భారత్‌ వేదికగా జరిగిన వన్డే ప్రపంచకప్‌లో నాకౌట్‌ చేరిన జట్లలోని ఆటగాళ్లపై ఐపీఎల్‌ వేలంలో కనక వర్షం కురిసింది. అందరూ అంచనా వేసినట్లే ఆస్ట్రేలియా క్రికెటర్లకు భారీ ధర పలికింది. న్యూజిలాండ్‌ ఆటగాళ్లకు కూడా భారీ ధర పలికింది. భారత్‌ను ఫైనల్లో ఓడించి ఆరోసారి ప్రపంచకప్‌ను గెలిచిన ఆటగాళ్లకు కనివినీ ఎరుగని ధర పలికింది. కంగారులు ప్రపంచకప్‌ గెలవడంలో కీలకపాత్ర పోషించిన మిచెల్‌ స్టార్క్‌... ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ మినీ వేలంలో రికార్డు సృష్టించాడు. ఐపీఎల్‌ చరిత్రలోనే అత్యధిక ధరను సొంతం చేసుకున్న ఆటగాడిగా నిలిచాడు. స్టార్క్‌ను కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ రూ. 24.75 కోట్లకు దక్కించుకుంది. గుజరాత్‌ టైటాన్స్‌, కోల్‌కతా చివరి వరకు తీవ్రంగా పోటీ పడ్డాయి. ఆ తర్వాత ఆసీస్‌ కెప్టెన్‌ కమిన్స్‌ రూ. 20.5 కోట్లు దక్కించుకుని రెండో స్థానంలో నిలిచాడు. అతడిని సన్‌రైజర్స్‌ హైదరాబాద్ సొంతం చేసుకుంది. 

 

వన్డే ప్రపంచకప్‌లో న్యూజిలాండ్‌ను సెమీస్‌కు చేర్చిన ఆల్‌రౌండర్‌ డారిల్‌ మిచెల్‌ను రూ. 14 కోట్లు పెట్టి చెన్నై సూపర్ కింగ్స్‌ సొంతం చేసుకుంది. అంచనాలకు తగ్గట్టుగానే నేటి ఐపీఎల్ వేలంలో డారిల్ మిచెల్ కు భారీ ధర పలికింది. చెన్నై సూపర్ కింగ్స్ రూ.14 కోట్లకు కొనుగోలు చేసింది. ఎందుకంటే డారిల్ మిచెల్ కనీస ధర రూ.1 కోటి మాత్రమే అయితే పలు ఫ్రాంచైజీలు వేలం పాటను అమాంతం పెంచేశాయి. అయితే తొలి దశలో వ్యూహాత్మకంగా మౌనంగా ఉండిపోయిన చెన్నై రూ.11 కోట్ల పాట వద్ద ఎంటరైన చెన్నై రూ.14 కోట్లతో అతడిని సొంతం చేసుకుంది. ప్రపంచకప్‌లో అద్భుతంగా రాణించిన కుర్ర హీరో రచిన్‌ రవీంద్రను కూడా 1.8 కోట్లకు చెన్నై సూపర్‌ కింగ్స్‌ దక్కించుకుంది. 

 

భారత పేసర్‌ హర్షల్‌ పటేల్‌ను రూ. 11.75 కోట్లకు పంజాబ్‌ కింగ్స్‌ సొంతం చేసుకుంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ వేలం ఉత్సాహంగా జరుగుతోంది. ఈ వేలంలో న్యూజిలాండ్ ఆల్ రౌండర్ డారిల్ మిచెల్ ను చెన్నై సూపర్ కింగ్స్14 కోట్లకు కొనుగోలు చేసింది. ఈసారి ఐపీఎల్ వేలంలో భారీ ధర పలుకుతుందని అంచనా వేసిన ఆటగాళ్లలో న్యూజిలాండ్ హిట్టర్ డారిల్ మిచెల్ కూడా ఒకడు. నిలకడగా ఆడుతూ మంచి స్కోర్లు నమోదు చేస్తుండే మిచెల్ కోసం ఫ్రాంచైజీలు పోటీపడ్డాయి. నిజానికి రచిన్ రవీంద్ర ఐపీఎల్ వేలంలో రికార్డులు బద్దలు కొట్టడం ఖాయం అని అందరూ భావించారు. ఐపీఎల్ మినీ వేలంలో రచిన్ రవీంద్ర కనీస ధర రూ.50 లక్షలు కాగా... అతడి కోసం చెన్నై సూపర్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మాత్రమే ఆసక్తి చూపించాయి. చివరికి చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీ బాగా చవకగా రూ.1.80 కోట్లకు కొనుగోలు చేసింది.

ఐపీఎల్‌ వేలంలో మొత్తం 1166 మంది ఆటగాళ్లు పేర్లు నమోదు చేసుకోగా..ఐపీఎల్‌ పాలకవర్గం మొత్తం ఈ జాబితాను పది ఐపీఎల్‌ ఫ్రాంఛైజీలకు అందించింది. ఆటగాళ్లపై ఫ్రాంఛైజీల ఆసక్తి ఆధారంగా జాబితాను 333కు కుదించింది. ఇందులో 214 మంది భారతీయులు, 119 మంది విదేశీయులు, అసోసియేట్‌ దేశాల నుంచి ఇద్దరు ఉన్నారు.

ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఎందరో యువకుల ప్రతిభను ప్రపంచానికి పరిచయం చేసింది. 2008లో ప్రారంభమైన ఈ లీగ్ విజయవంతంగా.. 16 సీజన్‌లు పూర్తి చేసుకుంది. అనతి కాలంలోనే రిచ్చెస్ట్ క్రికెట్‌ లీగ్‌గా నిలిచింది. ఈ లీగ్‌లో ఒక్కసారైనా ఆడితే చాలు అని అనుకునే ఆటగాళ్లు ఎంతో మంది ఉన్నారు.