భారత స్టార్‌ జావెలిన్ త్రో అథ్లెట్‌, ఒలింపిక్‌ స్వర్ణ పతక విజేత నీరజ్‌ చోప్రా మరో అరుదైన ఘనత సాధించాడు. ఇప్పటికే ఎన్నో రికార్డులను తన పేరున లిఖించుకున్న నీరజ్‌ చోప్రా,  ఇప్పుడు పురుషుల ప్రపంచ అథ్లెట్ ఆఫ్ ది ఇయర్‌ అవార్డుకు నామినేట్‌ అయ్యాడు. 2023 ప్రపంచ ఛాంపియన్‌షిప్‌, ఆసియా క్రీడల్లో స్వర్ణం గెలిచి అంతర్జాతీయ వేదికపై భారత ఖ్యాతిని నీరజ్‌ వెలుగెత్తి చాటాడు. ఇప్పుడు పురుషుల ప్రపంచ అథ్లెట్ ఆఫ్ ద ఇయర్ 2023  పురస్కారానికి కూడా నామినేట్‌ అయి మరో ఘనత సాధించాడు. ఈ అవార్డు కోసం ఈ స్టార్‌ అథ్లెట్‌..స్ప్రింటర్ నోహ్ లైల్స్, షాట్ పుటర్ ర్యాన్ క్రౌజర్, పోల్ వాల్ట్ స్టార్ మోండో డుప్లాంటిస్‌లతో పోటీపడనున్నాడు. ప్రపంచ అథ్లెటిక్స్  సమాఖ్య ప్రకటించే ఈ ప్రతిష్టాత్మక అవార్డు కోసం 11 మంది దిగ్గజ అథ్లెట్లను షార్ట్‌ లిస్ట్‌ చేయగా అందులో నీరజ్‌కు చోటు దక్కింది. ఆధునిక ట్రాక్ అండ్ ఫీల్డ్ లెజెండ్స్‌తో పోటీ పడుతున్న నీరజ్..... నామినీల జాబితాలోకి రావడం ఇదే మొదటిసారి.

 

దిగ్గజాలతో పోటీ

షాట్‌పుట్ ప్రపంచ ఛాంపియన్ ర్యాన్ క్రౌజర్, పోల్ వాల్ట్ స్టార్ మోండో డుప్లాంటిస్, 100 మీటర్లు, 200 మీటర్ల ప్రపంచ ఛాంపియన్ నోహ్ లైల్స్ వంటి దిగ్గజ అథ్లెట్లతో నీరజ్  మెన్స్‌ వరల్డ్‌ అథ్లెట్ ఆఫ్ ద ఇయర్ 2023 అవార్డు కోసం పోటీ పడనున్నాడు. ఇటీవలే ఆసియా క్రీడల్లో నీరజ్ చోప్రా బంగారు పతకం గెలిచి సంచలనం సృష్టించాడు. ఆసియా గేమ్స్‌లో 88.88 మీటర్ల దూరం బల్లాన్ని విసిరి స్వర్ణాన్ని ముద్దాడాడు. మరో భారత జావెలిన్‌ త్రోయర్‌ కిషోర్ కుమార్ జెనా రజతం సాధించాడు. ఈ ఇద్దరు అథ్లెట్లు.. పారిస్ ఒలింపిక్స్‌కు అర్హత సాధించారు. డైమండ్ లీగ్ ఫైనల్‌లో నీరజ్‌ రజత పతకం దక్కించుకున్నాడు. కానీ ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో88.17 మీటర్ల త్రోతో స్వర్ణం గెలిచిన తొలి భారతీయుడిగా నీరజ్ చరిత్ర సృష్టించాడు. 

 

ఓటింగ్‌ ద్వారా ఎంపిక...

ఓటింగ్ ప్రక్రియ ద్వారా ముందు ఫైనలిస్టులను ఎంపిక చేస్తారు. తర్వాత మెన్స్‌ వరల్డ్‌ అథ్లెట్ ఆఫ్ ద ఇయర్ 2023 విజేతను డిసెంబర్ 11న ప్రకటిస్తారు. వరల్డ్ అథ్లెటిక్స్ కౌన్సిల్, వరల్డ్ అథ్లెటిక్స్ సమాఖ్య తమ ఓట్లను ఈ మెయిల్ ద్వారా వేస్తాయి. అయితే అభిమానులు వరల్డ్ అథ్లెటిక్స్ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా ఆన్‌లైన్‌లో ఓటు వేయవచ్చు. అక్టోబరు 28 శనివారం అర్ధరాత్రితో వరల్డ్ అథ్లెట్స్ ఆఫ్ ది ఇయర్ కోసం ఓటింగ్ ముగుస్తుంది. 

 

మెన్స్‌ వరల్డ్‌ అథ్లెట్ ఆఫ్ ద ఇయర్ 2023 నామినీలు

1‌) నీరజ్ చోప్రా, భారత్‌

జావెలిన్ త్రో ప్రపంచ ఛాంపియన్, ఆసియా క్రీడల ఛాంపియన్

 

2) ర్యాన్ క్రౌజర్, అమెరికా

షాట్ పుట్ ప్రపంచ ఛాంపియన్

 

3) మోండో డుప్లాంటిస్, స్వీడన్‌

పోల్ వాల్ట్ ప్రపంచ ఛాంపియన్

 

4) సౌఫియాన్ ఎల్ బక్కాలి, మొరాకో 

3000మీ. స్టీపుల్‌చేజ్ ప్రపంచ ఛాంపియన్

 

5) జాకోబ్ ఇంగెబ్రిగ్ట్‌సెన్, నార్వే

1500మీ/ 5000మీటర్ల ప్రపంచ ఛాంపియన్

 

6) కెల్విన్ కిప్టం, కెన్యా

మారథాన్ ప్రపంచ రికార్డ్ బ్రేకర్

 

7) పియర్స్ లెపేజ్, కెనడా

డెకాథ్లాన్ ప్రపంచ ఛాంపియన్

 

8) నోహ్ లైల్స్, అమెరికా

100మీ/200మీ ప్రపంచ ఛాంపియన్

 

9) అల్వారో మార్టిన్,  స్పెయిన్‌

20 కి.మీ, 35 కి.మీటర్ల వాక్‌ ఛాంపియన్

 

10) మిల్టియాడిస్ టెన్టోగ్లో, గ్రీస్‌

లాంగ్ జంప్ ప్రపంచ ఛాంపియన్

 

11‌) కార్స్టన్ వార్హోమ్, నార్వే

400మీ హర్డిల్స్ ప్రపంచ ఛాంపియన్