Neeraj Chopra Wins Silver Medal: ప్రపంచ అథ్లెటిక్స్​ ఛాంపియన్​షిప్స్​లో భారత్ నుంచి పతకం సాధించిన రెండో అథ్లెట్ నీరజ్ చోప్రా విజయంపై దేశం గర్విస్తోంది. ఒలింపిక్ ఛాంపియన్ నీరజ్ చోప్రా.. అమెరికాలోని యూజీన్‌లో ఆదివారం ఉదయం జరిగిన జావెలిన్​ త్రో ఫైనల్లో రెండో స్థానంలో నిలిచి, రజత పతకాన్ని సొంతం చేసుకున్నాడు. 88.13 మీటర్ల దూరం జావెలిన్ విసిరి సిల్వర్ మెడల్ సాధించి భారత్ నుంచి ఈ ఘనత సాధించిన తొలి అథ్లెట్‌గా నిలిచాడు జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా.


‘నీరజ్ చోప్రాకు అభినందనలు. వరల్డ్ అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్స్‌లో చారిత్రక మెడల్ సాధించావు. భారత క్రీడలకు ఇది వన్నె తెచ్చే సందర్భం. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని’ నూతన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆకాంక్షించారు. 






విశ్వ వేదికపై అత్యుత్తమ ప్రదర్శనతో సిల్వర్ మెడల్ సాధించిన భారత అథ్లెట్ నీరజ్ చోప్రాను నూతన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ అభినందించారు. కేంద్ర మంత్రులు అనురాగ్ ఠాకూర్, జి కిషన్ రెడ్డి, పీయూష్ గోయల్ సహా పలువురు నేతలు.. ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నీరజ్ చోప్రాకు అభినందనలు తెలిపారు.






దేశానికి చెందిన అత్యంత విశిష్టమైన అథ్లెట్లలో ఒకరైన నీరజ్ చోప్రా అద్భుతమైన విజయాన్ని సాధించాడని ప్రధాని మోదీ అన్నారు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలంటూ ఆల్ ది బెస్ట్ చెప్పారు.






వరల్డ్ అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్స్‌లో సిల్వర్ మెడల్ సాధించిన నీరజ్ చోప్రాను కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ అభినందించారు. ఈ ప్రతిష్టాత్మక ఈవెంట్లో మెడల్ సాధించిన తొలి పురుష అథ్లెట్, ఓవరాల్‌గా రెండో భారత అథ్లెట్ అని నీరజ్ చోప్రాను కేంద్ర మంత్రి పేర్కొన్నారు. ప్రతి అంతర్జాతీయ ఈవెంట్లో పతకాలు సాధిస్తున్నాడని కొనియాడారు. 






ఛాంపియన్‌ నీరజ్ చోప్రాకు అభినందనలు. వరల్డ్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్స్‌లో జావెలిన్ త్రోలో రజతం సాధించి అద్భుతం చేశావు అన్నారు ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. నీ విజయంతో దేశం గర్విస్తోందని ట్వీట్ చేశారు.






చరిత్ర తిరగరాసిన నీరజ్ చోప్రా.. 
వరల్డ్ అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్స్ 2022 జావెలిన్​ త్రో ఫైనల్లో రెండో స్థానంలో నిలిచి, రజత పతకాన్ని సొంతం చేసుకున్నాడు నీరజ్​ చోప్రా. దేశం తనపై పెట్టుకున్న ఆశల్ని సజీవంగా నిలుపుతూ సిల్వర్ మెడల్‌ను అందించాడు. 46 ఏళ్ల ప్రపంచ అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్‌ చరిత్రలో భారత్‌కు ఇది కేవలం రెండో పతకం మాత్రమే. డిఫెండింగ్​ ఛాంపియన్​, గ్రెనెడాకు చెందిన అండర్సన్​ పీటర్స్ మరో ఏడాది స్వర్ణాన్ని కైవసం చేసుకున్నాడు. తొలి ప్రయత్నంలోనే 90.46 మీటర్ల దూరం బల్లెం (Javelin) విసరి స్వర్ణాన్ని ఖాయం చేసుకున్నాడు. 88.09 మీటర్ల దూరం బల్లెం విసిరిన అథ్లెట్, వాద్లెచ్ (చెక్ రిపబ్లిక్) మూడో స్థానంలో నిలిచి కాంస్యం అందుకున్నాడు.