Royal Challengers Bangalore vs Mumbai Indians: మ్యాచ్‌ల్లో మొదట వెనుకబడ్డా తర్వాత టెర్రిఫిక్ కమ్‌బ్యాక్ ఇవ్వడంలో ముంబై ఇండియన్స్‌ను మించిన వారు లేరు. ఈ మ్యాచ్‌లో కూడా మొదట వికెట్లు త్వరగా కోల్పోయినా తర్వాత తేరుకుని మంచి స్కోరు సాధించింది. 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. తిలక్ వర్మ (84 నాటౌట్: 46 బంతుల్లో, తొమ్మిది ఫోర్లు, నాలుగు సిక్సర్లు) టాప్ స్కోరర్‌గా నిలిచాడు.


టాస్ ఓడిన ముంబై ఇండియన్స్ మొదట బ్యాటింగ్‌కు దిగింది. కానీ ముంబై టాప్ ఆర్డర్ పూర్తిగా కొలాప్స్ అయింది. రోహిత్ శర్మ (1: 10 బంతుల్లో), ఇషాన్ కిషన్ (10: 13 బంతుల్లో, రెండు ఫోర్లు), కామెరాన్ గ్రీన్ (5: 4 బంతుల్లో, ఒక ఫోర్), సూర్యకుమార్ యాదవ్ (15: 16 బంతుల్లో, ఒక ఫోర్) విఫలం అయ్యారు. దీంతో ముంబై 48 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయింది. రన్‌రేట్ కనీసం ఆరు పరుగులు కూడా లేదు.


ఈ దశలో తిలక్ వర్మ (84 నాటౌట్: 46 బంతుల్లో, తొమ్మిది ఫోర్లు, నాలుగు సిక్సర్లు) ముంబైని ఆదుకున్నాడు. ఐదో వికెట్‌కు నేహాల్ వధేరాతో (21: 13 బంతుల్లో, ఒక ఫోర్, రెండు సిక్సర్లు) కలిసి 50 పరుగులు జోడించి ఇన్నింగ్స్‌ను కుదుటపరిచాడు. నేహాల్ అవుటయ్యాక పూర్తిగా వన్ మ్యాన్ షో తరహాలో చెలరేగి ఆడాడు. తిలక్ దూకుడైన ఆటతీరుతో ముంబై చివరి ఐదు ఓవర్లలో 69 పరుగులు సాధించింది. దీంతో ముంబై 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. బెంగళూరు బౌలర్లలో కరణ్ శర్మ రెండు వికెట్లు పడగొట్టాడు. మహ్మద్ సిరాజ్, రీస్ టాప్లే, ఆకాష్ దీప్, హర్షల్ పటేల్, బ్రేస్‌వెల్‌లకు తలో వికెట్ దక్కింది.


రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తుది జట్టు
విరాట్ కోహ్లీ, ఫాఫ్ డు ప్లెసిస్ (కెప్టెన్), గ్లెన్ మాక్స్‌వెల్, మైఖేల్ బ్రేస్‌వెల్, షాబాజ్ అహ్మద్, దినేష్ కార్తీక్ (వికెట్ కీపర్), కర్ణ్ శర్మ, హర్షల్ పటేల్, ఆకాష్ దీప్, రీస్ టాప్లీ, మహ్మద్ సిరాజ్


ముంబై ఇండియన్స్ తుది జట్టు
రోహిత్ శర్మ(కెప్టెన్), ఇషాన్ కిషన్(వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్, కామెరాన్ గ్రీన్, తిలక్ వర్మ, టిమ్ డేవిడ్, నెహాల్ వధేరా, హృతిక్ షోకీన్, పీయూష్ చావ్లా, జోఫ్రా ఆర్చర్, అర్షద్ ఖాన్