Lieutenant Colonel Neeraj Chopra: భారతదేశపు స్టార్ ఒలింపిక్ అథ్లెట్ నీరజ్ చోప్రాకు బుధవారం నాడు భారత సైన్యంలో 'లెఫ్టినెంట్ కల్నల్' పోస్టు వరించింది. క్రీడల్లో గొప్ప విజయాలు సాధించినందుకు, యువతకు స్ఫూర్తినిచ్చినందుకు నీరజ్‌కు ఈ గౌరవం దక్కింది. ఢిల్లీలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది సమక్షంలో ఆయన ఈ పదవిని అందుకున్నారు. నీరజ్ చోప్రా 2016లో నాయిబ్ సుబేదార్‌గా భారత సైన్యంలోకి ప్రవేశించారు. 2021లో ఆయనకు పదోన్నతి లభించింది, ఆ తర్వాత ఆయన సుబేదార్ పదవిని పొందారు.
ది గెజిట్ ఆఫ్ ఇండియా ప్రకారం, ఈ నియామకం ఏప్రిల్ 16 నుంచి అమల్లోకి వచ్చింది. 2016లో ఆయన భారత సైన్యంలో చేరారు. అథ్లెటిక్స్‌లో నిరంతరం మంచి ప్రదర్శన చేసినందుకు 2018లో అర్జున అవార్డుతో సత్కరించిచారు. మూడేళ్ల తర్వాత, అతను టోక్యో ఒలింపిక్స్‌లో పురుషుల జావెలిన్ త్రోలో స్వర్ణ పతకం సాధించి చరిత్ర సృష్టించాడు. ఈ ఒక్క విజయంతో ఆయన భారతదేశంలోని లక్షలాది మంది యువతకు స్ఫూర్తినిచ్చారు 2021లో ఆయనకు ఖేల్ రత్న అవార్డు లభించింది.
భారత అథ్లెటిక్స్‌కు నీరజ్ చోప్రా చేసిన కృషి అనిర్వచనీయమైనది. 2022లో ఆయనకు పరమ విశిష్ట సేవా పతకం లభించింది, ఇది భారత సైన్యం అందించే అత్యున్నత గౌరవం. ఈ విజయాలన్నింటితో నీరజ్ చోప్రా కారణంగా భారతదేశంలో అథ్లెటిక్స్ , జావెలిన్ త్రో సరికొత్త అధ్యాయంగా మారింది.
జావెలిన్ త్రోలో నిరంతరం సాధిస్తున్న విజయాల కారణంగా, 2022లో ఆయనకు సుబేదార్ మేజర్ పోస్టుకు పదోన్నతి లభించింది. అదే సంవత్సరంలో, ఆయన భారతదేశ నాల్గో అత్యున్నత పౌర పురస్కారమైన పద్మశ్రీ అవార్డు వరించింది. నీరజ్ చోప్రా చివరిసారిగా ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో కనిపించారు, అక్కడ అతను ఎనిమిదో స్థానంతో సరిపెట్టుకోవలసి వచ్చింది.
యూనిఫామ్ ధరించడం గర్వంగా ఉంది: నీరజ్ చోప్రా
ఆర్మీ యూనిఫామ్ ధరించడం చాలా గర్వంగా ఉందని అన్నాడు నీరజ్ చోప్రా, తనకు దగ్గిన గౌరవంపై ఎక్స్ వేదికగా స్పందించాడు. " ఇది గౌరవం కంటే ఎక్కువ - ఇది నా దేశం పట్ల నా బాధ్యత. నాకు లెఫ్టినెంట్ కల్నల్ గౌరవ హోదాను ఇచ్చినందుకు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, టెరిటోరియల్ ఆర్మీకి ధన్యవాదాలు. ఈ యూనిఫాం ధరించడం గర్వంగా ఉంది. జై హింద్. " అని ఓ పోస్టు పెట్టాడు.