Mega blockbuster: సెప్టెంబర్ 1 నుంచి సోషల్ మీడియాలో ఒకటే చర్చ. నెటిజన్లంతా ఒకే విషయం గురించి మాట్లాడుకుంటున్నారు. అది సినిమానా లేక సిరీస్ ఆ. అంతమంది సెలబ్రిటీలు ఎలా నటిస్తున్నారంటూ ఒకటే చర్చ. ఇదంతా దేని గురించో తెలుసా. మెగా బ్లాక్ బస్టర్. అవును మొన్నటినుంచి నెటిజనం అంతలా చర్చించుకుంటున్నది దీని గురించే. 


సినిమా స్టార్స్ దీపికా పదుకొనే, కార్తీ, రష్మిక మందన్న, కమెడియన్ కపిల్ శర్మ, క్రికెటర్ రోహిత్ శర్మ, సౌరవ్ గంగూలీ వంటివారు ఈ పోస్టర్ ను తమ సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నారు. గతంలో ఎప్పుడూ వినని నిర్మాణ సంస్థ ఓసీమ్ నుంచి తామే ప్రధాన పాత్రలో నటిస్తున్నట్లుగా ఉన్న మెగా బ్లాక్ బస్టర్ అనే పోస్టర్ ను షేర్ చేశారు. అప్పటినుంచి నెటిజన్లందరూ దాని గురించే మాట్లాడుకుంటున్నారు. అది సినిమానా, వెబ్ సిరీసా అందరూ కలిసి ఎలా నటిస్తున్నారంటూ తెగ చర్చించుకుంటున్నారు. ఇప్పుడు దాని రహస్యం బట్టబయలైంది. అదీ బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ టీం చేసిన తప్పిదం కారణంగా.


మెగా బ్లాక్ బస్టర్ అనేది ఈ-కామర్స్ ప్లాట్ ఫామ్ 'మీషో' యొక్క ప్రమోషనల్ స్టంట్ అని తేలింది. వీరంతా దానికోసమే తమ పోస్టర్లను పంచుకున్నారు. అయితే గంగూలీ చేసిన తప్పిదం కారణంగా అదేంటో వెల్లడైంది. ప్రమోషనల్ స్టంట్ లో పాల్గొన్న ప్రముఖులు స్క్రిప్ట్ ను అప్ లోడ్ చేయకూడదు. తమ ఫొటో, ఇంకా పేరు వచ్చేలా మాత్రమే పోస్టర్ షేర్ చేశారు. అయితే గంగూలీ టీం మాత్రం స్రిప్ట్ తో సహా పోస్ట్ చేసింది. మీషో తనకు షేర్ చేసిన దాన్ని యాజ్ ఏ టీజ్ కాపీ, పేస్ట్ చేశారు. దాంతో విషయం మొత్తం అర్థమైపోయింది. మీషో బ్రాండ్ లేదా హాష్ ట్యాగ్ ఎక్కడా ప్రస్తావించకూడదని చెప్పింది. దాన్ని గంగూలీ టీం యథాతథంగా పోస్ట్ చేసింది. తర్వాత సౌరవ్ దాన్ని డిలీట్ చేసి వేరేది పోస్టు చేసినా.. అప్పటికే ఆలస్యమైపోయింది. కొంతమంది నెటిజన్లు ముందు షేర్ చేసిన దాన్ని స్క్రీన్ షాట్ తీసి సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నారు. అవి ప్రస్తుతం ట్విటర్లో వైరల్ అవుతున్నాయి.