Indian Premier League 2023: రాజస్థాన్ రాయల్స్ (RR) యువ ఓపెనర్ బ్యాట్స్‌మెన్ యశస్వి జైస్వాల్ ఐపీఎల్ 16వ సీజన్‌లొ ఇప్పటివరకు చాలా రాణించాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH)తో జరిగిన మ్యాచ్‌లో యశస్వి తన ఐపీఎల్ కెరీర్‌లో 1000 పరుగులను కూడా పూర్తి చేసుకున్నాడు. ఈ మైలురాయిని అందుకున్న రెండో అతి పిన్న వయస్కుడైన భారత ఆటగాడిగా నిలిచాడు.
సన్ రైజర్స్ హైదరాబాద్ తో జరిగిన మ్యాచ్ లో మరోసారి యశస్వి జైస్వాల్ ఫామ్ కనిపించింది. జైస్వాల్ కూడా 18 బంతుల్లో 35 పరుగుల వేగవంతమైన ఇన్నింగ్స్ ఆడి ఐపీఎల్‌లో తన 1000 పరుగులు పూర్తి చేశాడు. యశస్వి జైస్వాల్ 21 సంవత్సరాల 130 రోజుల వయసులో ఐపీఎల్‌లో 1000 పరుగులు పూర్తి చేశాడు.
ఈ సందర్భంలో అతను ఇప్పుడు పృథ్వీ షాను దాటేసి ఈ జాబితాలో చేరిన రెండో అతి పిన్న వయస్కుడైన భారతీయ ఆటగాడిగా నిలిచాడు. ఈ జాబితాలో వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ రిషబ్ పంత్ పేరు మొదటి స్థానంలో ఉంది. పంత్ 20 సంవత్సరాల 218 రోజుల వయసులో ఐపీఎల్‌లో 1000 పరుగులు పూర్తి చేశాడు. ఈ మైలు రాయిని చేరుకోవడానికి పంత్‌కు 35 ఇన్నింగ్స్‌లు పట్టాయి
అత్యంత వేగంగా చేరిన ఆటగాళ్ల లిస్ట్‌లో కూడా...
ఐపీఎల్‌లో అత్యంత వేగంగా 1000 పరుగులు పూర్తి చేసిన భారత బ్యాట్స్‌మెన్‌గా యశస్వి జైస్వాల్ ఇన్నింగ్స్‌లో సంయుక్తంగా రెండో స్థానంలో నిలిచాడు. చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో భాగమైన మాజీ ఆటగాడు సురేశ్ రైనా కూడా ఐపీఎల్‌లో 34 ఇన్నింగ్స్‌ల్లో 1000 పరుగులు పూర్తి చేశాడు. ఈ విషయంలో సచిన్ టెండూల్కర్, రుతురాజ్ గైక్వాడ్‌లు సంయుక్తంగా మొదటి స్థానంలో ఉన్నారు. ఐపీఎల్‌లో ఇద్దరు ఆటగాళ్లు 31 ఇన్నింగ్స్‌ల్లోనే 1000 పరుగులు పూర్తి చేశారు.
ఈ ఐపీఎల్ సీజన్‌లో యశస్వి జైస్వాల్ బ్యాట్‌తో అద్భుతంగా రాణించాడు. ఈ సీజన్‌లో ఇప్పటివరకు 11 ఇన్నింగ్స్‌ల్లో 43.36 సగటుతో 477 పరుగులు చేశాడు. ప్రస్తుతం ఆరెంజ్ క్యాప్ రేసులో ఫాఫ్ డు ప్లెసిస్ తర్వాత యశస్వి జైస్వాల్ రెండో స్థానంలో ఉన్నాడు.
ముంబై - రాజస్తాన్ ల మధ్య జరిగిన వెయ్యో ఐపీఎల్ మ్యాచ్‌లో కూడాత జైస్వాల్ రెచ్చిపోయాడు. ముంబైతో పోరులో 32 బంతుల్లో అర్థ సెంచరీ పూర్తి చేసిన జైస్వాల్.. 53 బంతుల్లో సెంచరీ చేశాడు. ఈ క్రమంలో ప్రత్యేకమైన మ్యాచ్ లో శతకం సాధించి ప్రత్యేకమైన రికార్డు సొంతం చేసుకున్నాడు. తన కెరీర్‌లో జైస్వాల్‌కు ఇది మొదటి శతకం.
ముంబైపై సెంచరీ చేయడం ద్వారా జైస్వాల్.. ఈ ఘనత సాధించిన పిన్న వయస్కుల వారి జాబితాలో చేరాడు. ఐపీఎల్ లో అత్యంత పిన్న వయసులో సెంచరీ చేసిన ఆటగాళ్లలో మనీష్ పాండే (19 ఏండ్ల 253 రోజులు) ముందున్నాడు. పాండే.. 2009లో డెక్కన్ ఛార్జర్స్ పై సెంచరీ చేశాడు. ఆ తర్వాత రిషభ్ పంత్ (20 ఏండ్ల 218 రోజులు - 2018లో సన్ రైజర్స్ పై), దేవదత్ పడిక్కల్ (20 ఏండ్ల 289 రోజులు - 2021లో రాజస్తాన్ పై)లు జైస్వాల్ కంటే ముందున్నారు. జైస్వాల్ 21 ఏండ్ల 123 రోజుల వయసులో ముంబైపై సెంచరీ సాధించి సంజూ శాంసన్ (22 ఏండ్ల 151 రోజులు- రైజింగ్ పూణె జెయింట్స్-2017లో) రికార్డును అధిగమించాడు.