Sourav Ganguly Resign: టీమ్‌ఇండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ (Sourav Ganguly) సంచలన నిర్ణయం తీసుకున్నాడా? బీసీసీఐ ప్రెసిడెంట్ పదవికి రాజీనామా చేశాడా? అంటే ఏం తెలియడం లేదు. త్వరలోనే అతడో కొత్త ప్రాజెక్టును ఆరంభిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు ఓ ట్వీట్ చేశాడు.
'నేను 1992లో నా క్రికెట్ ప్రయాణం మొదలుపెట్టాను. 2022తో నా జర్నీకి 30 ఏళ్లు నిండుతాయి. అప్పట్నుంచి క్రికెట్ నాకెంతో ఇచ్చింది. ముఖ్యంగా మీ అందరి అభిమానం, అండదండల్ని అందించింది. నేనీ స్థాయిలో ఉండేందుకు నా ప్రయాణంలో భాగమైన, అండగా నిలిచిన, సాయం చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. చాలామందికి సాయ పడుతుందని భావించే ఓ కొత్త ప్రాజెక్టును ఈ రోజు ఆరంభించబోతున్నా. నా జీవితంలో సరికొత్త అధ్యాయంలోకి అడుగు పెడుతున్నాను. మీ అందరి మద్దతు ఇలాగే కొనసాగుతుందని ఆశిస్తున్నా' అని దాదా ట్వీట్ చేశాడు.
మొదట దాదా బీసీసీఐ అధ్యక్ష పదవికి రాజీనామా చేసినట్టు వార్తలు వచ్చాయి. అలాంటిదేమీ లేదని, రాజీనామా ఇవ్వలేదని బీసీసీఐ సెక్రటరీ జే షా స్పష్టం చేశారు. ఈ మేరకు ఏఎన్‌ఐ ట్వీట్ చేసింది.
రాజ్యసభకు దాదా!
సౌరవ్ గంగూలీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలన్న డిమాండ్లు ఎప్పట్నుంచో ఉన్నాయి. గతేడాది జరిగిన బెంగాల్ ఎన్నికల్లో బీజేపీ అతడిని సీఎం అభ్యర్థిగా ప్రకటిస్తుందన్న వార్తలు వెలువడ్డాయి. అంతలోనే దాదాకు గుండెపోటు రావడంతో రాజకీయాలకు దూరంగా ఉన్నారు. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ పశ్చిమ్ బంగాల్ నుంచి క్రీడా విభాగంలో గంగూలీని రాజ్యసభకు నామినేట్ చేయబోతున్నారని తెలిసింది. నటి రూపా గంగూలీ, మాజీ జర్నలిస్టు స్వపన్ దాస్‌గుప్తా పదవీకాలం ముగుస్తుండటమే ఇందుకు కారణం.
ఈ మధ్యే కేంద్ర హోంమంత్రి అమిత్ షా బెంగాల్‌లో పర్యటించారు. కోల్‌కతాలోని గంగూలీ స్వగృహంలో ఆయన డిన్నర్ చేశారు. అప్పుడే రాజ్యసభ సభ్యత్వం గురించి వీరిద్దరి మధ్య చర్చకు వచ్చిందని బెంగాల్ బీజేపీ వర్గాల ద్వారా తెలిసింది. ఆ సమయంలో స్వపన్ దాస్‌గుప్తా, బెంగాల్ బీజేపీ అధ్యక్షుడు సుకంత మజుందార్, బెంగాల్ అసెంబ్లీ ప్రతిపక్ష నేత సువేంద్ అధికారి ఉన్నారని సమాచారం.