Delhi Capitals vs Sunrisers Hyderabad: ఐపీఎల్‌ 2023 సీజన్ 34వ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. దీంతో మొదట సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలింగ్ చేయనుంది.


ఢిల్లీ క్యాపిటల్స్ తుది జట్టు
డేవిడ్ వార్నర్ (కెప్టెన్), ఫిలిప్ సాల్ట్ (వికెట్ కీపర్), మిచెల్ మార్ష్, మనీష్ పాండే, సర్ఫరాజ్ ఖాన్, అక్షర్ పటేల్, అమన్ హకీమ్ ఖాన్, రిపాల్ పటేల్, అన్రిచ్ నోర్ట్జే, కుల్దీప్ యాదవ్, ఇషాంత్ శర్మ


ఢిల్లీ క్యాపిటల్స్ ఇంపాక్ట్ ప్లేయర్ సబ్స్
ముఖేష్ కుమార్, లలిత్ యాదవ్, ప్రవీణ్ దూబే, చేతన్ సకారియా, యష్ ధుల్


సన్‌రైజర్స్ హైదరాబాద్ తుది జట్టు
అభిషేక్ శర్మ, హ్యారీ బ్రూక్, ఎయిడెన్ మార్క్రమ్ (కెప్టెన్), మయాంక్ అగర్వాల్, హెన్రిచ్ క్లాసెన్ (వికెట్ కీపర్), మార్కో జాన్సెన్, వాషింగ్టన్ సుందర్, మయాంక్ మార్కండే, భువనేశ్వర్ కుమార్, టి నటరాజన్, ఉమ్రాన్ మాలిక్


సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇంపాక్ట్ ప్లేయర్ సబ్స్
నితీష్ రెడ్డి, వివ్రాంత్ శర్మ, గ్లెన్ ఫిలిప్స్, మయాంక్ డాగర్, రాహుల్ త్రిపాఠి


ఇండియన్‌ ప్రీమియర్‌ లీగులో సన్‌రైజర్స్ హైదరాబాద్‌, దిల్లీ క్యాపిటల్స్‌ మధ్య పోరు ఎప్పుడూ ఆసక్తికరంగానే ఉంటుంది! అయితే డీసీపై ఆరెంజ్‌ ఆర్మీదే కాస్త అప్పర్‌ హ్యాండ్‌! లీగ్‌ చరిత్రలో ఈ రెండు జట్లు ఇప్పటి వరకు 21 సార్లు తలపడ్డాయి. సన్‌రైజర్స్‌ 11 సార్లు గెలవగా దిల్లీ 9 విజయాలు సాధించింది. ఒక మ్యాచ్‌ ఫలితం తేలలేదు. రీసెంట్‌ ఫామ్‌ చూసుకుంటే దిల్లీ క్యాపిటల్స్‌ జోష్‌లో ఉంది. చివరి ఐదు మ్యాచుల్లో నాలుగు గెలిచింది. 2020లో హైదరాబాద్‌ 88 రన్స్‌ తేడాతో దుమ్మురేపింది. ఆ తర్వాత నాలుగింట్లోనూ డీసీ అదరగొట్టింది. ఒక మ్యాచులో సూపర్‌ ఓవర్లో గెలిచింది.


ఉప్పల్‌ పిచ్‌ చివరి మూడు మ్యాచుల్లో తొలుత బ్యాటింగ్‌ చేసిన జట్లకే అనుకూలించింది. రెండు విజయాలు అందించింది. సూర్యాస్తమయం కావడంతో పిచ్‌పై నెర్రలు పెద్దవయ్యే అవకాశం ఉంటుంది. అలాంటప్పుడు స్పిన్నర్లు ఎఫెక్టివ్‌గా ఉంటారు. సెకండ్‌ బ్యాటింగ్‌ చేసేటప్పుడు కొంత డ్యూ ఫ్యాక్టర్‌ ఉంటుంది. ఇక ఉప్పల్‌లో ఇప్పటి వరకు 67 టీ20లు జరగ్గా ఛేదన జట్లే 38 గెలిచాయి. తొలుత బ్యాటింగ్‌ చేసిన టీమ్స్‌ 29 విజయాలు అందుకున్నాయి. టాస్‌ గెలిచిన వాళ్లతో పోలిస్తే ఓడిన వాళ్లకే విజయాల శాతం ఎక్కువ. 67.16 శాతం మ్యాచులు గెలిచారు.


హైదరాబాద్‌కు డేవిడ్‌ భాయ్‌ అంటే.. డేవిడ్‌ భాయ్‌కు హైదరాబాద్‌ అంటే ప్రాణం! ఒక రకంగా అతనంటే తెలుగువాళ్లకు విపరీతమైన అభిమానం! ఐపీఎల్‌ వచ్చిందంటే అతడు మన ఇంటి నుంచి వెళ్లిన క్రికెటర్‌గా భావిస్తుంటాం. తెలుగువాళ్లే ఉండని జట్టులో తెలుగువాడిగా అనుకుంటాం.  అందుకు తగ్గట్టే అతడు పొట్టి క్రికెట్లో మెరుపులు మెరిపించాడు. ఉప్పల్‌ మైదానాన్ని దుర్బేధ్యమైన కోటగా మార్చుకున్నాడు. దానికి తిరుగులేని రారాజుగా అవతరించాడు. అతడి రికార్డులు ఇదే మాట చెబుతున్నాయి.


ఉప్పల్‌ మైదానంలో డేవిడ్‌ వార్నర్‌కు తిరుగులేదు. ఐపీఎల్‌ కెరీర్లో అత్యంత ఎక్కువ పరుగులు సాధించింది ఇక్కడే. సెంచరీలు, హాఫ్‌ సెంచరీలూ, బౌండరీలు, సిక్సర్లు బాదేసింది ఇక్కడే! అందుకే ఉప్పల్‌ అంటే అతడికో ప్రత్యేకమైన అభిమానం. ఆస్ట్రేలియా తర్వాత తన రెండో ఇంటిగా భావిస్తుంటాడు. రాజీవ్‌ గాంధీ ఇంటర్నేషనల్‌ క్రికెట్లో 31 మ్యాచులు ఆడిన బాహుబలి అలియాస్‌ మన డేవిడ్‌ భాయ్‌.. 66.75 సగటు, 161.65 స్ట్రైక్‌రేట్‌తో ఏకంగా 1602 పరుగులు చేశాడు. 3 సెంచరీలు, 15 హాఫ్‌ సెంచరీలు కొట్టేశాడు. ఇక్కడ తన జట్టు చేసిన మొత్తం పరుగుల్లో అతడి వాటా 32.57 శాతమంటే నమ్మశక్యం కాదు. ఇదే మైదానంలో 11 క్యాచులూ  అందుకున్నాడు.