Bumrah And Pant:  ఈ ఏడాది టీమిండియా తరఫున రిషభ్ పంత్, జస్ప్రీత్ బుమ్రాలు అద్భుత ప్రదర్శన కనబరిచారని.. బీసీసీఐ తెలిపింది. ఈ ఏడాది టెస్టుల్లో వీరిద్దరూ అత్యుత్తమ ప్రదర్శన చేశారని అభినందించింది. 


2022 లో భారత పేస్ గుర్రం జస్ప్రీత్ బుమ్రా గాయం కారణంగా చాలా మ్యాచ్ లకు దూరమయ్యాడు. అయినప్పటికీ ఫాస్ట్ బౌలింగ్ పరంగా అతను అత్యుత్తమ ప్రదర్శన చేశాడని బీసీసీఐ తెలిపింది. గాయంతో బుమ్రా బంగ్లాదేశ్ తో టెస్ట్ సిరీస్ ఆడలేదు. అలాగే టీ20 ప్రపంచకప్ నకు దూరమయ్యాడు. 


టెస్టుల్లో పంత్ సూపర్


ఈ ఏడాది టెస్టుల్లో టీమిండియా తరఫున రిషభ్ పంత్ అత్యుత్తమ ప్రదర్శన చేశాడు. అత్యధిక పరుగులు చేసిన వారిలో అగ్రస్థానంలో ఉన్నాడు. 2022లో 7 టెస్టులు ఆడిన పంత్ 12 ఇన్నింగ్సుల్లో 680 పరుగులు సాధించాడు. వాటిలో 2 సెంచరీలు, 4 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఈ ఏడాది టెస్టుల్లో పంత్ అత్యధిక స్కోరు 146 పరుగులు. 


బౌలింగ్ లో బుమ్రా బూమ్


బౌలింగ్ విషయానికొస్తే ఈ ఏడాది భారత్ తరఫున బుమ్రా టెస్టుల్లో అగ్రస్థానంలో నిలిచాడు. ఈ సంవత్సరం అతను 5 టెస్టులు మాత్రమే ఆడాడు. అయినప్పటికీ అత్యుత్తమ ప్రదర్శన కనబరిచాడు. 22 వికెట్లు తీశాడు. 2 సార్లు 5 వికెట్ల ప్రదర్శన చేశాడు. 24 పరుగులకు 5 వికెట్లు బుమ్రా అత్యుత్తమ ప్రదర్శన. గాయపడి జట్టుకు దూరమైన బుమ్రా ప్రస్తుతం కోలుకుంటున్నాడు. 


పంత్ కు యాక్సిడెంట్


డిసెంబర్ 30న టీమిండియా వికెట్ కీపర్ రిషభ్ పంత్ ఘోర రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. దిల్లీ నుంచి రూర్కీకి తన తల్లిని కలిసేందుకు వెళ్తుండగా మహ్మద్ పూర్ జాట్ సమీపంలో పంత్ నడుపుతున్న కారు డివైడర్ ను ఢీకొంది. ఢీకొన్న కొద్దిసేపట్లోనే కారులో మంటలు చెలరేగి దహనమైంది. ఈ ప్రమాదం నుంచి పంత్ తీవ్ర గాయాలతో బయటపడ్డాడు. అయితే ప్రమాదం జరిగిన సమయంలో పంత్ ను హర్యానా రోడ్ వేస్ బస్సు డ్రైవర్ సుశీల్ కుమార్, కండక్టర్ పరమ్ జీత్ లు కాపాడారు.