Indian Duo Stuns Chinese Pair In Shenzhen Arena: భారత స్టార్ బ్యాడ్మింటన్ జోడీ సాత్విక్‌సాయిరాజ్ రాంకీరెడ్డి, చిరాగ్ శెట్టి మరోసారి ప్రపంచ వేదికపై అద‌ర‌గొట్టారు. షెన్‌జెన్‌లోని షెన్‌జెన్ అరేనా వేదికగా జరిగిన చైనా మాస్టర్స్ పురుషుల డబుల్స్ హోరాహోరీ ఫైనల్లో స్థానిక చైనా జోడీ హీ జీ టింగ్, రెన్ షియాంగ్ యూపై 11-21, 21-13, 21-17 తేడాతో అద్భుత విజయాన్ని సాధించారు. మూడో ప్రయత్నంలో ఈ ప్రతిష్టాత్మక టైటిల్‌ను ముద్దాడారు. దాదాపు 1 గంట 10 నిమిషాల పాటు సాగిన ఈ మ్యాచ్ లో భారత ద్వయం తమ అనుభవాన్ని, పట్టుదలను ప్రదర్శించి కీలక సమయాల్లో పైచేయి సాధించి, టైటిల్ కైవ‌సం చేసుకుంది. మే నెలలో సింగపూర్ ఓపెన్ నెగ్గిన తర్వాత ఈ సీజన్‌లో సాత్విక్-చిరాగ్ జోడీకి ఇది రెండో టైటిల్ కావడం విశేషం.

Continues below advertisement

Continues below advertisement

తొలి గేమ్ ఓడినా.. ప‌ట్టుద‌ల‌తోమ్యాచ్ ఆరంభంలో చైనా ద్వయం పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. థాయిలాండ్ ఓపెన్, బ్యాడ్మింటన్ ఆసియా ఛాంపియన్‌షిప్‌లలో సెమీఫైనల్ చేరిన హీ, రెన్ ఆరంభం నుంచే వేగవంతమైన ర్యాలీలతో స‌త్తా చాటారు. వారి అద్భుతమైన డ్రాప్ షాట్లు, యాంగిల్డ్ రిటర్న్స్‌ను ఎదుర్కోవడంలో భారత జోడీ తీవ్రంగా తడబడింది. వరుస అన్‌ఫోర్స్డ్ ఎర్రర్లు కూడా సాత్విక్-చిరాగ్ జంట‌ను వెనుకంజ వేసేలా చేశాయి. దీంతో ఏకపక్షంగా సాగిన మొదటి గేమ్‌ను చైనా జంట 21-11 తేడాతో చాలా సులువుగా సొంతం చేసుకుని ఆధిక్యంలో నిలిచింది.

సూప‌ర్బ్ క‌మ్ బ్యాక్..రెండో గేమ్ తొలి ర్యాలీలోనే చైనా ద్వయం 39 షాట్ల సుదీర్ఘ పోరాటంతో పాయింట్ సాధించి జోరు కనబరిచింది. నెట్ వద్ద చిరాగ్ చేసిన పుష్‌లను చైనా ఆటగాళ్లు పటిష్టమైన డిఫెన్స్‌తో తిప్పికొట్టారు. అయితే ఏమాత్రం ఒత్తిడికి లోనుకాకుండా భారత స్టార్స్ తమ వ్యూహాన్ని మార్చారు. దూకుడుగా ఆడుతూ పాయింట్లు రాబట్టి భారీ ఆధిక్యాన్ని సంపాదించారు. భారత ఆటగాళ్ల ఎదురుదాడితో చైనా ఆటగాళ్లు తప్పులు చేయడం స్టార్ట్ చేశారు. వరుసగా స్మాష్‌లతో చెలరేగిన సాత్విక్-చిరాగ్ 21-13తో రెండో గేమ్‌ను కైవసం చేసుకుని మ్యాచ్‌ను నిర్ణయాత్మక మూడో గేమ్‌కు తీసుకెళ్లారు.

వ‌రుస పాయింట్ల‌తో చెక్..మూడో గేమ్‌లో చైనా జంట సర్వీస్, ఫాలో-అప్ షాట్లతో వేగంగా 4-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. గేమ్ ఆఖరి దశ వరకు ఇరు జట్లు చెస్ గేమ్‌లా ఎత్తుకు పైఎత్తులు వేస్తూ హోరాహోరీగా పోరాడాయి. ప్రతీ పాయింట్ కోసం తీవ్రమైన పోటీ నెలకొంది. అయితే కీలకమైన క్లైమాక్స్ క్షణాల్లో భారత ద్వయం తిరుగులేని ఏకాగ్రతను ప్రదర్శించి, స‌త్తా చాటింది. ప్రత్యర్థికి ఒక్క పాయింట్ కూడా ఇవ్వకుండా వరుసగా ఐదు కీలక పాయింట్లు పిండుకుని 21-17తో గేమ్‌తో పాటు చైనా మాస్టర్స్ ఛాంపియన్‌షిప్ ట్రోఫీని కైవసం చేసుకుంది.