Sunil Gavaskar on Rohit Sharma Pull shot: టీమ్‌ఇండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ (Rohit Sharma) కొన్ని షాట్లను నియంత్రణలో ఉంచుకోవాలని క్రికెట్‌ లెజెండ్‌ సునిల్‌ గావస్కర్‌ (Sunil Gavaskar)  అంటున్నాడు. పుల్‌షాట్‌ ద్వారా అతడు భారీ పరుగులు చేస్తాడని సూచించాడు. అయితే అదే షాట్‌ వల్ల త్వరగా ఔటైపోతున్నాడని వెల్లడించాడు. కొన్ని పరుగులు చేసేంత వరకైనా ఆ షాట్‌ను కోల్డ్‌ స్టోరేజీలో పెట్టుకుంటే బెటరని సూచిస్తున్నాడు.


అంతర్జాతీయ క్రికెట్లో అతికొద్ది మంది మాత్రమే పుల్‌షాట్‌ ద్వారా పరుగులు చేస్తారు. చాలామంది షార్ట్‌పిచ్‌ బంతులకు ఈ షాట్‌ను ఆడరు. ఆడినా లాంగాన్‌, మిడాన్‌లో క్యాచులు ఇస్తుంటారు. రోహిత్‌ శర్మ మాత్రం అలాంటి బంతులను చక్కగా బౌండరీ లైన్‌ అవతల పడేస్తాడు. ఎడాపెడా సిక్సర్లు బాదేస్తాడు. అలాంటిది ఈ మధ్యన అలాంటి బంతులకే త్వరగా ఔటైపోతున్నాడు. బంతిని గాల్లోకి లేపి క్యాచులు ఇస్తున్నాడు.


మొహాలిలో శ్రీలంకతో జరిగిన తొలి టెస్టులోనూ (IND vs SL Test series) రోహిత్‌ శర్మ ఇలాగే ఔటయ్యాడు. లాహిరు కుమార ఎక్స్‌ట్రా పేస్‌తో వేసిన బంతులకు అతడు బలయ్యాడు. తొలి రోజు తొలి గంటలో చక్కగా బౌండరీలు కొడుతూ స్వింగ్‌లో ఉన్న అతడికి కుమార ఎక్స్‌ట్రా పేస్‌తో బంతులేశాడు. ఒకట్రెండు బౌండరీలు వచ్చినా చివరికి అదే బంతి, అదే షాట్‌తో తక్కువ పరుగులకే ఔటయ్యాడు. ఈ అలవాటును మానుకోవాలని గావస్కర్‌ సూచిస్తున్నాడు. 80, 90 పరుగులు చేసేంత వరకు ఓపిక పట్టాలని అంటున్నాడు.


'రోహిత్‌ శర్మ దీని గురించి ఆలోచించాలి. ఇది ప్రొడక్టివ్‌ షాటే అని మీరనొచ్చు. కానీ ఆ ఒక్క షాటే లేదు కదా! అతడికి ఇంకా చాలా షాట్లు ఆడొచ్చు. కాస్త అదనపు పేస్‌ జనరేట్‌ చేసే ఏ బౌలరైనా హిట్‌మ్యాన్‌కు ఇప్పుడు ఇలాంటి బంతులే వేస్తున్నారు. ఒకట్రెండు సిక్సర్లు, బౌండరీలు వస్తే ఫర్వాలేదు. కానీ బంతిని గాల్లోకి లేపడానికి అదో అవకాశం మారుతోంది. ప్రత్యర్థికి వికెట్‌ దొరుకుతోంది' అని సన్నీ అన్నాడు.


'రోహిత్‌ శర్మ తన షాట్ల పర్సంటేజీ చూసుకుంటే బెటర్‌. ఆ పుల్‌షాట్‌తోనే ఎక్కువ పరుగులు వస్తున్నాయని, తనకు అనుకూలంగా ఉందనుకుంటే ఫర్వాలేదు. కానీ ఇప్పుడవి అతడికి పనిచేయడం లేదు. అందుకే 80, 90, 100 పరుగులు చేసేంత వరకు ఆ షాట్‌ను కోల్డ్‌ స్టోరేజీలో పెట్టుకోవాలి' అని గావస్కర్‌ తెలిపాడు.