ఫైనల్ కు ముందు ఆడే అతి పెద్ద సమరం ఎలిమినేటర్. ఇందులో ఓడితే  ‘ఈ సలా కప్ నమ్మదే’ అనే కల మరచి పోవాల్సిందే.  ప్రత్యర్థి సాదా సీదా జట్టు కాదు. అయినా ఆర్ సీ బీ ఈ ఎలిమినేటర్ కు ముందు ఉన్న ఎకైక ప్రాక్టీస్ సెషన్ కు ఎగ్గొట్టేసింది. ఎందుకో తెలుసా..? 


బుధవారం రాజస్థాన్ రాయల్స్ తో ఎలిమినేటర్ లో తలపడనున్న ఆర్ సీ బీ మంగళవారం తమకున్న ఏకైక ప్రాక్టీస్ సెషన్ ను వదులుకుంది.  ఆర్ సీ బీ ఆటగాడు విరాట్ కోహ్లీ ప్రాణానికి ముప్పుండటమే ఇందుకు కారణంగా తెలుస్తోంది.. అసలేమైందంటే..


మంగళవారం గుజరాత్ కాలేజ్ గ్రౌండ్స్‌లో ప్రాక్టీస్ చేయాల్సిన ఆర్ సీ బీ జట్టు హోటల్ రూములకే పరిమితమైంది. కనీసం జట్టు ఆటగాళ్లు ప్రెస్ మీట్ ‌కి సైతం హాజరు కాలేదు. దీనికి కారణం తీవ్రమైన సెక్యూరిటీ థ్రెట్ గా చెబుతున్నారు. అది కూడా విరాట్ కోహ్లీ ప్రాణానికి ముప్పుండటమే అసలు కారణంగా పోలీసులు పేర్కొంటున్నారు. ఈ విషయమై టెర్రరిస్టులుగా అనుమానిస్తున్న నలుగుర్ని పోలీసులు అరెస్టు చేసినట్లు  కూడా వార్తలొస్తున్నాయి. 


అయితే ఈ సెక్యూరిటీ థ్రెట్ గురించి ఆర్ సీ బీ, ఆర్ ఆర్ రెండు టీములకూ పోలీసులు  సమాచారం ఇచ్చారు. ఆర్ సీ బీ ప్రాక్టీస్ సెషన్‌తో పాటు తమకున్న అన్ని కమిట్ మెంట్లను క్యాన్సిల్ చేసుకోగా..  రాజస్థాన్ రాయల్స్ మాత్రం తమ షెడ్యూలును యధావిధిగా కొనసాగించినట్లు చెబుతున్నారు. 


దీనిపై పోలీస్ ఉన్నతాధికారి విజయ్ సింఘా జ్వాలా బుధవారం మాట్లాడారు.  ‘‘ విరాట్ కోహ్లీ దేశానికే విలువైన నిధి లాంటి వాడు. అతను అహ్మదాబాద్ ‌కి రాగానే  తన ప్రాణానికి ముప్పుందనే విషయం అతనికి చెప్పాం. అతని సెక్యూరిటీ మాత్రమే మాకు ప్రస్తుతం చాలా ముఖ్యం. ఆర్ సీ బీ కూడా రిస్క్ తీసుకోవడానికి సిద్ధంగా లేదు. ప్రాక్టీస్ సెషన్ ఉండదని టీమ్ యాజమాన్యం చెప్పేసింది. విషయం ఆర్ ఆర్ టీముకు కూడా చెప్పాము.  వాళ్లు మాత్రం యధా విధిగా తమ షెడ్యూల్ కొనసాగించారు’’ అని జ్వాలా చెప్పారు. 


ఈ నేపథ్యంలో ఆర్ సీ బీ ఆటగాళ్లు ఉన్న హోటల్ రూమ్ బయట పోలీసులు నిఘా పెంచారు. ఐపీఎల్ కి సంబంధించిన వ్యక్తులను కూడా హోటల్ రూముల్లోకి అనుమతించట్లేదు. ఆర్ ఆర్ ఆటగాళ్లకు కూడా ప్రాక్టీస్ కి వెళ్లేందుకు గ్రీన్ కారిడార్ పేరిట ప్రత్యేక భద్రతా వలయం ఏర్పాటు చేశారు. అయితే యజ్వేంద్ర చహాల్, అశ్విన్,రియాన్ పరాగ్ వంటి ఆటాళ్లు ప్రాక్టీస్ కి రాకుండా హోటల్ లోనే ఉన్నట్లు తెలుస్తోెంది. ఆర్ ఆర్ కెప్టన్ సంజూ శాంసన్ కూడా ప్రాక్టీస్ కు లేట్ గా వచ్చినట్లు చెబుతున్నారు. బుధవారం కూడా ఆర్ సీబీ  ఆర్ ఆర్ మ్యాచ్ కు సెక్యూరిటీ గణనీయంగా పెంచనున్నట్లు సమాచారం.