Paris Olympics Abhinav Bindra to be one of the torch bearers: బీజింగ్‌లో 2018లో జ‌రిగిన‌ ఒలింపిక్స్‌లో బంగారు ప‌త‌కంతో భారత ఖ్యాతిని అంతర్జాతీయ వేదికపై వ్యాప్తి చేసిన షూటర్‌ అభిన‌వ్ బింద్రా(Abhinav Bindra)కు కు అరుదైన గౌర‌వం ద‌క్కింది. ఈ ఏడాది జరగనున్న పారిస్‌ ఒలింపిక్స్‌ 2024(Paris Olympics2024)లో అభినవ్‌ బింద్రా భార‌త టార్చ్ బేర‌ర్‌గా ఎంపిక‌య్యాడు. అథ్లెట్స్ క‌మిష‌న్ ఆఫ్ ది ఇంట‌ర్నేష‌న‌ల్ ఒలింపిక్ క‌మిటీ స‌భ్యుడిగా ఉన్న బింద్రా ఒలింపిక్ జ్యోతిని వెలిగించ‌నున్నాడు. ఈ గౌర‌వం ద‌క్కడంతో ఈ మాజీ షూట‌ర్ ప‌ట్టలేనంత సంతోషంలో ఉన్నాడు. పారిస్ ఒలింపిక్స్‌లో టార్చ్ బేర‌ర్‌గా ఎంపికైనందుకు చాలా సంతోషంగా ఉందన్న బింద్రా... ఒలింపిక్ జ్యోతి శాంతి, ప‌ట్టుద‌ల‌కు ప్రతీక‌ అని అన్నాడు. ఈ కాగ‌డ మ‌నంద‌రి ఐక్యత‌కు, క‌ల‌ల‌కు ప్రతిరూపమని ఎక్స్ ఖాతాలో పోస్ట్ పెట్టాడు. 2008 బీజింగ్‌ ఒలింపిక్స్‌లో 10 మీట‌ర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో బింద్రా స్వర్ణ ప‌త‌కం గెలిచాడు. జూలై 26వ తేదీన ప్యారిస్‌లో ఒలింపిక్స్ షురూ కానున్నాయి. ఆగ‌స్ట్ 11వ తేదీన ఈ మెగా టోర్నీ ముగియ‌నుంది.

 

పారిస్‌కు భారత షూటర్ల క్యూ...

పారిస్‌ ఒలింపిక్స్‌లో పాల్గొనే భారత షూటర్ల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈసారి పారిస్ ఒలింపిక్స్‌లో భారత షూటర్లు పాల్గొననున్నారు. ఇప్పటికే 17 మంది షూటర్లు పారిస్‌ ఒలింపిక్స్‌కు అర్హత సాధించగా తాజాగా మరో ఇద్దరు షూటర్లు క్వాలిఫై అయ్యారు. కువైట్‌లో జరుగుతున్న ఏషియన్ షాట్‌గన్ ఛాంపియన్‌షిప్‌(Asian Shotgun Championships)లో పురుషుల స్కీట్ విభాగంలో అనంత్‌జీత్ సింగ్(Anant Jeet Singh Naruka) రజత పతకం గెలిచి ఒలింపిక్స్‌కు అర్హత సాధించాడు. ఈ విభాగంలో తృటిలో స్వర్ణ పతకం చేజార్చుకున్న అనంత్‌జీత్‌సింగ్‌ రెండో స్థానంలో నిలిచి రజతం గెలుచుకున్నాడు. స్కీట్‌ విభాగంలో స్వర్ణం గెలిచిన చైనీస్ తైపీ షూటర్ లీ మెంగ్ యువాన్ కంటే అనంత్‌జీత్ ఒక్క పాయింట్ మాత్రమే వెనుకబడి తృటిలో స్వర్ణాన్ని చేజార్చుకున్నాడు. 

 

మహిళల స్కీట్ విభాగంలో రైజా ధిల్లాన్( Raiza Dhillon) సైతం రజతం దక్కించుకుంది. 52 స్కోరుతో రెండో స్థానంలో నిలిచింది. మరో భారత షూటర్ మహేశ్వరి చౌహాన్ 43 స్కోరుతో కాంస్యం గెలుచుకుంది. అయితే తొలి రెండు స్థానాల్లో నిలిచిన వారే ఒలింపిక్స్‌కు అర్హత సాధించే అవకాశం ఉంది. అందుకే మహేశ్వరి చౌహాన్‌కు అవకాశం దక్కలేదు. అనంత్‌జీత్ , రైజా ధిల్లాన్ పారిస్ ఒలింపిక్స్‌కు అర్హత సాధించడంతో విశ్వ క్రీడల్లో పాల్గొనే భారత షూటర్ల సంఖ్య 19కు చేరింది. పురుషుల 25 మీటర్ల ర్యాపిడ్‌ ఫైర్‌ ఈవెంట్‌లో విజయ్‌వీర్‌ సిద్ధూ విశ్వ క్రీడలకు అర్హత సాధించాడు. ఆసియా ఒలింపిక్‌ క్వాలిఫయర్స్‌(Asia Olympic Qualifiers) టోర్నీలో విజయ్‌వీర్‌ రజత పతకం గెలిచి విశ్వక్రీడలకు బెర్త్‌ ఖాయం చేశాడు. క్వాలిఫయింగ్‌ దశలో 577 పాయింట్లు సాధించిన విజయ్‌వీర్‌ నాలుగో స్థానంలో నిలిచాడు. ఫైనల్‌కు చేరిన ఆరుగురిలో నలుగురికి ఒలింపిక్స్‌కు అర్హత సాధించే అవకాశం ఉండగా అతనికి ఈ చాన్స్‌ లభించింది. చండీగఢ్‌కు చెందిన 21 ఏళ్ల వీర్‌ గత ఏడాది హాంగ్జూ ఆసియా క్రీడల్లో కాంస్యం సాధించాడు.