Bopanna creates history :  కుర్రాళ్లకు దీటుగా ఆడుతున్న భారత టెన్నిస్‌ వెటరన్‌ స్టార్‌ రోహన్‌ బోపన్న ఖాతాలో మరో టైటిల్‌ చేరింది. డబుల్స్‌ విభాగంలో మియామి ఓపెన్ టైటిల్‌ను సొంతం చేసుకొని రికార్డు సృష్టించాడు.  ఆస్ట్రేలియాకు చెందిన మాథ్యూ ఎబ్డెన్‌తో కలిసి బోపన్న మియామీ ఓపెన్‌లో డబుల్స్‌ విజేతగా  నిలిచాడు.  44 ఏళ్ల వయసులో ‘1000 టైటిల్‌’ సాధించిన ఆటగాడిగా రోహన్‌ రికార్డు నమోదు చేశాడు.

 

ఏజ్ పెరుగుతున్నా భారత టెన్నిస్ స్టార్ రోహన్ బోపన్న ఏ మాత్రం వెనక్కి తగ్గడంలేదు. నాలుగు పదులు దాటినా  తానింతా యంగ్ ప్లేయర్ అని అంటున్నాడు. తాజాగా మియామి ఓపెన్ టోర్నీలో డబుల్స్ టైటిల్‌ను సొంతం చేసుకుంది బోపన్న జోడి. ఈ మ్యాచ్‌లో మొదట బోపన్న జంటకు శుభారంభం దక్కలేదు. తొలి సెట్‌ను టై బ్రేకర్‌లో కోల్పోయింది. అయినాసరే  ఎలాంటి ఒత్తిడికి గురి కాకుండా రెండో రౌండ్‌లో రోహన్ - ఎబ్డెన్ పుంజుకున్నారు. ప్రత్యర్థులకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా 6-3 తేడాతో గెలిచారు. దీంతో  నిర్ణయాత్మక మూడో రౌండ్ లో  విజయం కోసం ఇరు జట్లూ హోరా హోరీ తలపడ్డాయి. కానీ చివరికి రోహన్ - ఎబ్డెన్   10-6 తేడాతో మూడో రౌండ్‌లో విజయం సాధించి టైటిల్‌ను గెలుచుకున్నారు.  44 ఏళ్ల బోపన్నకు ఇది 14వ ఏటీపీ మాస్టర్స్ 1000 ఫైనల్, మియామీలో మొదటిది. ఓవరాల్ గా ఇప్పటి వరకు 25 డబుల్స్ టైటిల్స్ నెగ్గిన భారత ఆటగాడు బోపన్నకు ఇది 63వ ఏటీపీ టూర్ లెవల్ ఫైనల్ కావడం విశేషం.

 

 వయసు ఒక సంఖ్య మాత్రమే అని చాటుతూ.. భారత సీనియర్‌ టెన్నిస్‌ ప్లేయర్‌ రోహన్‌ బోపన్న వరుస సంచలనాలు నమోదు చేశాడు. లేటు వయసులో గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌ గెలిచిన పురుష టెన్నిస్‌ ప్లేయర్‌గా చరిత్రకెక్కాడు.  కొద్దిరోజుల క్రితమే  ఆస్ట్రేలియా ఓపెన్‌ టెన్నిస్‌ మెన్స్‌ డబుల్స్‌ టైటిల్‌ను భారత టెన్నిస్‌ స్టార్‌ రోహన్ బోపన్న కైవసం చేసుకున్నాడు. ఆ గేమ్ లో ఆస్ట్రేలియన్‌ ప్లేయర్ ఎబ్డెన్‌తో కలిసి ఆడిన బోపన్న, ఇటలీ జోడి సిమోన్‌- వావాసోరి జోడీపై జయభేరి మోగించారు. తద్వారా తొలిసారి పురుషుల డబుల్స్‌ గ్రాండస్లామ్‌ టైటిల్‌ నెగ్గిన ఆటగాడిగా భారత వెటరన్ ఆటగాడు రోహన్ బోపన్న నిలిచాడు. అతిపెద్ద వయసులో ఆస్ట్రేలియా గ్రాండ్ స్లామ్ నెగ్గిన ఆటగాడిగానూ 43 ఏళ్ల రోహన్ బోపన్న రికార్డులు తిరగరాశాడు. 60 ప్రయత్నాలలో విఫలమైన బోపన్న.. అందర్నీ ఆశ్చర్యపరుస్తూ 61వ ప్రయత్నంలో అది కూడా 43 ఏళ్ల లేటు వయసులో మెన్స్ డబుల్స్ టైటిల్ సాధించాడు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం రోహన్ బోపన్నను పద్మశ్రీ పురస్కారంతో  సత్కరించిన విషయం తెలిసిందే. నిరుడు నుంచి బోప‌న్న – మ‌థ్యూ జోడీ అద్భుత విజ‌యాలు సాధిస్తూ వ‌స్తోంది. అయితే.. దుబాయ్ చాంపియ‌న్‌షిప్స్, ఇండియ‌న్ వెల్స్ టోర్నీలో ఈ జంట అనూహ్యంగా ఓట‌మి పాలైంది.  ఈ వయసులోనూ టెన్నిస్‌లో రాణించడానికి తన సతీమణి సుప్రియా కారణమని చెబుతారు బోపన్న. ఆమె చెప్పిన మాటల నుంచే స్ఫూర్తి పొందానని గుర్తు చేసుకున్నాడు.