IPL 2025 SRH VS PBKS Result Update: సన్ రైజర్స్ హైదరాబాద్ సొంతగడ్డపై గర్జించింది. వరుసగా నాలుగు మ్యాచ్ ల తర్వాత తమ బ్యాటింగ్ పవర్ ఏంటో చూపించింది. ఐపీఎల్ చరిత్రలోనే రెండో అత్యధిక ఛేజింగ్ ను నమోదు చేసింది. ఇంతకుముందు 215 పరుగుల ఛేదనే హయ్యేస్ట్ కావడం విశేషం. టాస్ నెగ్గి ఫ‌స్ట్ బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో ఆరు వికెట్ల‌కు 245 ప‌రుగులు చేసింది. శ్రేయ‌స్ అయ్య‌ర్ కెప్టెన్ ఇన్నింగ్స్ (36 బంతుల్లో 82, 6 ఫోర్లు, 6 సిక్స‌ర్లు) తో ఆకట్టుకున్నాడు. హ‌ర్ష‌ల్ ప‌టేల్ (4/42) తో స‌త్తా చాటాడు. అనంత‌రం ఛేజింగ్ ను సునామీ రేంజ్ లో సన్ రైజ‌ర్స్ స్టార్ట్ చేసింది. ఓవ‌రాల్ గా 18.3 ఓవర్ల‌లో 2 వికెట్ల‌కు 247 ప‌రుగులు చేసి, 8 వికెట్లతో గెలుపొందింది . ఓపెన‌ర్ అభిషేక్ శ‌ర్మ సూప‌ర్ సెంచ‌రీ (55 బంతుల్లో 141, 14 ఫోర్లు, 10 సిక్సర్లు) తో రెచ్చిపోయాడు. 

 

బ్యాట‌ర్ల విధ్వంసం..బ్యాటింగ్ కు స్వ‌ర్గ‌ధామం లాంటి ఈ వికెట్ పై పంజాబ్ కింగ్స్ బ్యాటర్లు ఈ వికెట్ పై రెచ్చిపోయారు. ఓపెన‌ర్లు ప్రియాంశ్ ఆర్య (36), ప్ర‌భుసిమ్రాన్ సింగ్ (42) దూకుడుగా ఆడ‌టంతో 4 ఓవ‌ర్ల‌లోనే 66 ప‌రుగులు వ‌చ్చాయి. ఈ ద‌శ‌లో ప్రియాంశ్ వికెట్ తీసి హ‌ర్ష‌ల్ బ్రేక్ ఇచ్చాడు. ఈ ద‌శ‌లో బ్యాటింగ్ కు వచ్చిన శ్రేయ‌స్ రెచ్చిపోయాడు. ప్రత్య‌ర్థి బౌల‌ర్ల‌ను చిత‌క‌బాది 22 బంతుల్లోనే ఫిఫ్టీ చేశాడు. ఆ త‌ర్వాత కూడా వ‌డివ‌డిగా బ్యాటింగ్ చేసి, సెంచ‌రీ దిశ‌గా సాగాడు. అయితే స్కోరు వేగాన్ని పెంచే క్ర‌మంలో ఔట‌య్యాడు. చివ‌ర్లో మార్క‌స్ స్టొయినిస్ (34 నాటౌట్) నాలుగు భారీ సిక్స‌ర్లు బాద‌డంతో పంజాబ్ 246 ప‌రుగులకు చేరుకుంది. ఇషాన్ మ‌లింగా రెండు వికెట్లు తీశాడు. ఇక వెట‌ర‌న్ పేస‌ర్ మ‌హ్మ‌ద్ ష‌మీ 75 ప‌రుగులు స‌మ‌ర్పించుకుని చెత్త ప్ర‌ద‌ర్శ‌న చేశాడు. 

ఆరెంజ్ అలెర్ట్..గ‌త కొంత‌కాలం మిస్స‌యిన ఆరెంజ్ సునామీ ఈ మ్యాచ్ ను ముంచెత్తింది. ఈ మ్యాచ్ ద్వారా ప్రత్యర్థి బౌలర్లకు ప్రమాద హెచ్చరికలు పంపింది. భారీ ఓపెనింగ్ టార్గెట్ తో బ‌రిలోకి దిగిన స‌న్ కు ఓపెన‌ర్లు ట్రావిస్ హెడ్ (37 బంతుల్లో 66, 9 ఫోర్లు, 3 సిక్సర్లు), అభిషేక్ కావాల్సిన విధంగా బ్యాటింగ్ చేశారు. ప్ర‌తి ఒక్క బౌల‌ర్ ను చిత‌క‌బాద‌డంతో ప‌వ‌ర్ ప్లేలోనే 83 ప‌రుగులు వ‌చ్చాయి. ముఖ్యంగా అభిషేక్ ఓ రెంజ్ లో బ్యాటింగ్ చేశాడు. ముఖ్యంగా మధ్యలో రెండు లైఫ్ లు కూడా అభిషేక్ కు దొరకడం కలిసొచ్చింది. విధ్వంసమే ల‌క్ష్యంగా బ్యాటింగ్ చేసిన అభిషేక్ కేవ‌లం 19 బంతుల్లోనే ఫిఫ్టీ బాదాడు. ఆ త‌ర్వాత కూడా ఫోర్లు, సిక్స‌ర్లు బాదారు. ఈ క్ర‌మంలో 31 బంతుల్లో ఫిఫ్టీని హెడ్ పూర్తి చేసుకుని ఔట‌య్యాడు. తొలి వికెట్ కు 171 ప‌రుగుల భారీ భాగ‌స్వామ్యం న‌మోద‌య్యాక హెడ్ ఔట‌య్యాడు. ఆ త‌ర్వాత వ‌న్ డౌన్ లో క్లాసెన్ (21 నాటౌట్) వ‌చ్చాడు. ఇక రెప్ప‌పాటులో సెంచ‌రీకి చేరువైన అభిషేక్ 40 బంతుల్లోనే ఐపీఎల్లో తొలి సెంచ‌రీ పూర్తి చేసుకున్నాడు. శతకం బాదిన తర్వాత జేబులో నుంచి ఒక కాగితాన్ని తీసి, అందులో సన్ రైజర్స్ అభిమానులకు ఈ సెంచరీ అంకితం అని అభిషేక్ ప్రదర్శించాడు. ఆ త‌ర్వాత కూడా త‌న జోరును కొన‌సాగించి, టార్గెట్ ను త‌న హిట్టింగ్ తో క‌రిగించాడు. చివ‌రికి స్కోరు వేగాన్ని పెంచే క్రమంలో ఔట‌య్యాడు. ఆ త‌ర్వాత ఇషాన్ కిషాన్ (9 నాటౌట్)తో కలిసి క్లాసెన్ జట్టును విజయతీరాలకు చేర్చాడు. దీంతో నాలుగు పరాజయాల తర్వాత సన్ ఒక విజయాన్ని నమోదు చేసి, పాయింట్ల పట్టికలో 8వ స్థానానికి చేరింది.