భారతదేశ బాక్సింగ్‌లో మరో సంచలనం. తెలంగాణ రాష్ట్రానికి చెందిన నిఖత్ జరీన్ మహిళల ప్రపంచ చాంపియన్ షిప్‌లో స్వర్ణం సాధించింది. గురువారం రాత్రి జరిగిన 52 కేజీల విభాగం ఫైనల్స్‌లో ఇండోనేషియాకు చెందిన జుటామస్ జిట్‌పాంగ్‌పై 5-0తో నిఖత్ విజయం సాధించింది. 


ప్రపంచ చాంపియన్ షిప్ గెలిచిన ఐదో మహిళగా నిఖత్ జరీన్ నిలిచింది. గతంలో మేరీకోమ్ (ఆరుసార్లు), సరితా దేవి, జెన్నీ ఆర్.ఎల్., లేఖ కే.సీ. ప్రపంచ ఛాంపియన్లుగా నిలిచారు. దీంతో ఒక స్వర్ణం, రెండు కాంస్య పతకాలతో భారత్ ఈ టోర్నమెంట్‌ను ముగించింది.


జిట్‌పాంగ్‌పై విజయం సాధించేందుకు నిఖత్ జరీన్ మొదటి రౌండ్‌లో ఎంతో వేగంగా ఆడింది. తన పంచ్‌ల నుంచి తప్పించుకుంటూనే స్ట్రయిట్ పంచ్‌లతో ఎదురుదాడి చేసింది. దీంతో మొదటి రౌండ్‌లోనే తను ఆధిక్యం సంపాదించింది. అయితే రెండో రౌండ్‌లో దూకుడు ప్రదర్శించిన జిట్‌పాంగ్ అంతరాన్ని తగ్గించిందే తప్ప పైచేయి సాధించలేకపోయింది. చివరి రౌండ్‌లో మరింత దూకుడుగా ఆడిన నిఖత్ బౌట్‌తో పాటు మ్యాచ్‌ను కూడా ముగించింది. 2019లో థాయ్‌ల్యాండ్ ఓపెన్‌లో జిట్‌పాంగ్‌ను ఓడించిన అనుభవం నిఖత్‌కు కలిసొచ్చింది.


భారత్‌కు చెందిన మిగతా బాక్సర్లలో మనీషా మౌన్ 57 కేజీల విభాగంలో, పర్వీన్ 63 కేజీల విభాగంలో కాంస్య పతకాలు గెలిచారు. మొత్తంగా మహిళల ప్రపంచ చాంపియన్ షిప్‌లో భారత్ 10 స్వర్ణ పతకాలు, ఎనిమిది రజత పతకాలు, 21 కాంస్య పతకాలు సాధించింది.