Mayank Yadav Breaks His Own Record For Fastest Ball: ఐపీఎల్(IPL)లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(RCB) పరాజయ పరంపర కొనసాగుతోంది. లక్నో(LSG)తో జరుగుతున్న మ్యాచ్‌లో ఆర్సీబీ ఘోర పరాజయం పాలైంది. 182 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్‌సీబీ.. 19.4 ఓవర్లలో 153 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో ఎల్ఎస్‌జీ 28 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో కూడా యువ సంచలనం మయాంక్ యాదవ్ తన నిప్పులు చెరిగే బంతులతో బెంగళూరు బ్యాటర్లను హడలెత్తించాడు. మయాంక్ చెలరేగిపోవడంతో ఆర్సీబీ బ్యాటర్లు తడబడ్డారు. 4 ఓవర్లలో కేవలం 14 పరుగులు మాత్రమే ఇచ్చి కీలకమైన 3 వికెట్లు పడగొట్టాడు.
లఖ్‌నవూ సూపర్ జెయింట్స్(LSG) యంగ్ పేసర్ మయాంక్ యాదవ్ తన ఐపీఎల్ అరంగేట్రంలోనే అదరగొట్టాడు. గత మ్యాచ్ లోనే వేగవంతమైన బంతిని సంధించి ఇప్పటివరకు ఐపీఎల్-2024లోనే ఫాసెస్ట్ డెలివరీ వేసిన బౌలర్‌గా రికార్డుకెక్కాడు. ఇంకా ఆ రికార్డ్ను క్రికెట్ అభిమానులు మరచవపోఎలోపే మరో రికార్డ్ సృష్టించాడు. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధికంగా మూడుసార్లు గంటకు 155 కిలోమీటర్ల వేగంతో బంతులు వేసి రికార్డుకెక్కాడు. మయాంక్ కేవలం 2 మ్యాచుల్లో 50 కంటే తక్కువ బంతులే వేసి ఈ ఫీట్‌ను సాధించడం విశేషం. మయాంక్ తొలి నుంచి నిలకడగా 145kmph కంటే ఎక్కువ వేగంతో బంతులు వేశాడు. ఒక దశలో మయాంక్ వేసిన బంతి 155.8 kmph వేగంతో దూసుకెళ్లింది. ఈ ఐపీఎల్ లో అత్యంత వేగవంతమైన బంతి అదేకావటం విశేషం. అంటే తన గత రికార్డును తను ఆడిన రెండో మ్యాచ్ లోనే బద్దలు కొట్టాడు.
బ్యాటర్లను బెంబేలెత్తించే మయాంక్ యాదవ్:
ఢిల్లీకి చెందిన 21 సంవత్సరాల పేసర్ మయాంక్ యాదవ్. దేశీవాళీ క్రికెట్‌లో ఢిల్లీ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. ఆ జట్టు తరపున మూడు ఫార్మాట్లలోనూ అతడు అరంగేట్రం చేశాడు. అతడు ఇప్పటివరకు ఒకే ఒక్క ఫస్ట్‌క్లాస్ మ్యాచ్, 17 లిస్ట్-ఏ మ్యాచ్‌లు, 10 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. ఇప్పటివరకు మూడు ఫార్మాట్లలో కలిసి 27 మ్యాచుల్లో 46 వికెట్లు తీశాడు. నార్త్ జోన్ తరఫున ‘దేవధర్ ట్రోఫీ’లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో రెండవ స్థానంలో నిలిచాడు. కేవలం 5 మ్యాచ్‌ల్లోనే 12 వికెట్లు తీసి జాయింట్ వికెట్ టేకర్‌గా నిలిచాడు. దీంతో 2022 ఐపీఎల్ మెగా వేలంలో బేస్ ధర రూ.20 లక్షల మొత్తంతో లక్నో సూపర్ జెయింట్స్ దక్కించుకుంది. కానీ అతడు గాయం కారణంగా ఐపీఎల్-2023 సీజన్‌కు అందుబాటులో లేకుండా పోయాడు. నిన్నటి మ్యాచ్ కి మార్క్ ఉడ్ అందుబాటులో లేకపోవడంతో మయాంక్ యాదవ్‌కు చోటు దక్కింది. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న మయాంక్ తన మొదటి మ్యాచ్ లో 4 ఓవర్లు వేసి, కేవలం 27 పరుగులు ఇచ్చి మూడు కీలకమైన వికెట్లు తీశాడు. ఇక ఇప్పుడు 4 ఓవర్లలో కేవలం 14 పరుగులు మాత్రమే ఇచ్చి కీలకమైన 3 వికెట్లు పడగొట్టాడు. తన ప్రదర్శన గాలివాటం కాదని మయాంక్ యాదవ్ నిరూపించుకున్నాడు.
ఐపీఎల్ చరిత్రలో ఇప్పటి వరకు అత్యంత వేగవంతమైన బంతి వేసింది షాన్ టైట్. అతను వేసిన బంతి 157.7kmph వేగంతో దూసుకెళ్లింది. 2011 ఐపీఎల్ సీజన్‌లో షాన్ టైట్ ఈ ప్రదర్శన చేశాడు.