PV Sindhu Gold Medal: 2022 కామన్వెల్త్ క్రీడల్లో భారత షట్లర్ పీవీ సింధు స్వర్ణం సాధించింది. దీంతో పతకాల పట్టికలో భారత్ నాలుగో స్థానానికి చేరుకుంది. తాజాగా బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్ విభాగం ఫైనల్స్‌లో పీవీ సింధు అద్భుతమైన ఆట తీరును కనబర్చింది. కెనడా క్రీడాకారిణి మిచెలీ లీపై తొలిగేమ్‌లో 21-15తో నెగ్గి రెండో గేమ్‌ను 21-13తో కైవసం చేసుకుంది. ఇలా అద్భుతమైన ఆటతో వరుస సెట్‌లలో విజయం సాధించి... భారత్ కు మరో పసిడి పతకాన్ని అందించింది. కామన్వెల్త్ క్రీడల్లో సింగిల్స్‌లో ఆమెకు ఇదే తొలి స్వర్ణం. అంతకు ముందు 2014లో కాంస్యం గెలిచిన సింధు 2018లో రజతం సాధించింది.


చాలా సంతోషంగా ఉంది: సీఎం కేసీఆర్


కామన్వెల్త్ క్రీడల్లో బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు స్వర్ణం సాధించడంపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు. ఆమె కష్టపడి మెరుగైన ఆట తీరు కనబర్చిందని మెచ్చుకున్నారు. స్వర్ణ పతకం సాధించడం దేశానికే గర్వ కారణం అని అభిప్రాయపడ్డారు. 



యువతకు స్ఫూర్తిదాయకం: ఏపీ సీఎం జగన్


సీడబ్ల్యూజీ 2022లో మహిళల బ్యాడ్మింటన్ విభాగంలో కెనడాకు చెందిన మిచెలీని ఓడించి స్వర్ణం గెలుచుకున్న పీవీ సింధుకు ఏపీ సీఎం జగన్ శుభాకాంక్షలు తెలిపారు. అలాగే పురుషుల విభాగంలో కాంస్యం సాధించినందుకు కిదాంబి శ్రీకాంత్‌ను అభినందించారు. వీరిద్దరూ యువతకు స్ఫూర్తిదాయకమని వివరించారు. పతకాల పట్టికలో భారత స్థానం పైకి ఎగబాకేలా చేసిన ప్రతీ ఒక్క క్రీడాకారుడికి ధన్యవాదాలు తెలిపారు. 


సూపర్ విక్టరీ సాధించావు సింధు: రేంవంత్ రెడ్డి


కామన్ వెల్త్ మహిళల బ్యాడ్మింటన్‌లో పీవీ సింధు స్వర్ణం సాధించడం పట్ల తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. పి.వి సింధుకు అభినందనలు తెలియజేశారు. కామన్వెల్త్ క్రీడల్లో తొలిసారి పి.వి సింధు స్వర్ణం సాధించడం మన తెలుగు జాతికి గర్వ కారణం అని అన్నారు. గతంలో కాంస్యం, రజత పథకాలు సాధించి ఈసారి సూపర్ విక్టరీ సాధించారంటూ ఆమెపై పొగడ్తల వర్షం కురింపిచారు.