భారత విద్యా బోర్డు (Indian Education Board) నిర్వహించిన తొలి జాతీయ క్రీడల ఫస్ట్ ఫేజ్ పోటీలు హరిద్వార్‌లో ముగిశాయి. ఇందులో పతంజలి గురుకులం అగ్రస్థానంలో నిలిచింది. అండర్-17 ఫ్రీస్టైల్, గ్రీకో-రోమన్ రెజ్లింగ్ విభాగాలలో ఈ సంస్థ స్వర్ణ పతకాలు సాధించింది. చివరి రోజున జరిగిన పోటీల్లో పతంజలి గురుకులం ఆధిపత్యం చెలాయించింది.
ఈ టోర్నమెంట్‌లో రెజ్లింగ్ ప్రధానాంశంగా 50కి పైగా జట్లు పాల్గొన్నాయి. విద్యార్థులు, క్రీడాభిమానుల నుండి ఈ పోటీలకు అనూహ్య స్పందన లభించింది. స్వామి రామ్‌దేవ్, ఆచార్య బాలకృష్ణ కూడా ఈవెంట్‌కు హాజరై యువ అథ్లెట్లను అభినందించారు. ఫస్ట్ ఫేజ్ క్రీడల ముగింపు కార్యక్రమంలో విజేతలకు పతకాలు, ట్రోఫీలు, సర్టిఫికెట్లు అందజేశారు.
రెజ్లింగ్ విభాగంలో హరిద్వార్ అగ్రస్థానం
రెండవ, చివరి రోజున పతంజలి గురుకులం హరిద్వార్ వరుస విజయాలు సాధించింది. అండర్-17 ఫ్రీస్టైల్ రెజ్లింగ్‌లో వారి అథ్లెట్ అగ్రస్థానంలో నిలిచాడు. అనంతరం హర్యానాకు చెందిన గురుకుల్ కిషన్‌గఢ్ ఘసేరా నిలిచింది. అండర్-17 గ్రీకో-రోమన్ విభాగంలో కూడా ఇదే రిజల్ట్ రిపీట్ అయింది. హరిద్వార్ స్వర్ణం కైవసం చేసుకోగా, కిషన్‌గఢ్ ఘసేరా రజతం సాధించింది.
గురుకులం, జీఎస్ఎస్ ఇంటర్నేషనల్ స్కూల్ ఆగ్రా, మరికొన్ని సంస్థల విద్యార్థులు కూడా అద్భుత ప్రదర్శనలు చేశారు. 150 మందికి పైగా స్థానిక పాఠశాల విద్యార్థులు కార్యక్రమానికి హాజరై, ఈ కొత్త జాతీయ స్థాయి పోటీలను ఆసక్తిగా చూశారు. దాంతో ఈవెంట్ గ్రాండ్ సక్సెస్ అయింది.
వీరు భారతదేశానికి గర్వకారణం
ముగింపు కార్యక్రమంలో పతంజలి యోగపీఠ్ ప్రధాన కార్యదర్శి ఆచార్య బాలకృష్ణ మాట్లాడుతూ.. అథ్లెట్లను వ్యక్తిగతంగా కలిసి వారు మరెన్నో విజయాలు సాధించాలని ఆశీర్వదించారు. ఆయన మాట్లాడుతూ.. “ఈ యువకుల ఉత్సాహాన్ని చూస్తుంటే, భవిష్యత్తులో ఈ పిల్లలు దేశంలోనే కాకుండా ప్రపంచ స్థాయిలో కూడా భారతదేశానికి గర్వకారణంగా నిలుస్తారు అనిపిస్తుంది. క్రీడల ద్వారా వారు శారీరకంగా, మానసికంగా మరింత దృఢంగా తయారవుతారని” అన్నారు. ఇలాంటి కార్యక్రమాలు యువతలో క్రమశిక్షణ, టీం స్పిరిట్ పెంపొందిస్తాయని ఆయన అన్నారు.
రామ్‌దేవ్ కూడా నేషనల్ స్పోర్ట్స్ ఈవెంట్లో పాల్గొన్నవారిని ప్రోత్సహించారు. గురుకులం వద్ద ఆధునిక ఇండోర్ స్టేడియం త్వరలో పూర్తవుతుందని ప్రకటించారు. “ఈ స్టేడియం జాతీయ స్థాయిలో మాత్రమే కాకుండా అంతర్జాతీయ స్థాయి క్రీడా పోటీలకు వేదికగా మారుతుంది. గ్రామీణ, పట్టణ యువతకు సమాన అవకాశాలు కల్పించడమే మా లక్ష్యం” అని రాందేవ్ అన్నారు.
తదుపరి దశల్లో మరిన్ని క్రీడా విభాగాలను చేర్చుతారు
ఈ కార్యక్రమం వెనుక ఉన్న లక్ష్యాన్ని రామ్‌దేవ్ వివరించారు. “ఈ పోటీ భారత విద్యా బోర్డు చొరవ. ఇది క్రీడలను విద్యలో అంతర్భాగంగా మార్చడంపై ఫోకటస్ చేసింది. స్పోర్ట్స్ ఈవెంట్ మొదటి దశ హరిద్వార్‌లో పూర్తయింది, రెండవ దశ ఆగ్రాలో, మూడవది లక్నోలో, ముగింపు దశ పోటీలు జైపూర్‌లో జరుగుతాయి” అని అన్నారు.
రాబోయే దశల్లో మరిన్ని క్రీడా విభాగాలను ఈవెంట్లో ప్రవేశపెడతామని, దాంతో ఎక్కువ మంది విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొనేందుకు, పోటీ పడేందుకు ఒక వేదికను కల్పిస్తామని నిర్వాహకులు తెలిపారు. మొదటి దశలో చూపించిన ఉత్సాహం, క్రీడలు దేశ నిర్మాణానికి, యువత అభివృద్ధికి ఎలా ఉపయోగపడతాయో తెలియజేస్తాయని పేర్కొన్నారు.