MS Dhoni IPL Future Remains Uncertain as Coach Stephen Fleming Clarifies: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026 సీజన్ లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టు ఎలిమినేషన్ అంచున నిలిచిన తరుణంలో అందరి దృష్టి ఒకే విషయంపై పడింది. వచ్చే సీజన్ లో మహేంద్ర సింగ్ ధోని మళ్లీ ప్లేయర్‌గా ఎల్లో జెర్సీ ధరిస్తారా లేదా అనే చర్చ క్రికెట్ వర్గాల్లో జోరుగా సాగుతోంది. ఈ సీజన్ ప్రారంభానికి ముందే ధోనిని సీఎస్‌కే ఫ్రాంచైజీ ఒక 'అన్‌క్యాప్డ్ ప్లేయర్' కేటగిరీ కింద రిటైన్ చేసుకుంది. జట్టులోని యంగ్ ప్లేయర్లను గైడ్ చేస్తూ వారిని తీర్చిదిద్దడానికి ఆయన ఉపయోగపడతారని మేనేజ్‌మెంట్ భావించింది. అయితే దురదృష్టవశాత్తూ గాయాల కారణంగా ఆయన ఈ సీజన్ మొత్తానికి దూరంగా ఉండాల్సి వచ్చింది. లీగ్ స్టేజ్ లో చెన్నై జట్టుకు ఇంకా కేవలం ఒకే ఒక్క మ్యాచ్ మిగిలి ఉంది. ఈ మొత్తం టోర్నమెంట్‌లో ధోని కనీసం ఒక్కసారి కూడా బ్యాట్ పట్టుకోలేదు, వికెట్ కీపింగ్ గ్లోవ్స్ కూడా ధరించలేదు. ఈ నేపథ్యంలో ధోని భవిష్యత్తు గురించి చెన్నై హెడ్ కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్‌ను ప్రశ్నించగా, ఆయన స్పష్టమైన సమాధానం ఇవ్వకుండా దాటవేశారు. ఇది పూర్తిగా మేనేజ్‌మెంట్ తీసుకోవాల్సిన నిర్ణయమని పేర్కొన్నారు.
డ్రెస్సింగ్ రూమ్‌లో ధోని ఇన్‌ఫ్లుయెన్స్..
స్టీఫెన్ ఫ్లెమింగ్, ఎంఎస్ ధోని ఇద్దరూ సీఎస్‌కే డ్రెస్సింగ్ రూమ్‌లో దశాబ్దాలుగా అత్యంత కీలకమైన వ్యక్తులుగా కొనసాగుతున్నారు. 2008 మొదటి ఐపీఎల్ సీజన్ లో ఫ్లెమింగ్, ధోనితో కలిసి ఆడాడు. ఆ తర్వాత ఆయన చెన్నై జట్టుకు కోచ్‌గా బాధ్యతలు స్వీకరించాడు. ఈ సీజన్ లో ధోని మైదానంలోకి దిగకపోయినప్పటికీ, బ్యాక్‌రూమ్‌లో ఆయన ఉనికి యువ ఆటగాళ్లకు ఎంతో ఉపయోగపడిందని ఫ్లెమింగ్ చెప్పారు. భవిష్యత్తులో ఆడటం అనేది పూర్తిగా మేనేజ్‌మెంట్ ఛాయిస్ అని, దీనిపై బయట చాలా రకాల చర్చలు జరుగుతున్నాయని తనకు తెలుసని అన్నారు. ధోని ఈ ఏడాది జట్టుతోనే ఎక్కువ సమయం గడపడం వల్ల కంటిన్యూటీ పరంగా యంగ్ ప్లేయర్లకు మంచి సపోర్ట్ లభించిందని, జట్టుపై ఆయన ఇన్‌ఫ్లుయెన్స్ చాలా ఎక్కువగా ఉందని వివరించారు.
జట్టు కోసం తాము ఎన్నో మంచి పనులు చేశామని, భవిష్యత్తులో సీఎస్‌కేకు జనరేషన్ ప్లేయర్లుగా మారే కొంతమంది కొత్త కుర్రాళ్లను ఈ సీజన్ లో పరిచయం చేశామని ఫ్లెమింగ్ గుర్తు చేశారు. అయితే క్రికెట్ లో ఎప్పుడైనా రిజల్ట్స్ బట్టే జడ్జ్ చేస్తారని, అది చాలా సహజమని ఒప్పుకున్నారు. అందుకే ధోని తదుపరి సీజన్ లో ఆడటంపై ఫైనల్ డెసిషన్ మేనేజ్‌మెంట్ తీసుకుంటుందని, ఇందులో తన ప్రమేయం ఏమీ ఉండదని కోచ్ స్పష్టం చేశారు.
యువ ఆటగాళ్ల కోసం త్యాగం..
ధోని ఈ సీజన్ లో ఆడకపోవడంపై మొదటి నుండి ఒక పెద్ద సస్పెన్స్ నడుస్తోంది. ఈ వికెట్ కీపర్ బ్యాటర్ గాయంతో బాధపడుతున్నాడని సీఎస్‌కే మేనేజ్‌మెంట్ చెప్తున్నప్పటికీ, సోషల్ మీడియాలో భిన్నమైన థియరీలు వినిపిస్తున్నాయి. యువ ఆటగాళ్లకు ఎక్కువ అవకాశాలు ఇవ్వాలనే ఉద్దేశంతోనే ధోని కావాలనే పక్కన కూర్చున్నాడనే ఊహాగానాలు కూడా వచ్చాయి. సన్‌రైజర్స్ హైదరాబాద్ జరిపిన మ్యాచ్‌కు ముందు ధోని నెట్స్‌లో ప్రాక్టీస్ చేస్తున్నట్లు వార్తలు రావడంతో టీమిండియా లెజెండ్ సునీల్ గవాస్కర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ దశలో ధోని మళ్లీ ఆడటం అంత మంచి ఐడియా కాకపోవచ్చని, చెన్నై జట్టు యువకులకు మరిన్ని ఛాన్సులు ఇవ్వడంపైనే ఫోకస్ పెట్టాలని గవాస్కర్ అభిప్రాయపడ్డాడు.
వచ్చే సీజన్ ఎంట్రీపై వీడని సస్పెన్స్..
ఈ పరిస్థితులన్నింటినీ గమనిస్తే ధోని వచ్చే సీజన్ లో ప్లేయర్‌గా తిరిగి వస్తాడా లేదా అనే ప్రశ్నకు ప్రస్తుతానికైతే సమాధానం దొరికేలా లేదు. ఆయన కేవలం ఒక మెంటార్‌గా మాత్రమే జట్టులో కొనసాగుతాడా లేక మళ్లీ ఫిట్‌నెస్ సాధించి మైదానంలోకి వస్తాడా అనేది మేనేజ్‌మెంట్ అధికారికంగా ప్రకటించే వరకు సస్పెన్స్ గానే మిగిలిపోనుంది. సీఎస్‌కే లీగ్ ముగిసిన తర్వాత దీనిపై ఒక స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తోంది.
