Malaysia Open Super Tournament: మలేసియా ఓపెన్‌ వరల్డ్‌ టూర్‌ సూపర్‌–1000 టోర్నీ(Malaysia Open Super 1000 tournament) ఫైనల్లో సాత్విక్‌–చిరాగ్‌ జోడికి ఓటమి ఎదురైంది. ఫైనల్ వరకూ అద్భుతంగా ఆడిన ఈ ద్వయం తుదిమెట్టుపై బోల్తా పడింది. ప్రపంచ రెండో సీడ్‌ సాత్విక్‌ సాయిరాజ్‌ – చిరాగ్‌ శెట్టి జోడి... 21-9, 18-21 17-21 తేడాతో చైనాకు చెందిన వరల్డ్‌ నెంబర్‌ వన్‌ జోడీ వాంగ్‌ – లియాంగ్‌ చేతిలో ఓటమి పాలయ్యారు. ఈ ఓటమితో భారత జోడి రన్నరప్‌తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. 58 నిమిషాల పాటు సాగిన పోరులో తొలి సెట్‌ గెలిచి మంచి ఊపు మీద కనిపించిన సాత్విక్‌–చిరాగ్‌ జోడి... తర్వాత రెండు సెట్లలో ఓడింది. ఫైనల్‌ దాకా అప్రతిహాత విజయాలతో వచ్చిన వరల్డ్‌ నెంబర్‌ 2 జోడీ.. తుది పోరులో మాత్రం తడబాటుకు గురైంది. తొలి సెట్‌లో ఈ ఇద్దరూ మ్యాచ్‌పై పూర్తి నియంత్రణ సాధించారు. భారత జోడీ ఫస్ట్‌ సెట్‌ గెలిచిన తర్వాత రెండో సెట్‌ నుంచి చైనా ద్వయం పుంజుకుంది. క్రమంగా మ్యాచ్‌పై పట్టుబిగించిన చైనా జోడీ.. చివరి వరకూ అదే కొనసాగించి విజేతగా నిలిచింది.


సెమీస్‌లో అద్భుత ఆటతీరు
పురుషుల డబుల్స్‌ సెమీస్‌లో రెండో సీడ్‌ సాత్విక్‌, చిరాగ్‌ జోడీ  21-18, 22-20 తేడాతో సౌత్‌ కొరియన్‌ జంట కంగ్‌ మిన్‌ హ్యూక్‌ – సీయో స్యూంగ్‌ జేలను ఓడించి ఫైనల్‌కు చేరింది. ఫైనల్‌ చేరడం ద్వారా మలేషియా ఓపెన్‌ డబుల్స్‌లో ఫైనల్స్‌ చేరిన తొలి భారత జోడీగా సాత్విక్‌, చిరాగ్‌ జోడీ రికార్డులకెక్కింది. 44 నిమిషాల పాటు హోరాహోరిగా సాగిన ఈ పోరులో సాత్విక్‌ జోడీ.. రెండు సెట్లలోనూ గెలిచి తుది పోరుకు అర్హత సాధించింది. గతేడాది ఇదే టోర్నీలో సెమీస్‌ వరకు చేరిన భారత జోడీ.. ఈ ఏడాది మాత్రం పట్టు విడవలేదు. రెండో సెట్‌లో ఒకదశలో 11-18తో ఓటమి ఖాయమనుకున్న స్థితిలో నిలిచిన భారత జోడీ.. అద్భుతంగా పుంజుకుని విజయం సాధించింది. 


చైనా మస్టర్స్‌లో ఓటమి
న భారత అగ్రశ్రేణి షట్లర్లు సాత్విక్‌ సాయిరాజ్‌- చిరాగ్‌ శెట్టి(Satwiksairaj Rankireddy-Chirag Shetty) జోడీకి షాక్‌ తగిలింది. చైనా మాస్టర్స్‌ సూపర్‌ 750 బ్యాడ్మింటన్‌ టోర్నీ పురుషుల డబుల్స్‌ తుదిపోరులో ఫేవరెట్లుగా బరిలోకి దిగిన ఈ జోడి పరాజయం పాలైంది. ఈ ఏడాది ఇప్పటివరకూ ఆడిన ఆడిన అయిదు ఫైనల్లోనూ వరుస విజయాలు సాధించిన సాత్విక్‌-చిరాగ్‌ శెట్టి జోడి తొలిసారి తుది మెట్టుపై బోల్తా పడింది. చివరివరకూ పోరాడినా... ప్రతీ పాయింట్‌ కోసం తీవ్రంగా శ్రమించినా ఈ స్టార్‌ జోడీకి ఓటమి తప్పలేదు. చైనా మాస్టర్స్‌ సూపర్‌ 750 బ్యాడ్మింటన్‌ టోర్నీ డబుల్స్‌ ఫైనల్లో టాప్‌ సీడ్‌ సాత్విక్‌- చిరాగ్‌ జంట 19-21, 21-18, 19-21 తేడాతో చైనాకు చెందిన రెండో సీడ్‌ లియాంగ్‌- వాంగ్‌ చేతిలో పోరాడి ఓడింది. గంటా 11 నిమిషాల పాటు సాగిన పోరులో భారత ద్వయం అనవసర తప్పిదాలతో పరాజయం పాలైంది.