WFI Confirms No Trials Wrestlers Quota Winners to Participate Paris Olympics: క్వాలిఫయింగ్ టోర్నీల్లో సత్తా చాటి... పారిస్ ఒలింపిక్స్(Paris Olympics 2024) బెర్తులు సాధించిన ఆరుగురు రెజ్లర్లకు మళ్లీ ట్రయల్స్ నిర్వహిస్తారన్న ఊహాగానాలకు చెక్ పడింది. ఒలింపిక్స్ అర్హత సాధించిన రెజ్లర్లకు ఎలాంటి ట్రయల్స్ నిర్వహించబోమని రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(WFI) స్పష్టం చేసింది. సెలక్షన్ ట్రయల్స్‌లో పాల్గొనాలని తమపై ఒత్తిడి చేయవద్దని ఇటీవలే పారిస్ ఒలింపిక్స్ బెర్తులు సాధించిన ఇండియా మహిళా రెజ్లర్లు.. WFIకు విజ్ఞప్తి చేశారు.
రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు సంజయ్ సింగ్ (Sanjay Singh) పారిస్ ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన రెజ్లర్లకు ఎలాంటి ట్రయల్స్ నిర్వహించబోమని తేల్చి చెప్పారు. ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన క్రీడాకారులు పారిస్‌కు వెళ్లి భారత త్రివర్ణ పతాకంతో మార్చ్ ఫాస్ట్‌లో పాల్గొంటారని సంజయ్ సింగ్ వెల్లడించారు. ఈ ప్రకటనతో పారిస్ ఒలింపిక్స్ 2024 కోసం రెజ్లర్లకు ట్రయల్స్ నిర్వహిస్తారన్న ఊహాగానాలకు చెక్ పడింది. అయితే రెజ్లర్ల ఫామ్, ఫిట్‌నెస్‌ను రాబోయే టోర్నమెంట్‌లలో పరిశీలిస్తామని సంజయ్ సింగ్ తెలిపారు. హంగేరిలో తదుపరి శిక్షణా శిబిరం ఉంటుందని అక్కడ రెజ్లర్ల ఫిట్‌నెస్‌ను పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని WFI తెలిపింది. ఎవరైనా రెజ్లర్ ఫిట్‌నెస్‌తో లేకపోతే జూలై 8లోపు ట్రయల్స్ నిర్వహించి ఆ స్థానాన్ని భర్తీ చేస్తామని రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా స్పష్టం చేసింది.
ఒలింపిక్స్‌కు ఆరుగురు రెజర్లు
ఇప్పటికే పారిస్ ఒలింపిక్స్‌కు భారత్ నుంచి ఆరుగురు మహిళలు బెర్తులు సొంతం చేసుకున్నారు. 57 కేజీల విభాగంలో అమన్ సెహ్రావత్ ఒక్కడే అర్హత సాధించాడు. వినేష్ ఫోగట్ (50 కేజీలు), ఆంటిమ్ పంఘల్ (53 కేజీలు), అన్షు మాలిక్ (57 కేజీలు), నిషా దహియా (68 కేజీలు), రీతికా హుడా (76 కేజీలు) పారిస్ ఒలింపిక్స్‌కు అర్హత సాధించారు.
ఏం జరిగిందంటే..?
ఒలింపిక్స్‌కు ముందు ట్రయల్స్ నిర్వహించవద్దని... అలా చేస్తే గాయలవుతాయని రెజర్లు WFIకి విజ్ఞప్తి చేశారు. ఒలింపిక్స్‌కు ముంగిట ట్రయల్స్‌లో పాల్గొంటే శారీరక, మానసిక ఒత్తిడికి గురవడమే కాకుండా తమ ఒలింపిక్స్ ప్రిపరేషన్స్‌ను దెబ్బతీస్తుందని అన్షు, ఇతర రెజ్లర్లు అభిప్రాయపడ్డారు. కీలక సమయంలో తమ ప్రతి అడుగు, చేసే ప్రతి పని ఒలింపిక్స్‌లో ఇండియా పతక అవకాశాలపై ప్రభావం చూపుతుందని తెలిపారు. ఒలింపిక్స్‌కు ప్రిపేర్ అవ్వడానికి తమకు కావాల్సింది మానసిక ప్రశాంతత అని స్టార్ రెజ్లర్ అన్షు మాలిక్ అభిప్రాయపడింది. అందుకే ట్రయల్స్‌ను నిర్వహించవద్దని అభ్యర్థించారు. ఈ అభ్యర్థనను సంజయ్ సింగ్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ అంగీకరించింది. రెజ్లర్ల అభ్యర్థనపై తాము చర్చించామని.. ఇద్దరు చీఫ్ కోచ్‌లు కూడా ట్రయల్స్ నిర్వహిస్తే గాయాలు అవుతాయని తెలిపారని సంజయ్ సింగ్ వెల్లడించారు. ఇది భారత్ పతక అవకాశాలపై ప్రభావం చూపుతుందని.. అందుకే ట్రయల్స్ నిర్వహించకూడదని నిర్ణయించామని సంజయ్ సింగ్ తెలిపారు.
ఈ ఒక్కసారికే
2024 పారిస్ ఒలింపిక్ క్రీడలకు అర్హత సాధించిన రెజ్లర్లందరికీ సెలక్షన్ ట్రయల్స్ నుంచి మినహాయింపు ఇవ్వాలని సెలక్షన్ కమిటీ ఏకగ్రీవంగా నిర్ణయించిందని సంజయ్‌సింగ్ తెలిపారు. ఈ ఒక్కసారికి మాత్రమే మినహాయింపు ఇచ్చామని.. భవిష్యత్తులో దీనిని కొనసాగించబోమని WFI స్పష్టం చేసింది.