PBKS Vs KKR: కోల్‌కతాతో జరుగుతున్న మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ భారీ స్కోరు సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 191 పరుగులు సాధించింది. పంజాబ్ బ్యాటర్లలో భానుక రాజపక్స (50: 32 బంతుల్లో, ఐదు ఫోర్లు, రెండు సిక్సర్లు) అర్థ సెంచరీ సాధించాడు. మిగిలిన బ్యాటర్లు కూడా రాణించారు. కోల్‌కతా విజయానికి 120 బంతుల్లో 192 పరుగులు కావాలి.
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన కోల్‌కతా నైట్‌రైడర్స్ కెప్టెన్ నితీష్ రాణా బౌలింగ్ ఎంచుకున్నాడు. మొదట బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్ బ్యాటర్లు సమిష్టిగా రాణించారు. వచ్చిన వారందరూ మ్యాచ్‌పై ఇంపాక్ట్ చూపించారు. ఒక్కరు కూడా రెండంకెల కంటే తక్కువ స్కోరు చేయలేదు.
ఓపెనర్లు ప్రభ్‌సిమ్రన్ సింగ్ (23: 12 బంతుల్లో, రెండు ఫోర్లు, రెండు సిక్సర్లు), శిఖర్ ధావన్ (40: 29 బంతుల్లో, ఆరు ఫోర్లు) ఇన్నింగ్స్‌ను వేగంగా ప్రారంభించారు. మొదటి రెండు ఓవర్లలో శిఖర్ ధావన్‌కు స్ట్రైక్ ఇవ్వకుండా ప్రభ్‌సిమ్రన్ చెలరేగి ఆడాడు. రెండు ఫోర్లు, రెండు సిక్సర్లతో చెలరేగాడు. కానీ రెండో ఓవర్ చివరి బంతికి తనని అవుట్ చేసి టిమ్ సౌతీ మొదటి వికెట్ తీశాడు.
వన్‌డౌన్‌లో వచ్చిన భానుక రాజపక్స, శిఖర్ ధావన్ ఇన్నింగ్స్‌ను కుదుటపరిచారు. ఇద్దరూ బౌండరీలు, సిక్సర్లతో స్కోరును పరుగులు పెట్టించారు. దీంతో పంజాబ్ 10 ఓవర్లలోనే 100 పరుగుల మార్కును చేరుకుంది. ఆ తర్వాతి ఓవర్లోనే అర్థ సెంచరీ పూర్తి చేసుకున్న భానుక రాజపక్స భారీ షాట్‌కు ప్రయత్నించి అవుటయ్యాడు.
జితేశ్ శర్మ (21: 11 బంతుల్లో, ఒక ఫోర్, రెండు సిక్సర్లు) రెండు సిక్సర్లతో చెలరేగినా వెంటనే పెవిలియన్ బాట పట్టాడు. తర్వాత వచ్చిన వారందరూ తమకు చేతనైనంత పరుగులు సాధించారు. అయితే మిడిల్ ఓవర్లలో పరుగుల వేగం నెమ్మదించింది. దీంతో ఒక దశలో రెండు వందల మార్కు దాటుతుందనుకున్న పంజాబ్ 192 పరుగులకే పరిమితం అయింది.
కోల్‌కతా నైట్ రైడర్స్ తుది జట్టు
రహ్మానుల్లా గుర్బాజ్(వికెట్ కీపర్), మన్‌దీప్ సింగ్, నితీష్ రాణా(కెప్టెన్), రింకు సింగ్, ఆండ్రీ రస్సెల్, శార్దూల్ ఠాకూర్, సునీల్ నరైన్, టిమ్ సౌథీ, అనుకుల్ రాయ్, ఉమేష్ యాదవ్, వరుణ్ చక్రవర్తి
ఇంపాక్ట్ ప్లేయర్స్
వెంకటేష్ అయ్యర్, వైస్, సుయాష్, వైభవ్, జగదీశన్
పంజాబ్ కింగ్స్ తుది జట్టు
శిఖర్ ధావన్ (కెప్టెన్), ప్రభ్‌సిమ్రాన్ సింగ్ (వికెట్ కీపర్), భానుకా రాజపక్స, జితేష్ శర్మ, షారుక్ ఖాన్, సామ్ కర్రాన్, సికందర్ రజా, నాథన్ ఎల్లిస్, హర్‌ప్రీత్ బ్రార్, రాహుల్ చాహర్, అర్ష్‌దీప్ సింగ్
ఇంపాక్ట్ ప్లేయర్స్
రిషి ధావన్, అథర్వ టైడే, మాథ్యూ షార్ట్, హప్రీత్ సింగ్, మోహిత్ రాఠీ
కేకేఆర్ రెగ్యులర్ కెప్టెన్ అయ్యర్ లేకపోవడంతో (ఫస్టాఫ్ వరకు) నితీశ్ రాణా జట్టును నడిపించనున్నాడు. అనుభవలేమికి అతడికి అడ్డంకిగా మారింది. కెప్టెన్ గానే గాక బ్యాటర్ గా కూడా అయ్యర్ లేని లోటు సుస్పష్టం. అతడితో పాటు టోర్నీలో మూడు మ్యాచ్ లకు బంగ్లాదేశ్ బ్యాటర్ లిటన్ దాస్, ఆల్ రౌండర్ షకిబ్ అల్ హసన్ అందుబాటులో ఉండటం లేదు. కివీస్ బౌలర్ లాకీ ఫెర్గూసన్ ఇంకా జట్టుతో కలవలేదు. డెత్ ఓవర్లలో అతడు లేకపోవడం కేకేఆర్ కు ఎదురుదెబ్బే.