Stamped at RCB Celebrations in Bengaluru: రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తొలిసారి ఐపీఎల్ కప్ గెలిచిన సందర్బంగా నిర్వహించిన సంబరాలలో మరణించినవారి సంఖ్య 11కి చేరింది. అలాగే 30 మందికి పైగా గాయపడ్డారని అధికార వర్గాలు తెలిపాయి. మంగళవారం రాత్రి ముగిసిన ఫైనల్లో మాజీ రన్నరప్ పంజాబ్ కింగ్స్ పై 6 పరుగుల తేడాతో ఆర్సీబీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఈ మధ్యాహ్నం.. బెంగళూరుకు సిటీకి చేరుకున్న క్రికెటర్లకు అభిమానులు పెద్దయెత్తున స్వాగతం పలికారు. క్రికెటర్లు చిన్నస్వామి స్టేడియానికి చేరుకున్న క్రమంలో అభిమానులు భారీగా తరలిరావడంతో తొక్కిసలాట చోటు చేసుకుంది. ఇందులో ప్రాణనష్టం సంభవించిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపిన ఆర్సీబీ ఫ్రాంచైజీ, కర్ణాటక క్రికెట్ సంఘం (కేఎస్సీఏ) నష్ట పరిహారాన్ని ప్రకటించింది.
రూ.5 లక్షల పరిహారం.. సంబరాల సందర్భంగా తొక్కిసలాట జరిగి అభిమానులు మరణించడంపై ఫ్రాంచైజీ, కేసీఏ విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల నష్ట పరిహారాన్ని ప్రకటించాయి. ఈ సాయం పోయిన ప్రాణాలకు రీప్లేస్ లాంటిది కాదని, దుఖ సమయంలో మరణించిన కుటుంబాలను ఆదుకునేందుకు తమ వంతు ప్రయత్నమిదని సంయుక్తంగా విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నాయి. ఇక తొక్కిసలాట జరగడంతో చిన్నస్వామి క్రికెట్ స్టేడియంలో జరగాల్సిన అభినందన సభ, క్రికెటర్ల వ్యాఖ్యానం కూడా రద్దు చేశారు. తాజా తొక్కిసలాట ఘటనపై ఆర్సీబీ అభిమానులతోపాటు క్రికెట్ ప్రేమికులు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. 18 ఏళ్ల తర్వాత కప్ గెలిచిన ఆనందం కంటే తోటి అభిమనులు చనిపోవడం కలిచి వేస్తుందని పేర్కొన్నారు.
జాగ్రత్తలు తీసుకున్నా..ఇక పెద్ద సంఖ్యలో అభిమానులు వస్తారన్న అంచనాతో పోలీసులు జాగ్రత్తలు తీసుకున్నా ఈ ప్రమాదం జరిగింది. ఆటగాళ్లు నగరంలోకి ఎంటరైనప్పటి నుంచి అభిమానులు వారితోపాటే గుంపులు గుంపులుగా స్వాగతం చెప్పారు. అలాగే సీఎంతో సమావేశం అనంతరం ఓపెన్ టాప్ లో పర్యటన చేయాల్సి ఉండగా, రద్దీ కారణంగా దీన్ని కూడా రద్దు చేశారు. అయితే క్రికెటర్లను చూడాలనే స్టేడియానికి పెద్దయెత్తున అభిమానులు చేరుకోవడం, ఈ క్రమంలో ఎత్తైన గోడలు, చెట్లు, ముళ్లె కంచెలు ఎక్కడంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.