Gukesh Chess Champion: గుకేశ్ గెలుపుపై రష్య ఫెడరేషన్ అక్కసు, దర్యాప్తు చేయాలని వింత కోరిక- ఫ్యాన్స్ మండిపాటు
తాజాగా భారత చెస్ ప్లేయర్ డి గుకేశ్.. ప్రపంచ చాంపియన్ షిప్ గెలిచిన అతి పిన్న వయస్కుడిగా నిలిచాడు. అయితే అతని గెలుపుపై రష్యా ఫెడరేషన్ ఆరోపణలు చేయడంపై భారత అభిమానులు మండిపడుతున్నారు.
Chess Champion Gukesh: భారత చెస్ ప్లేయర్, ప్రస్తుత ప్రపంచ చాంపియన్ గుకేశ్ పై రష్యన్ ఫెడరేషన్ అక్కసు ప్రదర్శించింది. దిగ్గజ చైనా ప్లేయర్ డింగ్ లిరెన్ ను గుకేశ్ ఓడించడంపై ఆ ఫెడరేషన్ సహించలేక పోతోందని అభిమానులు విమర్శిస్తున్నారు. కావాలనే లిరెన్ ఓడిపోయాడనే కొత్త వాదనను తెరపైకి తీసుకొచ్చింది. నిజానికి ఇరువురి మధ్య హోరాహోరీ పోరు జరగగా, 14వ రౌండ్ లో లిరెన్.. ఘోరంగా ఆడటంతో అతను ఓటమిపాలయ్యాడు.
లిరెన్ కావాలనే ఓడిపోయాడని రష్యన్ ఫెడరేషన్ ఈ సందర్భంగా వ్యాఖ్యానించింది. మ్యాచ్ ఫలితం, చెస్ అభిమానులను, విశ్లేషకులను ఆశ్చర్య పరిచిందని, ఈ పోరులో చైనా ప్లేయర్ ఆటతీరు అనుమానస్పందంగా ఉందని రష్యన్ ఫెడరేషన్ చీఫ్ ఆండ్రీ ఫిలటోవ్ పేర్కొన్నారు. లిరెన్ ఆడుతున్న క్రమాన్ని చూస్తుంటే అతను ఓడిపోవడం అసంభవం అనిపించిందని, కానీ అతని ఆటతీరు ఒక్కసారిగా ఓడిపోయేలా మారిపోవడం నమ్మశక్యంగా లేదని వ్యాఖ్యానించాడు. దీన్ని లిరెన్ ఉద్దేశపూర్వకంగానే చేశాడని అనిపిస్తోందని, దీనిపై అంతర్జాతీయ చెస్ సంస్థ (ఫిడే) ప్రత్యేకంగా విచారణ చేయాలని డిమాండ్ చేశాడు.
ఏనుగును కదపడంతోనే..
నిజానికి ఫైనల్ పోరు అసక్తికరంగా నాలుగు గంటలకుపైగా సాగింది. మొత్తానికి ఈ పోరు సుదీర్ఘంగా సాగి 58 ఎత్తుల్లో ముగిసింది. 55వ ఎత్తులో అనుకోని ఎత్తును లిరెన్ వేయడం గుకేశ్ కు కలిసొచ్చింది. ఏనుగును కదపడం ద్వారా మ్యాచ్ గుకేశ్ చేతిలోకి వచ్చింది. వచ్చిన అవకాశాన్ని ఏమాత్రం వదులుకోని గుకేశ్.. ప్రత్యర్థి ఏనుగును చంపి మ్యాచ్ లో ముందంజ వేశాడు. ఆ తర్వాత కాసేపటికే దారులన్నీ మూసుకుపోవడంతో చైనా ప్లేయర్ ఓటమిని అంగీకరించాడు. దీంతో 7.5-6.5 పాయింట్ల తేడాతో గుకేశ్ ప్రపంచ చాంపియన్ గా నిలిచాడు. 18 ఏళ్ల వయసులోనే ఈ ఘనత అందుకుని, యంగెస్ట్ చెస్ వరల్డ్ చాంపియన్ గా చరిత్ర నెలకొల్పాడు.
Also Read: Sachin Vs Kambli: సచిన్ తో విబేధాలపై స్పందించిన వినోద్ కాంబ్లీ.. కపిల్ సవాలుకు సై అన్న మాజీ క్రికెటర్
భారీ ప్రైజ్ మనీ సొంతం..
ఈ ట్రోపీ గెలవడం ద్ారా గుకేశ్ కు రూ.11.45 కోట్ల నగదు బహుమతి దక్కింది. తాజా విజయంతో గుకేశ్.. నికర విలువ భారీగా, అంటే మూడురెట్లకు పెరిగింది. ఔట్ లుక్ కథనం ప్రకారం.. అతడి నికర విలువ 8.26 కోట్ల నుంచి రూ.21 కోట్లకు చేరిందని తెలిపింది. మరోవైపు పిన్న వయసులోనే ప్రపంచ చాంపియన్ అయిన గుకేశ్ పై ప్రశంసల జల్లు కురుస్తోంది. తాజాగా తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్.. గుకేశ్ కు రూ.5 కోట్ల భారీ నజరానాను ప్రకటించారు. మరోవైపు ఈ టోర్నీలో ఓడిన లిరెన్ కు రూ.9.75 కోట్ల ప్రైజ్ మనీ దక్కింది. ఇక ప్రపంచ చాంపియన్ షిప్ మొత్తం ప్రైజ్ మనీ విలువ రూ.21.17 కోట్లుగా ఉంది. ఇందులో ఒక గేమ్ గెలిచిన ప్లేయర్ కి రూ1.69 కోట్లు లభిస్తాయి.
Also Read: Ind Vs Aus Test Series: బ్రిస్బేన్ టెస్టుకు ఆసీస్ జట్టులో మార్పులు- స్టార్ ప్లేయర్ రీ ఎంట్రీ