మహేంద్ర సింగ్ ధోనీ దాఖలు చేసిన పరువునష్టం కేసు విచారణలో భాగంగా కీలక ఆదేశాలు జారీ చేసింది మద్రాస్ హైకోర్టు. ధోనీ విషయంలో ఐపీఎస్ అధికారి సంపత్ కుమార్ కోర్టు ధిక్కరణకు పాల్పడ్డారని నిర్ధరిస్తూ అతనికి 15 రోజులు జైలు శిక్షను విధించింది. సంపత్ కోర్టు ధిక్కరణకు పాల్పడ్డారని నిర్ధరిస్తూ జస్టిస్ ఎస్ఎస్ సుందర్, జస్టిస్ సుందర్ మోహన్‌తో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఈ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే.. ఈ శిక్షను న్యాయస్థానంలో సవాల్ చేసుకునేందుకు వీలుగా అమలును 30 రోజుల వరకు నిలుపుదల చేస్తూ ఆదేశాలు జారీ చేసింది మద్రాస్ హైకోర్టు.
అసలేం జరిగింది అంటే
2013లో ఐపీఎస్ అధికారి సంపత్ కుమార్ ఓ టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఐపీఎల్ ఫిక్సింగ్‌కు, క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోనీకి ముడిపెడుతూ క్రికెటర్ ధోనీపై అనుచిత వ్యాఖ్యలు చేశాడు. ఈ అంశంపై ధోనీ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఈ నేపథ్యంలో సంబంధిత టీవీ ఛానల్‌తో పాటు ఐపీఎస్ అధికారి సంపత్‌పై 2014లో పరువు నష్టం దావా వేశాడు. ఆ అధికారి తన ప్రతిష్ఠకు భంగం కలిగించేలా వ్యాఖ్యలు చేశారని, పరిహారంగా రూ.100 కోట్లు చెల్లించాలని డిమాండ్ చేశాడు. అంతే కాకుండా తన 17 ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలని కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. ధోనీ పిటిషన్‌పై మద్రాస్ హైకోర్టు స్పందించి అతడు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలని టీవీ యాజమాన్యానికి, ఐపీఎస్ అధికారి సంపత్‌కు నోటీసులు జారీ చేసింది. అయితే దీనిపై టీవీ ఛానల్ ఇచ్చిన వివరణను కోర్టు కొట్టివేసింది. ధోనీ లాంటి అంతర్జాతీయ క్రికెటర్‌పై వార్తలు ప్రచురించే ముందు జాగ్రత్తగా ఉండాలని ఈ సందర్భంగా కోర్టు సూచించింది. మరోవైపు ఐపీఎస్ అధికారి సంపత్ఇచ్చిన వివరణతో ధోనీ సంతృప్తి చెందలేదు. ఆయన ఇచ్చిన వివరణలో సుప్రీం కోర్టు, హైకోర్టుపై కూడా అనుచిత వ్యాఖ్యలు చేశారని, కోర్టు ధిక్కరణ కింద వెంటనే సంపత్‌పై చర్యలు తీసుకోవాలని మరోసారి మద్రాస్ హైకోర్టును ధోనీ కోరాడు. ఈ పిటిషన్‌ను విచారించిన హైకోర్టు ఐపీఎస్ అధికారి సంపత్‌కు 15 రోజుల జైలు శిక్ష విధించింది. ఈ శిక్షను పైకోర్టులో సవాల్చేసుకునేందుకు వీలుగా 30 రోజుల వరకు శిక్ష అమలును నిలుపుదల చేస్తూ అదేశాలు జారీ చేసింది.
భారత జట్టుకు అత్యధిక ఐసీసీ ట్రోఫీలు అందించిన కెప్టెన్‌గా గుర్తింపు పొందిన మహేంద్ర సింగ్ ధోనీకి బీసీసీఐ అరుదైన గౌరవం కల్పించింది. ధోనీ జెర్సీ నంబర్ 7 రిటైర్ అవుతున్నట్లు బీసీసీఐ ప్రకటించింది. అంటే ఇక మీదట భారత క్రికెటర్ ఎవరూ ఏడో నెంబర్ జెర్సీతో బరిలోకి దిగడం కుదరదు. సచిన్ టెండుల్కర్ తర్వాత ఈ గౌరవం ధోనీకి మాత్రమే దక్కింది. సచిన్ రిటైర్మెంట్ తరువాత జెర్సీ నంబర్ 10 రిటైర్ అవుతున్నట్లు గతంలోనే బీసీసీఐ ప్రకటించింది. ఇక ఇప్పుడు ‘జెర్సీ 7’కు ఈ గౌరవం దక్కింది. భారత క్రికెట్‌కు చేసిన సేవలకు గుర్తింపుగా ధోనీకి ఈ అరుదైన గౌరవం ఇచ్చింది. అంటే ఇక పై భారత జట్టులోకి వచ్చే కొత్త కుర్రాళ్లెవరూ నంబర్ 7, నంబర్ 10 జెర్సీలను ఎంపిక చేసుకోలేరు.