Stamped at RCB Celebrations in Bengaluru: 18 ఏళ్ల తర్వాత ఐపీఎల్ ట్రోఫీ గెలుచుకున్న ఆర్సీబీ సంబరాలు చేసుకుంటోంది. ట్రోఫీతో అహ్మదాబాద్ నుంచి వచ్చిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీంకు గ్రాండ్ వెల్కమ్ లభించింది. అయితే ఈ సెలబ్రేషన్స్‌లో అపశ్రృతి చోటు చేసుకుంది. సంబరాలు జరుగుతున్న చిన్నస్వామి స్టేడియంలో తొక్కిసలాట జరిగింది. ఈ దుర్ఘటనలో 10మంది మృతి చెందారు. మరికొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) ఐపీఎల్ కొత్త ఛాంపియన్. మంగళవారం పంజాబ్ కింగ్స్‌ను ఓడించి RCB తన తొలి ఐపీఎల్ టైటిల్‌ను గెలుచుకుంది. RCB ఛాంపియన్‌గా నిలిచిన వెంటనే, ఆ జట్టుతో సహా ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులందరూ సంబరాలు చేసుకున్నారు. బుధవారం మధ్యాహ్నం RCB జట్టు బెంగళూరు చేరుకున్నప్పుడు, విమానాశ్రయం వెలుపల నిలబడి ఉన్న పెద్ద సంఖ్యలో అభిమానులు వారికి స్వాగతం పలికారు. ముఖ్యమంత్రి కార్యాలయానికి వెళ్లే మార్గంలో రోడ్డుకు ఇరువైపులా అభిమానులు గుమిగూడారు.
ముఖ్యమంత్రిని కలిసిన తర్వాత, RCB ఆటగాళ్లు ఎం చిన్నస్వామి స్టేడియంలో అభిమానులను ఉద్దేశించి ప్రసంగించాల్సి ఉంది. ముందు అనుకున్న షెడ్యూల్ ప్రకారం చిన్న స్వామి స్డేడియం వరకు ఓపెన్ టాప్ బస్‌లో ప్రజలకు అభివాదం చేస్తూ రోడ్‌షో ఉండాల్సింది. అయితే జనాలను కంట్రోల్ చేయడంలో ఇబ్బందులు తలెత్తుతాయని ఆ కార్యక్రమాన్ని రద్దు చేశారు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా సరే తొక్కిసలాట జరిగింది. క్రికెటర్లు రావడంతో స్టేడియం వద్ద ఒక్కసారిగా జనం దూసుకెళ్లారు. ఈ క్రమంలో కొందరు కిందపడిపోయారు.
ఎం. చిన్నస్వామి స్టేడియం గోడలు ఎక్కిన అభిమానులు
తమ ఛాంపియన్ జట్టును చూసేందుకు ఆర్‌సిబి అభిమానులు చిన్నస్వామి స్టేడియం వెలుపల పెద్ద సంఖ్యలో గుమిగూడారు. అభిమానులు ఎం. చిన్నస్వామి స్టేడియం గోడలు,, కంచెలు ఎక్కారు. ఇదే ప్రమాదానికి కారణమైంది.