Neeraj Chopra: ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్ లో స్వర్ణం గెలిచిన తొలి భారతీయుడిగా నీరజ్ చోప్రా నిలిచిన విషయం తెలిసిందే. ఒలింపిక్స్ లో స్వర్ణ పతకంతో భారతీయులను గర్వపడేలా చేసిన ఈ వీరుడు.. తాజాగా జరిగిన పోటీల్లోనూ సత్తా చాటాడు. అయితే నీరజ్ చోప్రాకు సంబంధించి తాజాగా ఓ విషయం వెలుగులోకి వచ్చింది. ఫీల్డ్ లో సత్తా చాటి భారతీయ జెండాను రెపరెపలాడించిన నీరజ్ చోప్రా.. జాతీయ జెండాను గౌరవించిన తీరు ఇప్పుడు అందరి మనసును గెలుచుకుంటోంది.
హంగేరి రాజధాని బుడాపెస్ట్ లో ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్ పోటీలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఫైనల్ లో 88.17 మీటర్లు బల్లెం విసిరి గోల్డ్ మెడల్ సాధించాడు నీరజ్ చోప్రా. నీరజ్ చోప్రా ప్రతిభకు ఫిదా అయిన హంగేరీకి చెందిన ఓ మహిళ.. నీరజ్ చోప్రాను ఆటోగ్రాఫ్ అడిగింది. త్రివర్ణ పతాకాన్ని తీసుకువచ్చి దానిపై ఆటోగ్రాఫ్ ఇవ్వాలని కోరింది. అయితే దానికి నీరజ్ చోప్రా నిరాకరించాడు. భారతీయ జెండాపై సంతకం చేయలేనని, అది ఫ్లాగ్ కోడ్ ఆఫ్ కండక్ట్ ప్రకారం తప్పిదం కిందే వస్తుందని సున్నితంగా ఆమెకు వివరించి చెప్పాడు. కావాలంటే తన టీషర్టుపై ఆటోగ్రాఫ్ ఇస్తానని చెప్పి సంతకం చేశాడు.
హంగెరీ మహిళ టీషర్టుపై నీరజ్ చోప్రా ఆటోగ్రాఫ్ ఇస్తున్న ఫోటో కాస్త సోషల్ మీడియాలో ప్రత్యక్షం కావడంతో.. నీరజ్ చోప్రా.. దేశభక్తిని నెటిజన్లు కొనియాడుతున్నారు. గ్రౌండ్ లో భారత పతాకాన్ని రెపరెపలాడేలా చేసి, బయట కూడా ఆ జెండాకు అంతే గౌరవం ఇవ్వడం పట్ల ప్రశంసలు కురిపిస్తున్నారు.
ఆదివారం జరిగిన ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్ లోని జావెలిన్ త్రో ఫైనల్ లో నీరజ్ 88.17 మీటర్ల త్రోతో విజేతగా నిలిచాడు. నీరజ్ గెలిచిన ఈ స్వర్ణం మొత్తం మీద ప్రపంచ అథ్లెటిక్స్ లో భారత్ కు లభించిన మూడో పతకం మాత్రమే. అంతకముందు 18 సార్లు వచ్చిన పతకాలు కేవలం రెండే. అలాంటిది ఈసారి ఏకంగా స్వర్ణం సాధిస్తూ నీరజ్ తన పేరును సువర్ణాక్షరాలతో లిఖించుకున్నాడు.
Also Read: రాహుల్ గాంధీని ట్రోల్ చేస్తున్న బీజేపీ, ప్రధాని అభ్యర్థి అంటూ గహ్లోట్ చేసిన ప్రకటనపై సెటైర్లు
ఫైనల్ లో తొలి త్రోలో నీరజ్ ఫౌల్ చేశాడు. రెండో ప్రయత్నంలో 88.17 మీటర్లు విసిరి అగ్రస్థానానికి దూసుకెళ్లాడు. మూడోసారి 86.32 మీటర్లు విసిరాడు. ఆ తర్వాతి మూడు ప్రయత్నాల్లోనూ 88 మీటర్ల మార్క్ దాటలేకపోయాడు. సో రెండో ప్రదర్శనే అత్యుత్తమం. దాంతోనే స్వర్ణం సాధించాడు.
క్రితంసారి ఛాంపియన్షిప్స్ లో రజతం సాధించిన నీరజ్ ఈసారి మరో అడుగు ఘనంగా ముందుకేసి పసిడి పట్టేశాడు. నీరజ్ తన గేమ్‌ను ఫౌల్‌తో ప్రారంభించాడు. కానీ వెంటనే తేరుకొని రెండో ప్రయత్నంలో అద్భుతం సాధించాడు. రెండోసారి జావెలిన్‌ను 88.17 మీటర్లు విసిరాడు. అప్పటి వరకు టాప్‌లో ఉన్న ఒలివర్ హెలాండర్ విరిసిన 83.38 మీటర్లు కంటే దాదాపు నాలుగు మీటర్లు ఎక్కువ అన్నమాట. నీరజ్ చోప్రాకు పాకిస్థాన్‌కు చెందిన అర్షద్ నదీమ్, జర్మనీకి చెందిన జూలియన్ వెబర్, చెక్ రిపబ్లిక్‌కు చెందిన జాకుబ్ వడ్లెజ్ నుంచి గట్టి పోటీ ఎదురైంది. అయినా చోప్రాను అధిగమించలేకపోయారు.