క్రికెట్‌లో కొత్త శకం మొదలు కానుంది. ఇన్నాళ్లూ అండర్‌ 19 కోచ్‌గా ఉంటూ యువరక్తాన్ని టీమిండియాకు పంపించిన క్రికెట్‌ స్టార్‌ రాహుల్‌ ఇప్పుడు టీమిండియా కోచ్‌ అయ్యాడు. అతను క్రికెట్ ఆడినప్పటి నుంచి నేటి వరకు ఎంతోమందికి స్ఫూర్తిగా నిలిచాడు. అండర్‌ 19 శిక్షణలోనూ చాలా ఫలితాలు సాధించాడు. ఇప్పుడు సీనియర్స్‌కు కోచ్‌గా ఉంటూ అదే రిజల్ట్స్‌ తీసుకొస్తాడని క్రికెట్ అభిమానులు కోరుకుంటున్నారు. 
రవిశాస్త్రిని ఎంపిక చేసిన టైంలోనే రాహుల్‌ ద్రావిడ్‌ కోచ్‌గా వస్తాడని చాలా డిస్కషన్ నడిచింది. అప్పటిలో బీసీసీఐ రిక్వస్ట్‌ను రాహుల్ రిజెక్ట్ చేశాడు. తాను అండర్‌ 19 కోచ్‌గానే ఉంటానని... అందులో కంఫర్ట్‌ ఉందని తేల్చి చెప్పేశాడు. అప్పట్లో బీసీసీఐ పెద్దలు కూడా ద్రవిడ్‌ ఒప్పించడానికి ఎలాంటి ప్రయత్నం చేయలేదు. అందుకే రవిశాస్త్రి వైపు మొగ్గు చూపారు. 
రవిశాస్త్రి పదవీ కాలం ముగిసిన తర్వాత ఎవరు కోచ్‌గా ఉంటారని చర్చలు మొదలైనప్పుడు మాత్రం అంతా మళ్లీ ద్రవిడ్ వైపు చూశారు. అప్పట్లోనే బీసీసీఐ ఆఫర్ తిరస్కరించిన ద్రవిడ్ ఇప్పుడు అంగీకరిస్తాడా అన్న అనుమానం అందరిలోనూ కలిగింది. అందుకే బీసీసీఐ రెండో ఆప్షన్‌గా వీవీఎస్‌ లక్ష్మణ్‌ను ఎంపిక చేసుకుంది. కానీ ఈసారి లక్ష్మణ్‌ ఆఫర్ తిరస్కరించాడు. అందుకే ద్రవిడ్‌నే ఒప్పించాలని నిర్ణయానికి వచ్చింది గంగూలీ టీం. 
యూఏఈలో ఐపీఎల్‌ జరుగుతున్న టైంలో ద్రవిడ్‌తో బీసీసీ ఛైర్మన్‌ గంగూలీ మాట్లాడారు. కోచ్‌గా బాధ్యతలు స్వీకరించేందుకు ద్రవిడ్‌ను ఒప్పించారు. దీంతో ఆయన ఎంపిక లాంఛనమైంది. నోటిఫికేషన్ విడుదలైన తర్వాత  కోచ్‌ పదవికి దరఖాస్తు చేసుకున్నాడు. వేరే అప్లికేషన్‌లు లేకపోవడంతో ద్రవిడ్ ఎంపికి అప్పుడే ఖరారైంది. ద్రవిడ్‌ను ఆర్పీసింగ్‌, సులక్షణ నాయక్‌ల క్రికెట్‌ అడ్వైజరీ కమిటీ  ఇంటర్వ్యూ ప్రక్రియ పూర్తి చేసింది. ద్రవిడ్‌ను ఎంపిక చేసింది. 
ప్రస్తుతం జరుగుతున్న టీ20 ప్రపంచకప్‌ ముగిసిన తర్వాత భారత్‌ జట్టు న్యూజిలాండ్‌ ఓ సిరీస్‌ ఆడనుంది. ఆ సిరీస్‌తో కొత్త కోచ్‌గా ద్రవిడ్‌ బాధ్యతలు స్వీకరించనున్నాడు. అప్పటి నుంచి 2023 వరకు భారత్‌ కోచ్‌గా ద్రవిడ్ ఉంటాడు. కోచ్‌గా అంగీకరించిన ద్రవిడ్‌కు బీసీసీఐ దాదాపు పది కోట్లు వేతనంగా ఇస్తారని తెలుస్తోంది. 
2012లో క్రికెట్‌కు గుడ్‌పై చెప్పేసిన ద్రవిడ్‌ 2016లో అండర్‌19 కోచ్‌గా వచ్చి అద్భుతాలు చేశాడు.  అదే ఏడాది జరిగిన  ప్రపంచకప్‌లో రన్నరప్‌గా నిలిచన భారత్‌ 2018లో కప్ గెలుచుకుంది. 


2017లో కుంబ్లే స్థానంలో రవిశాస్త్రి ప్రధాన కోచ్‌గా వచ్చారు. అతని శిక్షణలో భారత్‌ చాలా మంచి విజయాలు నమోదు చేసింది. ఆస్ట్రేలియాలో టెస్టు సిరీస్ గెలవడం ఎప్పటికీ మర్చిపోలేని సంఘటన. ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో ఫైనల్‌ వరకు వెళ్లింది. 


రవిశాస్త్రితోపాటు అరుణ్‌, శ్రీధర్‌, విక్రమ్‌ పదవీ కాలం కూడా ముగుస్తోంది. వాళ్లు బౌలింగ్‌, బ్యాటింగ్, ఫీల్టింగ్‌ కోచ్‌లుగా ఉన్నారు. వాళ్ల స్థానంలో ఇంకా ఎవరి నియమిస్తారా అన్న సస్పెన్స్‌ కొనసాగుతోంది. 


భారత్‌ కోచ్‌గా ఎంపిక కావడం ఓ గౌరవం. మంచి ఫలితాలు ఇచ్చేందుకు ప్రయత్నిస్తాను. రవిశాస్త్రి శిక్షణలో జట్టు మంచి విజయాలు అందుకుంది. అదే స్ఫూర్తితో భవిష్యత్‌లో కొనసాగుతాం. ఇప్పుడు టీమిండియాలో ఉన్న చాలా మందితో గతంలో కలిసి పని చేశాను. వచ్చే రెండేళ్లలో చాలా ప్రధాన టోర్నీలు ఉన్నాయి. వాటిలో మంచి ప్రదర్శన చేసేలా అందరం కలిసి పని చేస్తాం.  రాహుల్‌ ద్రవిడ్‌

భారత్‌ జట్టు కోచ్‌గా ద్రవిడ్‌కు బీసీసీఐ వెల్‌కం చెబుతుంది. అండర్‌19కోచ్‌గా, ఎన్‌సీఏలో కూడా సేవలు అందించి నైపుణ్యమైన ఆటగాళ్లను ద్రవిడ్ సానబెట్టాడు. ఇప్పుడు కొత్త బాధ్యతల్లోనూ మరిన్ని అద్భుతాలు సాధిస్తాడని నమ్మకం ఉంది.   సౌరబ్‌ గంగూలీ