RR Consecutive 2nd Victory: అన్ని రంగాల్లో సత్తా చాటిన మాజీ చాంపియన్స్ రాజస్థాన్ రాయల్స్ ఈ సీజన్ లో వరుసగా రెండో విజయాన్ని సాధించింది. శనివారం చంఢీగడ్ లోని ముల్లన్ పూర్ లో జరిగిన మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ పై 50 పరుగులతో విజయం సాధించింది. దీంతో పాయింట్ల పట్టికలో 7వ ప్లేస్ కు ఎగబాకింది. అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన రాయల్స్.. నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్లకు 205 పరుగుల భారీ స్కోరు సాధించింది. విధ్వంసక ఓపెనర్ యశస్వి జైస్వాల్ (45 బంతుల్లో 67, 3 ఫోర్లు, 5 సిక్సర్లు)తో టాప్ స్కోరర్ గా నిలిచాడు. బౌలర్లలో లోకీ ఫెర్గూసన్ రెండు వికెట్లతో ఆకట్టుకున్నాడు. అనంత‌రం ఛేజింగ్ లో పంజాబ్ త‌డ‌బ‌డి, సీజ‌న్ లో తొలి ప‌రాజయాన్ని మూట‌గ‌ట్టుకుంది.  ఓవ‌ర్ల‌న్నీ ఆడి  9 వికెట్లకు 155 ప‌రుగుల‌కు ఆలౌటైంది. మిడిలార్డ‌ర్ బ్యాట‌ర్ నేహాల్ వ‌ధేరా (41 బంతుల్లో 62, 4 ఫోర్లు, 3 సిక్స‌ర్లు)తో ఆకట్టుకున్నాడు. బౌల‌ర్లలో ఆర్చర్ కు 3 వికెట్లు ద‌క్కాయి. 

య‌శ‌స్వి, సంజూ భారీ భాగ‌స్వామ్యం.. ఫ‌స్ట్ బ్యాటింగ్ చేసిన రాయ‌ల్స్ కు ఓపెన‌ర్లు జైస్వాల్, సంజూ శాంస‌న్ (38) అద్భుత ఆరంభాన్నిచ్చారు. వీరిద్దరూ పంజాబ్ బౌల‌ర్ల‌ను స‌మ‌ర్థంగా ఎదుర్కొన్నారు. ముఖ్యంగా జైస్వాల్ క‌ళ్లు చెదిరే సిక్స‌ర్ల‌తో ఆక‌ట్టుకున్నాడు. వీరిద్ద‌రూ ఫ‌స్ట్ వికెట్ కు ఏకంగా 89 ప‌రుగులు సాధించారు. ఆ త‌ర్వాత  సంజూ ఔటైనా, జైస్వాల్ త‌న దూకుడుని త‌గ్గించ‌లేదు. ధాటిగా ఆడుతూ 40 బంతుల్లో ఫిఫ్టీ పూర్తి చేశాడు. ఆ త‌ర్వాత వేగంగా ఆడుతూ, వికెట్ కోల్పోయాడు. ఆ త‌ర్వాత రియాన్ ప‌రాగ్ (43 నాటౌట్), షిమ్రాన్ హిట్ మెయ‌ర్ (20) వేగంగా ఆడ‌టంతో 200 ప‌రుగుల మార్కును దాటింది. 

ఛేజింగ్ లో షాక్.. ఛేజింగ్ లో ఫ‌స్ట్ ఓవ‌ర్లోనే పంజాబ్ కు ఎదురుదెబ్బ తాకింది. ఇన్నింగ్స్ ఫ‌స్ట్ బంతికే ప్రియాంశ్ ఆర్య డ‌కౌట‌య్యాడు. ఇక సూప‌ర్ ఫామ్ లో ఉన్న కెప్టెన్ శ్రేయ‌స్ అయ్య‌ర్ (10) ను కూడా ఔట‌వ‌డంతో ఆతిథ్య జ‌ట్టుకు షాక్ త‌గిలింది. ఈ రెండు వికెట్ల‌ను ఆర్చ‌ర్ తీశాడు. మార్క‌స్ స్టొయినిస్ (1) కూడా విఫలం కావ‌డంతో పంజాబ్ పీక‌ల్లోతు క‌ష్టాల్లో నిలిచింది. ఈ ద‌శ‌లో నేహాల్, గ్లెన్ మ్యాక్స్ వెల్ (30) భారీ భాగ‌స్వామ్యంతో ఆదుకున్నారు. వీరిద్ద‌రూ వేగంగా ఆడుతూ ఐదో వికెట్ కు 88 ప‌రుగులు జోడించారు. అయితే రెండు బంతులు తేడాతో వీరిద్ద‌రూ ఔట‌వ‌డంతో పంజాబ్ కు ఓట‌మి ఖాయ‌మైంది. చివ‌ర్లో శ‌శాంక్ సింగ్ (10 నాటౌట్) ఉన్న‌ప్ప‌టికీ, టార్గెట్ భారీగా పెర‌గ‌డంతో తానేమీ చేయ‌లేక పోయాడు. బౌల‌ర్ల‌లో సందీప్ శ‌ర్మ పొదుపుగా బౌలింగ్ చేసి రెండు వికెట్లు తీసుకున్నాడు.