కప్ టైటిల్‌ను గెలుచుకుంటూ వస్తున్నాయి. తాజా విజయంతో సరికొత్త ఛాంపియన్‌గా భారత్ అవతరించింది.